ఒకేసారి 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఓం ఆకారంలోని శివాలయానికి వెళ్ళండి. ప్రపంచంలోనే ఓం ఆకారంలో ఉన్న ఏకైక శివాలయం ఎక్కడ ఉంది.. దాని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. . .
భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యకలిగించేవి ఉంటే మరికొన్ని అంతుచిక్కని రహస్యాలు కలిగినవి ఉన్నాయి. అటువంటి ఆలయం ఇది. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఇది ఓం ఆకారంలో ఉంటుంది. అయోధ్య మందిరం మాదిరిగానే నాగర నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకారంలో ఉన్న శివాలయం రాజస్థాన్‌లోని పాలిలో ఉంది. ఆలయ వైభవాన్నియ చూసిన తర్వాత మీ కళ్లు మెరిసిపోతాయి. దాదాపు 250 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ దేవాలయంలో ప్రధానంగా యజ్ఞవేది వంటి రెండు అంతస్తుల గురుకులం, స్వస్తిక్ ఆకారంలో హాస్టల్, నక్షత్రాకారంలో ఉన్న ఆసుపత్రి భవనం ఉన్నాయి.
ప్రపంచంలో ఓంకార ఆకారంలో ఉన్న ఏకైక దేవాలయం ఇదే. ఆలయంలో పర్వతాలు మరియు చెరువులు కూడా కృత్రిమంగా నిర్మించారు. నాలుగు అంతస్తుల భవనం, 250 ఎకరాల్లో 108 గదులు ఓంకార ఆకారాన్ని గుర్తించే విధంగా నిర్మించారు. ఇందులో 12 జ్యోతిర్లింగాల రూపంలో శివుని ఆలయం ఉంది. 1008 శివుని ప్రతిమలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఓం ఆకారంలో ఉన్న మొట్ట మొదటి శివాలయం. రాజస్థాన్ లోని పాలి జిల్లాలో జదమ్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. పచ్చని ప్రకృతి అందాల నడుమ ఈ ప్రత్యేకమైన ఆలయాన్ని నిర్మించారు.
అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఓం అనేది ఒకటి. విశ్వంలో ఓంకారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కులమతాలకి అతీతంగా ప్రతీ ఒక్కరి నోటి నుంచి ఓంకారం వస్తుంది. ధ్యానం, ఆధ్యాత్మికత, శివుడికి చిహ్నంగా భావిస్తారు. అనేక మంత్రాలు కూడా ఓం తోనే ప్రారంభమవుతాయి. అటువంటి ఓం ప్రాముఖ్యతని దృష్టిలో ఉంచుకుని ఈ శివాలయాన్ని నిర్మించారు.
వెయ్యి విగ్రహాలు.. 12 జ్యోతిర్లింగాలు
ప్రముఖ శైవ క్షేత్రాలుగా పరిగణించే జ్యోతిర్లింగాలు పన్నెండు ఒక్కొక్కటి ఒక్కో ప్రదేశంలో ఉన్నాయి. కానీ వాటన్నింటినీ ఒకేసారి సందర్శించుకోవాలని అనుకుంటే మాత్రం ఈ ఆలయాన్ని వెళ్ళాల్సిందే. ఇక్కడ 1008 శివుడు విగ్రహాలు, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఆలయం పై భాగంలో ధోల్ పూర్ నుంచి తెచ్చిన రాయితో చేసిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఆలయం నాలుగు విభాగాలుగా నిర్మించారు. ఒక భాగం మొత్తం భూగర్భంలో ఉంటుంది. మిగిలిన మూడు భాగాలు భూమి మీద ఉంటాయి. ఆలయం మధ్యలో స్వామి మాధవానంద సమాధి ఉంది. నేలమాళిగలో సమాధి చుట్టూ ఏడుగురు మహర్షుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం ఆవరణలో 108 గదులు ఉన్నాయి. 2000 స్తంభాలు ఉన్నాయి. ఆలయ శిఖరం 135 అడుగులు. నాలుగు అంతస్తుల ఈ ఆలయంలో పాఠశాల, కాలేజీ కూడా ఉంది.
విశ్వదీప్ గురుకుల్ ట్రస్ట్ ఈ ఆలయాన్ని నిర్మించింది. ధోల్ పూర్ లోని బంషి పర్వత రాయిని ఆశ్రమ నిర్మాణం కోసం ఉపయోగించారు. ఆలయం అడుగు భాగాన రెండు లక్షల టన్నుల సామర్థ్యంతో వాటర్ ట్యాంక్ నిర్మించారు. ఈ ఆలయం గొప్ప ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాముఖ్యతని కలిగి ఉంది. నాగర నిర్మాణ శైలిలోనే దీన్ని రూపొందించారు. భారతీయుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఆలయాన్ని దర్శిస్తే 12 జ్యోతిర్లింగాలు ఒకేసారి దర్శించుకున్న తృప్తి పొందుతారు.