వరల్డ్ కప్ 2023: దేశంలోకి పాక్ సెక్యూరిటీ బలగాలు

వరల్డ్ కప్ 2023: దేశంలోకి పాక్ సెక్యూరిటీ బలగాలు

దాయాది దేశం పాకిస్తాన్‌లో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. ఎల్లప్పుడూ బాంబుల మోతతో దద్దరిల్లే పాక్‌లో నివసించడానికి అక్కడి జనాలు జంకుతుంటారు. ఈ భయంతోనే పాక్ లో మ్యాచులు ఆడేందుకు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు అంగీకరించవు. గతంలో శ్రీలంక జట్టు.. పాక్‌లో పర్యటించినప్పుడు ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపైనే దాడి జరిగింది. ఆనాటి నుంచి అక్కడ  పర్యటించాలంటేనే ప్రత్యర్థి జట్లకు వణుకు. 

ఈ కారణంతోనే ఆసియా కప్ 2023 పర్యటనకు బీసీసీఐ వెనకడుగు వేసింది. పర్యటించలేమని తేల్చి చెప్పింది. దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అందుకు ఈ ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని పావుగా వాడుకుంటోంది. టోర్నీ ప్రారంభానికి ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ.. భారత్‌పై బురద చల్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. 

వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన పాక్.. అహ్మదాబాద్ వేదిక భద్రతపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలసిందే. పలు వేదికలను మార్చాలంటూ విజ్ఞప్తి చేసింది. అయితే అందుకు బీసీసీఐ అంగీకరించలేదు. వీటిని నిరాధార ఆరోపణలుగా కొట్టిపడేసింది. ఇక లాభం లేదనుకున్న పాక్.. మరో ఎత్తుగడతో ముందుకొచ్చింది. ఇండియాలో పాకిస్తాన్ జట్టుకు భద్రత ఉండదని ఐసీసీకి నివేదించింది. ఈ క్రమంలోనే పాక్ మ్యాచులు ఆడే నగరాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు.. ఓ సెక్యూరిటీ బృందాన్ని ఇండియాకి పంపేందుకు అనుమతులు తీసుకుంది.

త్వరలోనే పీసీబీ కొత్త అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి. అవి ముగిశాక పాక్ క్రికెట్ బోర్డు తరుపున కొందరు సెక్యూరిటీ అధికారులు ఇండియాలో పర్యటించి.. ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న వైరం కారణంగా ఊరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడంలేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే తలపడుతున్నాయి. 2011 వన్డే వరల్డ్ కప్, 2016 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఇండియాలో పర్యటించిన పాక్ క్రికెట్ జట్టు.. ఏడేళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో అడుగుపెట్టబోతోంది.

వన్డే వరల్డ్ కప్‌ 2023లో భాగంగా అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.