అఫ్గాన్ టార్గెట్ 225 రన్స్.. 49 ఓవర్లలో 209/7.. గెలవాలంటే 6 బంతుల్లో 16 రన్స్ కావాలి. క్రీజులో భారీ హిట్టర్ నబీ ఉన్నాడు. రెండు సిక్సర్లు బాదినా.. మ్యాచ్ అఫ్గాన్‌దే. టీవీల ముందున్న వారు.. స్టేడియంలో చూస్తున్నవారు చాలా మంది దాదాపుగా ఆశలు వదిలేసుకున్నారు..! కానీ ఆఖరి ఓవర్‌లో షమీ అద్భుతం క్రియేట్ చేయడంతో ఇండియా గ్రేట్‌ఎస్కేప్ అయ్యింది. షమీ వేసిన తొలి బంతి ఫుల్ టాస్‌కు బౌండరీ దాటింది. రెండో బాల్‌కు రన్ తీయలేదు. ఇక విజయ సమీకరణం 4 బంతుల్లో 12 రన్స్. కానీ షమీ.. మూడో బంతికి నబీ, నాలుగో బంతికి ఆఫ్తాబ్, ఐదో బంతికి ముజీబుర్‌ను ఔట్ చేసి మరో బాల్ మిగిలి ఉండగానే టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు. హ్యాట్రిక్‌తో వరల్డ్‌కప్‌లో చేతన్ శర్మ సరసన నిలిచాడు.
సౌతాంప్టన్: ప్రత్యర్థి పసికూన అని తేలికగా తీసుకున్నా.. అవసరమైన సమయంలో గట్టిగా పోరాటం చేసిన టీమిండియా.. వరల్డ్‌కప్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌పై గెలిచింది. ముందుగా ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (105 బంతుల్లో 5 ఫోర్లతో 67), కేదార్ జాదవ్ (68 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 52) మాత్రమే రాణించారు. తర్వాత అఫ్గానిస్థాన్ 49.5 ఓవర్లలో 213 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్ నబీ (52), రహమత్ షా (36) మెరుగ్గా ఆడినా మిగతా వారు నిరాశపర్చారు. షమీ (4/40) హ్యాట్రిక్‌తో రెచ్చిపోయాడు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఓడిన అఫ్గాన్ సెమీస్ రేసుకు దూరమైంది. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
నబీ ఒక్కడే..
చిన్న టార్గెట్‌ను కాపాడుకోవడానికి ఇండియా బౌలర్లు తీవ్రంగానే శ్రమించారు. లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేస్తూ భారీ భాగస్వామ్యాలు కాకుండా అడ్డుకున్నారు. ఆరంభంలో ఓ రివ్యూ వృథా చేసుకున్నా.. ఏడో ఓవర్‌లోనే హజ్రతుల్లా (10)ను ఔట్ చేయడంతో వికెట్ల పతనం మొదలైంది. 10 ఓవర్లలో 37 పరుగులే చేసిన అఫ్గాన్‌ను రహమత్ షా గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో కాస్త కోలుకున్నట్లు కనిపించినా.. బుమ్రా (2/39), హార్దిక్ (2/51) దెబ్బకు కుదేలైంది. రహమత్ షా… గుల్బాదిన్ (27)తో రెండో వికెట్‌కు 44, హష్మతుల్లా (21)తో మూడో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం నిర్మించడంతో అఫ్గాన్ స్కోరు 27 ఓవర్లలో 100 పరుగులకు చేరింది. 29వ ఓవర్‌లో బుమ్రా మూడు బంతుల తేడాలో షా, హష్మతుల్లాను ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన అస్గర్ (8) కూడా నిరాశపర్చడంతో అఫ్గాన్ 35 ఓవర్లలో సగం జట్టు పెవిలియన్‌కు చేరింది. నబీ, జద్రాన్ (21) కాసేపు పోరాడటంతో ఆరో వికెట్‌కు 36 రన్స్ సమకూరాయి. కానీ హార్దిక్ స్లో బంతి దెబ్బకు జద్రాన్ ఔట్‌కావడంతో రషీద్ (14) క్రీజులోకి వచ్చాడు. లక్ష్యం పెరిగిపోవడంతో రెండో ఎండ్‌లో నబీ.. షాట్లకు తెరలేపాడు. కానీ రషీద్ ఔట్‌తో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇక విజయానికి 26 బంతుల్లో 35 పరుగులు కావాల్సిన దశలో నబీ, ఇక్రామ్ (7 నాటౌట్) మంచి సమన్వయంతో ఆడారు. బుమ్రా బౌలింగ్‌లో నబీ భారీ సిక్సర్‌తో రెచ్చిపోయినా చివర్లో షమీ హ్యాట్రిక్‌తో ఇండియా విజయాన్ని అందుకుంది.
