World Food Day: ఆహారం అందరి హక్కు

World Food Day: ఆహారం అందరి హక్కు

గాలి, నీరు తర్వాత ఆహారం మూడవ అత్యంత ప్రాథమిక మానవ అవసరం. ప్రతి ఒక్కరికీ తగిన ఆహారం తీసుకునే  హక్కు ఉంది. అంతర్జాతీయ ఒప్పందాలు, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ప్రకారం ప్రతి ఒక్కరికీ ఆహారం, జీవితం, స్వేచ్ఛ, పని, విద్య వంటి హక్కులు ఉండాల్సిందే. వైవిధ్యం, పోషణ, స్థోమత, అందుబాటు, భద్రతతో కూడిన పోషక  విలువలున్న ఆహారం అందరికీ అందాలి. మెరుగైన జీవితం, మంచి భవిష్యత్తుకి ఆహార హక్కు అనే థీమ్ తో ఈ ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవాన్ని (అక్టోబర్ 16 ) నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ప్రపంచ జనాభా కంటే ఎక్కువ మందికి తగినంత ఆహారాన్ని రైతులు  ఉత్పత్తి చేస్తున్నారు. అయినప్పటికీ ఎంతోమంది ఆకలికి కటకటలాడుతున్నారు. వాతావరణ మార్పులు, సంఘర్షణలు, ఆర్థిక మాంద్యం, అసమానత, తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా 733 మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్నారు.

పేదలు, బలహీన వర్గాలను ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వీరిలో చాలామంది వ్యవసాయ కుటుంబాలకు చెందినవారే. ప్రపంచంలోని 2.8 బిలియన్లకు పైగా ప్రజలు పౌష్టిక ఆహారాన్ని పొందలేకపోతున్నారు. పోషకాహార లోపానికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారం. సూక్ష్మపోషక లోపాలతో ఊబకాయం, ఇతర జబ్బుల బారిన ప్రజలు పడుతున్నారు. సామాజిక-, ఆర్థిక అభివృద్ధి జరుగుతున్నప్పటికీ చాలామంది ఆకలితో బాధపడుతున్నారు. పౌష్టిక ఆహారాన్ని కొనుగోలు చేయలేకపోతున్నారు. విపరీత వాతావరణ మార్పులు, సంఘర్షణలు, దీర్ఘకాలిక సంక్షోభాల వల్ల ఆకలి,  పోషకాహార లోపం మరింత తీవ్రమవుతోంది.  విపత్తులు, సంక్షోభాలకు, ముఖ్యంగా వాతావరణ మార్పుల ప్రభావాలకు అగ్రిఫుడ్ వ్యవస్థలు గురవుతున్నాయి.  నేల, నీరు, గాలి  కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి.  గ్రీన్‌‌హౌస్ వాయు ఉద్గారాలకు, జీవవైవిధ్య నష్టానికి దోహదం చేస్తున్నాయి. అగ్రిఫుడ్ వ్యవస్థల బలోపేతం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించవచ్చు.  స్థితిస్థాపకత, సమ్మిళిత జీవనోపాధికి మద్దతు ఇవ్వడానికి ఇది దోహదపడుతుంది.

భారతదేశం కీలక పాత్ర

సుగంధ ద్రవ్యాలు, పాలు, పప్పులలో ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ఉత్పత్తిదారు. టీ, చెరకు ఉత్పత్తిలో, గోధుమలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో  రెండో అతిపెద్ద ఉత్పత్తిదారు మనదేశం.​స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), ఉపాధి, ఎగుమతులు మొదలైన వాటికి సహకారం అందించడంలో భారత ఆర్థిక వ్యవస్థలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఒక ముఖ్యమైన భాగంగా ఉద్భవించాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు, మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం ఫుడ్ ప్రాసెసింగ్ రంగం దాదాపు 5.35% సగటు వార్షిక వృద్ధి రేటును సాధించింది. 

ఫుడ్ ప్రాసెసింగ్​లో ప్రోత్సాహక పథకాలు

ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ మొత్తం అభివృద్ధిని నిర్ధారించడానికి, వివిధ సవాళ్లను అధిగమించడంలో సహాయపడటానికి ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొన్ని పథకాలను అమలుచేస్తోంది. ప్రధాన్ మంత్రి కిసాన్  సంపద యోజన (పీఎంకేఎస్​వై), ఆహార ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం, కేంద్ర ప్రాయోజిత పథకం పీఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌‌ప్రైజెస్ (పీఎంఎఫ్​ఎంఇ) ఉన్నాయి. దేశవ్యాప్తంగా పీఎంకేఎస్ వైని అమలు చేయడం ద్వారా ఉపాధి అవకాశాల కల్పన, వ్యవసాయోత్పత్తుల వృథాను తగ్గిస్తోంది.వ్యవసాయ క్షేత్రం నుంచి రిటైల్ అవుట్‌‌లెట్ వరకు సమర్థవంతమైన సరఫరా గొలుసు నిర్వహణతో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలోసహాయపడుతుంది. మొత్తం మీద అందరికీ ఆహారం అనేది నెరవేరాలంటే, కాలంతోపాటు ఆహారోత్పత్తులను ప్రోత్సహించాలి.

- డా. సునీల్ కుమార్ పోతన,
జర్నలిస్ట్