
జన్నారం/కోల్బెల్ట్/నేరడిగొండ/కడెం, వెలుగు: ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జన్నారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు. ఫారెస్ట్ సిబ్బందితో ప్రైవేట్, గవర్నమెంట్ స్కూళ్లకు చెందిన స్టూడెంట్లు జింకల పార్కు వద్ద చెత్తాచెదారాన్ని తొలగించారు. అనంతరం స్టూడెంట్లకు అడవి, దాని ప్రాముఖ్యత గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన్నారం, ఇందన్ పెల్లి రేంజ్ ఆఫీసర్లు లక్ష్మీనారయణ, హఫీజోద్దిన్, సిబ్బంది పాల్గొన్నారు.
మందమర్రి మండలం గాంధారీవనం అర్బన్ పార్క్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డేను నిర్వహించారు. స్కూల్ స్టూడెంట్లకు అటవీ అవశ్యకతపై అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన క్లీన్అండ్ గ్రీన్ కార్యక్రమంలో స్టూడెంట్లు, బోధనా సిబ్బంది, అటవీశాఖ ఆఫీసర్లు శ్రమదానం చేసి అర్బన్పార్కు పరిసరాలను శుభ్రం చేశారు. ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ఆఫీసర్ పి.సంతోశ్, సెక్షన్ఆఫీసర్లు విజయలక్ష్మి, రేపతిరెడ్డి, బీట్ఆఫీసర్లు రజిత, రమేశ్, స్కూల్ టీచర్లు పాల్గొన్నారు.
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని ఎఫ్ఆర్ఓ గణేశ్ అన్నారు. వరల్డ్ ఫారెస్ట్ డే సందర్భంగా నేరడిగొండ మండలంలోని పలు స్కూళ్ల విద్యార్థులకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ హాల్లో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, డీఎఫ్ఓ ప్రశాంత్ పాటిల్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేసినట్లు తెలిపారు.
కడెం మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ విజయకుమార్ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు వేశారు. వన్యప్రాణుల సంరక్షణ చర్యల్లో భాగంగా గ్రామాల్లో పశువులకు ఉచిత వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నట్లు డీఆర్ఓలు సిద్ధార్థ, ప్రకాశ్ తెలిపారు. కవ్వాల్ పులుల రక్షిత ప్రాంతంలో వన్యప్రాణులకు గ్రామాల్లో ఉండే పశువుల ద్వారా ఎటువంటి వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు లీసుకుంటున్నట్లు చెప్పారు.