మిడిల్ ఢమాల్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా భారీ స్కోరుకు.. అఫ్గాన్ సూపర్ బౌలింగ్‌తో కళ్లెం వేసింది. గత మూడు మ్యాచ్‌ల్లో విరాట్‌సేన 14 వికెట్లు కోల్పోతే ఒక్కటి కూడా స్పిన్నర్లకు దక్కలేదు. కానీ ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ స్పిన్ త్రయం ముజీబుర్ (1/26), రషీద్ (1/38), నబీ (2/33) ముప్పేటా చేసిన దాడిలో టీమిండియా మిడిలార్డర్ ఢమాల్ కొట్టింది. ఇంగ్లండ్‌పై 25 సిక్సర్లు సమర్పించుకున్న అఫ్గాన్ ఈ మ్యాచ్‌లో బౌలింగ్ క్రమశిక్షణను చూపెట్టింది. దాదాపు 152 డాట్ బాల్స్ (25.2 ఓవర్లు) వేసింది. దీంతో ఇండియా ఇన్నింగ్స్ అనుకున్నంత వేగంగా సాగలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ముజీబుర్.. ఓపెనర్ రోహిత్ (1)ను డిఫెన్సివ్‌లో పడేశాడు. 5వ ఓవర్‌లో అద్భుతమైన దూస్రాతో ఈ ముంబైకర్‌కు చెక్ పెట్టాడు. దీంతో ఇండియా 7 రన్స్‌కే తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ (30), కోహ్లీ నెమ్మదిగా ఆడటంతో 10 ఓవర్లలో 41 పరుగులే వచ్చాయి. బంతి బ్యాట్ మీదకు రాకపోవడంతో ఈ ఇద్దరు ఆచితూచి ఆడినా.. రాహుల్ అత్యుత్సాహం కొంప ముంచింది. నబీ బౌలింగ్‌లో అనవసరంగా రివర్స్ స్వీప్‌కు ట్రై చేసి షార్ట్ థర్డ్ మ్యాన్‌లో హజ్రతుల్లా చేతికి చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
రషీద్ ఓవర్లలో స్వేచ్చగా కవర్‌డ్రైవ్స్ కొట్టిన విరాట్ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అవతలివైపు విజయ్ శంకర్ (29) సింగిల్స్‌తో కెప్టెన్‌కు సహకారం అందించాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. కానీ స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్‌కావడంతో ఇన్నింగ్స్‌లో మూమెంటమ్ దెబ్బతిన్నది. సీమర్లు ఎక్కువగా స్లో బాల్స్ వేయడంతో ధోనీ (28), జాదవ్ భారీ షాట్లు కొట్టలేకపోయారు. జాదవ్ టైమింగ్‌లో, మహీ స్ట్రయిక్ రొటేషన్‌లో విఫలమయ్యారు. మ్యాచ్ మధ్యలో 14 ఓవర్లు ఆడిన ఈ జోడీ 57 రన్స్ మాత్రమే చేసింది. 46వ ఓవర్‌లో ఇండియా స్కోరు 200లకు చేరింది. జాదవ్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసినా.. ధోనీ ఔట్‌తో క్రీజులోకి వచ్చిన హార్దిక్ (1)పై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. చివర్లో గుల్బాదిన్ (2/51) చకచకా వికెట్లు తీయడంతో టీమిండియా ఓ మాదిరి టార్గెట్‌నే నిర్దేశించింది.