వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా ఇండియా- పాకిస్తాన్ తలపడనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీ కావడంతో.. ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలని ఆశించని అభిమాని ఉండరు. అయితే, భారత్ మ్యాచ్‌లకు టికెట్లు దొరకడం కష్టతరమవుతోంది. బుకింగ్స్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే సోల్డ్ ఔట్ అని దర్శనిమిస్తున్నాయి.
ఇండియా- పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ల విక్రయాలు ఇవాళ (సెప్టెంబర్ 3) అందుబాటులోకి రానున్నాయి. హైవోల్టేజ్ మ్యాచ్ కనుక క్షణాల వ్యవధిలోనే అయిపోవడం ఖాయం. ఈ క్రమంలో కాస్త ముందుగానే సైట్ ఓపెన్ చేసి.. కొనుగోలుకు సిద్ధంగా ఉండండి. టికెట్లు కావాలనుకున్న వారు ముందుగా ఐసీసీ అధికారిక టికెటింగ్ వెబ్‌సైట్ https://tickets.cricketworldcup.com లేదా BookMyShowని సందర్శించండి.
రాత్రి 8 గంటలకు
ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ల విక్రయాలు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి. అభిమానులు BookMyShow మరియు ఐసీసీ అధికారిక వెబ్‌సైట్ tickets.cricketworldcup.comలో టికెట్లను కొనుగోలు చేయవచ్చు. చెన్నై, పూణె, ధర్మశాల, ముంబయి, లక్నో, ఢిల్లీ, కోల్‌కతా మరియు బెంగుళూరు వేదికగా జరిగే టీమిండియా మ్యాచ్ ల టికెట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
ఎలా బుక్ చేసుకోవాలంటే..?
- ముందుగా BookMyShow లేదా https://tickets.cricketworldcup.comని సందర్శించండి.
- అనంతరం మీరు ఏ నగరంలో అయితే మ్యాచ్ చూడాలనుకుంటున్నారో ఆ నగరాన్ని ఎంచుకోండి.
- ఇప్పుడు మీకు నచ్చిన మ్యాచ్ ను ఎంపిక చేయండి.
- స్క్రీన్‌పై కనిపించే 'బుక్(Book)' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- లాగిన్ ప్రాంప్ట్ కనిపిస్తుంది. మీకు ఖాతా ఉంటే లాగిన్ అవ్వడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
- ఇప్పుడు మీకు టికెట్లు కొనాలనుకుంటున్న సీటింగ్ ప్రాంతాన్ని ఎంచుకోండి.
- అనంతరం 'బుక్' బటన్‌పై క్లిక్ చేయండి.
- టికెట్ల హోమ్ డెలివరీ కోసం పిన్‌కోడ్‌ను ఎంటర్ చేయండి.
- మీకు అవసరమైన వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి.
- 'ప్రొసీడ్ టు పే'పై క్లిక్ చేసి టికెట్ ధరల మొత్తాన్ని చెల్లించి.. టికెట్ కంఫర్మ్ చేసుకోండి.
గమనిక: రద్దీ దృష్ట్యా కాస్త సమయం పడుతుంది. తిరిగి వెనకకు మర్లకుండా.. కాస్త సహనం పాటించండి. మీ సమయం వచ్చినప్పుడు టికెట్ల విక్రయాల పేజీ ఓపెన్ అవుతుంది.