- ఎదురుందా!..నేడు బంగ్లాదేశ్‌తో ఇండియా ఢీ
- మరో విక్టరీపై రోహిత్‌సేన గురి
- మ. 2 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
పుణె: బలమైన ఆస్ట్రేలియాను పడగొట్టి.. అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసి.. పాకిస్తాన్ వెన్ను విరిచిన టీమిండియా వన్డే వరల్డ్ కప్‌లో మరో విజయంపై గురి పెట్టింది. పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా గురువారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీఫైనల్ రేసులో ముందుకెళ్లాలని చూస్తోంది. బలాబలాలు, ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే ఈ పోరులో టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
అయితే, ఇండియాతో ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో బంగ్లా టైగర్స్ మూడుసార్లు గెలిచారు. 2022 డిసెంబర్‌లో జరిగిన సిరీస్‌లో రెండుసార్లు, మొన్నటి ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించారు. పైగా, వరల్డ్‌కప్‌లో ఇప్పటికే రెండు సంచలనాలు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాకు అఫ్గానిస్తాన్, సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ షాకిచ్చాయి. ఈ నేపథ్యంలో బంగ్లాకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా ఆడాలని, ఆసియా కప్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇండియా భావిస్తోంది.
అన్నింటా జోరు
టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ టీమ్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. ఆసీస్‌తో తొలి పోరులో డకౌటైన తర్వాత రోహిత్ బలంగా పుంజుకున్నాడు. అఫ్గాన్‌పై మెరుపు సెంచరీ చేసిన అతను పాక్‌పైనా సిక్సర్ల వర్షంతో విరుచుకుపడి మ్యాచ్‌ను వన్‌సైడ్ చేశాడు. తను అదే జోరు కొనసాగిస్తే టీమిండియా సెమీస్ రేసులో మరో అడుగు ముందుకు వేయనుంది. ఇక జ్వరం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన గిల్ గత పోరులో మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఏడాదిగా ఈ ఫార్మాట్‌లో దంచికొడుతున్న యంగ్‌స్టర్ మెగా టోర్నీలోనూ తనదైన ముద్ర వేయాలని ఆత్రుతగా ఉన్నాడు. వరుసగా రెండు ఫిఫ్టీల తర్వాత పాక్‌పై తడబడిన బ్యాటింగ్ లెజెండ్ విరాట్ కోహ్లీ కూడా బ్యాట్ ఝుళిపించాలని చూస్తున్నాడు.
పాక్‌పై హాఫ్ సెంచరీతో శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లోకి రావడంతో మిడిలార్డర్ కూడా బలంగా మారింది. బ్యాటింగ్‌కు అనుకూలించే పుణె వికెట్‌ను ఉపయోగించుకొని బంగ్లా పని పట్టాలని రోహిత్‌సేన కోరుకుంటోంది. బౌలింగ్‌లోనూ టీమ్‌కు ఎలాంటి సమస్య లేదు. ఆస్ట్రేలియాను 199, పాకిస్తాన్‌ను 191 రన్స్‌కే కట్టడి చేయడం మన బౌలింగ్ బలానికి నిదర్శనం. బౌలర్లు సమష్టిగా ముందుకెళ్తున్నారు. పేస్ లీడర్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్‌కు సిరాజ్, పాండ్యా నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. దాంతో ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా తుదిజట్టును మార్చకుండా విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశం ఉంది.
బరిలోకి షకీబ్
పేరుకు చిన్న జట్టే అయినా బంగ్లాదేశ్ తనదైన రోజు ఎలాంటి ప్రత్యర్థినైనా ఓడిస్తుంది. మరీ ముఖ్యంగా ఇండియాకు ఆ టీమ్ ప్రతీసారి సవాల్ విసురుతుంది. ఆ టీమ్ కీలక ప్లేయర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఎడమ కాలు గాయం నుంచి కోలుకొని ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు రెడీ అయ్యాడు. ఇండియాపై అతను బంగ్లా టీమ్‌కు కీలకం కానున్నాడు. తొలి మ్యాచ్‌లో అఫ్గాన్‌ను ఓడించి బోణీ చేసిన బంగ్లా గత రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో ఓడితే సెమీస్ అవకాశాలు సన్నగిల్లే అవకాశం ఉండటంతో టీమిండియాపై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
గత మూడు మ్యాచ్‌ల్లో లిటన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్ చెరో ఫిఫ్టీతో టచ్‌లో ఉన్నప్పటికీ.. యంగ్ బ్యాటర్లు నజ్ముల్ శాంటో, తౌహిద్ నుంచి సహకారం అవసరం. మిడిలార్డర్‌లో ముష్ఫికర్ రహీమ్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. పేసర్ తస్కిన్ అహ్మద్ ఫామ్ కోల్పోవడం జట్టుపై ప్రభావం చూపుతోంది. ముస్తాఫిజుర్ కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు. మరి జోరు మీదున్న రోహిత్‌సేనను బంగ్లా ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి.
పిచ్/వాతావరణం
ఎంసీఏ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం. 2017 నుంచి పుణెలో జరిగిన ఐదు వన్డేల్లో మూడింటిలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 300 ప్లస్ స్కోర్లు చేశాయి. అయితే, తొమ్మిది నెలల్లో ఈ వేదికపై ఇదే మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ కానుంది. మ్యాచ్ ముందురోజు కొన్ని చినుకులు పడ్డాయి. అయితే, గురువారం వాన ముప్పు లేదు. మధ్యాహ్నం ఎండ ఉండనుంది.
గత 25 ఏండ్లలో ఇండియా గడ్డపై టీమిండియాతో బంగ్లాదేశ్‌కు ఇదే తొలి వన్డే. చివరగా 1998లో వాంఖడే స్టేడియంలో ఇండియాతో పోటీ పడింది.
తుది జట్టు (అంచనా)
ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, జడేజా, శార్దూల్, బుమ్రా, కుల్దీప్, సిరాజ్.
బంగ్లాదేశ్: తంజిద్ హసన్, లిటన్ దాస్, నజ్ముల్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తౌహిద్ హ్రిదోయ్, ముష్ఫికర్ రహీమ్ (కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, మహ్ముదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్