టీమిండియా ప్రపంచకప్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో అశ్విన్ ను తీసుకుంది బీసీసీఐ. 15 మందితో కూడిన వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టును మరోసారి ప్రకటించింది. ఇప్పటికే రెండు వన్డే వరల్డ్ కప్ లు ఆడిన అశ్విన్.. తన కెరీర్‌లో మూడో వన్డే ప్రపంచకప్ ఆడబోతున్నాడు. 2011, 2015 వన్డే ప్రపంచకప్‌ల తర్వాత ఇప్పుడు 2023 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
లేటెస్ట్ బీసీసీఐ ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మ(కెప్టెన్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యార్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, షమీ, సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.
నిజానికి అశ్విన్ ఎంపికపై గత కొన్ని రోజులుగా కెప్టెన్ రోహిత్ శర్మ హింట్ ఇస్తూనే ఉన్నాడు. అశ్విన్ అనుభవజ్ఞుడని అతడు వరల్డ్ కప్ ఆడే అవకాశాలున్నాయని చెబుతూనే ఉన్నాడు. ఇవాళ్టి వరకు జరిగిన ప్రచారానికి తెరపడింది.
ఇటీవలి కాలంలో టీ20లు, వన్డేలకు దూరంగా ఉంటున్న అశ్విన్.. కేవలం టెస్టులే ఆడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది టీ20 వరల్డ్ కప్ ఆడిన అతను.. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్‌లో కూడా చోటు దక్కించుకోవడం ఆశ్చర్యకరం. వరల్డ్ కప్ మెగా సమరం మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ జరగనుంది.