సంజు శాంసన్‌కు జట్టులో చోటు లేదు.. తేల్చేసిన అశ్విన్

సంజు శాంసన్‌కు జట్టులో చోటు లేదు.. తేల్చేసిన అశ్విన్

భారత జట్టులో ఎక్కువగా అన్యాయం జరుగుతోంది ఎవరికి అని అడిగితే అందరూ చెప్పే పేరు సంజూ శాంసన్. టాలెంట్ ఉన్నా.. అతనికి తగిన అవకాశాలు రావడం లేదన్నది అభిమానుల వాదన. మరి వచ్చిన అవకాశాలను అతను సద్వినాయగం చేసుకుంటున్నాడా? అంటే అదీ లేదు. అడపాదడపా హాఫ్ సెంచరీలు చేయడం తప్ప.. చెప్పుకోదగ్గ మంచి ఇన్నింగ్స్ ఒక్కటీ లేదు.

వన్డే ప్రపంచ కప్ 2023కి మరో రెండు నెలల గడువు మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ.. భారత జట్టు ఎంపిక ఓ కొలిక్కి రాలేదు. అందివచ్చిన అవకాశాలను యువ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోవడం లేదు. వరుసగా విఫలమవుతూ సెలెక్టర్లకే తలనొప్పిగా మారుతున్నారు.

సూర్య దారిలోనే సంజు శాంసన్‌ 

తొలి మూడు స్థానాలకు శుభ్ మాన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫిక్స్ కాగా.. నాలుగు, ఐదు స్థానంలో రాణించగల సమర్థులు ఎవరన్నది తేలడం లేదు. టీ20లలో చెలరేగి ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్.. వన్డేల్లో మాత్రం తేలిపోతున్నాడు. ఎన్ని అవకాశాలిచ్చినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయటం లేదు. అలా అని సూర్య విఫలమైనా.. వరల్డ్ కప్ జట్టుకు అతన్ని పక్కనపెట్టే సాహసం చేయకపోవచ్చు. 

ఇక యువ క్రికెటర్ సంజు శాంసన్‌ కూడా పెద్దగా రాణించడం లేదు. అడపాదడపా హాఫ్ సెంచరీలు చేయడం తప్ప.. చెప్పుకోదగ్గ మంచి ఇన్నింగ్స్ ఒక్కటీ లేదు. ఇటీవల విండీస్ తో వన్డే సిరీస్ లో  నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సాంసన్.. ఒక్క హాఫ్ సెంచరీ మినహా రాణించింది లేదు. ఇలాంటి ప్రదర్శనతో శాంసన్‌కు వన్డేల్లో చోటు దక్కడం కష్టమని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చారు. వరల్డ్ కప్ జట్టులో శాంసన్‌కు చోటు ఉంటుందా ? అన్న ప్రశ్నకు అశ్విన్ ఇలా బదులిచ్చారు.

"శాంసన్‌ మంచి ఆటగాడే.. ఏ సమయంలోనైనా మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగల సమర్థుడే కాదనను. అయితే జట్టు విషయానికి వస్తే అతని నుంచి మనం ఆశించే పాత్ర వేరు. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తే.. టాప్-4లో అతనికి చోటుదక్కడం కష్టం. వరల్డ్ కప్ తర్వాత లేదా ఒకటి, రెండు సంవత్సరాల తర్వాత అతనికి స్థానం ఉంటుందా అన్న దానికి మనం వేచిచూడాలి."

"ఎందుకంటే విరాట్ 3వ ర్యాంక్ ఫిక్స్ అయ్యాడు. రోహిత్, గిల్ కూడా ఓపెనర్లుగా ఫిక్స్ అయ్యారు. శ్రేయాస్, రాహుల్ కూడా ఫిట్‌గా ఉంటారనుకుంటున్నా. బ్యాకప్‌గా మాకు కీపర్-బ్యాటర్ మాత్రమే అవసరం. కానీ సంజు ఐపీఎల్‌లో ఆ పాత్ర చేయడం లేదు. విండీస్ తో జరిగిన మ్యాచ్ లో అతను 50 పరుగులు చేయటం భారత జట్టుకు శుభవార్తె. వీలైనంత వరకు వరల్డ్ కప్‌ రేసులో సంజు ఉంటాడని నేను భావిస్తున్నా.." అని అశ్విన్ తెలిపారు. 

కాగా, అక్టోబర్ 5న వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభంకానుండగా.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ తో టీమిండియా తన ప్రపంచకప్ పోరును ప్రారంభించనుంది.