జాబ్స్ ఇవ్వకపోతే ఇబ్బందే

నిరుద్యోగ సమస్యపై  ప్రభుత్వం ఎన్ని కబుర్లు చెప్పినా చదువుకున్నోళ్లకు కొలువులు దొరకడం లేదన్నది వాస్తవం. మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే నిరుద్యోగం ఏడాదికేడాది పెరుగుతోందని వివిధ సంస్థల రిపోర్టులు  స్పష్టం చేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ‘వరల్డ్ ఎంప్లాయ్​మెంట్ అండ్ సోషల్ అవుట్’ రిపోర్టు పేర్కొంది.

ఉద్యోగాలు వచ్చేటట్టుగా పథకాలు రూపొందించడం  చాలా ముఖ్యం. ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకపోవడానికి రకరకాల సాకులు చెబుతున్నాయి ప్రభుత్వాలు. ఈ సమస్య చాలా తీవ్రమైనా పట్టించుకోవడం లేదు. కొన్ని సార్లు ఈ ఏడాదిలో ఇంత మందికి ఉద్యోగాలు కల్పించామంటూ అంకెల గారడీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నాయి. ఉద్యోగాలు వచ్చేట్టుగా చేయడమంటే చిన్న విషయం కాదు. దీని కోసం ప్రభుత్వాలు చాలానే చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగంలోని ఖాళీలను గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి యాక్షన్ ప్లాన్ చేపట్టాలి.  ప్రైవేటు రంగాన్ని తీసుకుంటే అక్కడ నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. దీని కోసం నిరుద్యోగులకు ఆయా రంగాల్లో నైపుణ్యం పెంచడానికి చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్రత్యేక ట్రైనింగ్​ ఇవ్వాలి. సొంతంగా వ్యాపారాలు పెట్టుకునే విధంగా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. పరిశ్రమలు పెట్టుకోవడానికి నిరుద్యోగులు ముందుకువస్తే ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు సబ్సిడీ పై లోన్లు ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపాలి.

ప్రత్యేక స్కీమ్​లుండాలి

గ్రామీణ యువతకు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమలు పెట్టుకోవడానికి నిధులు ఇవ్వడం అవసరం. వాణిజ్య పంటలను పండించుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి. ఎప్పుడు ఏ పంటలు వేస్తే లాభాలు వస్తాయో పల్లె యువతకు అవగాహన పెంచాలి. ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చుని నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కొన్ని ప్రత్యేక పథకాలు రూపొందించి అవి అమలయ్యేలా చూడాలి. అలా చేస్తేనే నిరుద్యోగం పూర్తిగా కాకపోయినా చాలా వరకు తగ్గుతుంది.                                                                                                                              – డా. పోలం సైదులు, హైదరాబాద్​

గ్రూప్–1 ఎప్పుడో?

తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి టీఆర్​ఎస్​ గవర్నమెంట్​ ఏర్పడి ఏడాది దాటిపోయినా ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా రాలేదు. రాష్ట్రంలో గ్రూప్–1, గ్రూప్–3 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. వీటిపై నిరుద్యోగులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అయితే కొత్త జోనల్ విధానంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఈ ఉద్యోగాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ ఇవ్వలేకపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు గ్రూప్–1 ఉద్యోగాల ప్రకటనే రాలేదు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ఉండగా 2011లో గ్రూప్–1 నోటిఫికేషన్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో కొత్త జోనల్ వ్యవస్థపై ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా క్లారిటీ ఇచ్చి ఉద్యోగాల ప్రకటన చేయాలని తెలంగాణ నిరుద్యోగులు కోరుతున్నారు.                                                                                                             – కేఎస్ బాబు, హైదరాబాద్​.

world-employment-and-social-outcomes-report-on-unemployment-in-our-country