వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ తో బిందాస్ దుబాయ్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఒకటైన దుబాయ్ ప్రజలను హ్యాపీగా ఉంచడానికి అక్కడి పాలకులు కొన్నేళ్ల కిందటి నుంచి ప్రయత్నాలు మొదలెట్టారు. లేటెస్ట్ గా యూఏఈ  వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో 21వ స్థానం దక్కించుకోవడంతో  దుబాయ్ ను భూమ్మీద బిందాస్ ప్రాంతంగా చేయాలని సర్కార్ డిసైడ్ అయింది. చీకూచింతాలేకుండా 24 గంటలూ ప్రజలు బిందాస్ గా ఉండాలన్నదే తమ టార్గెట్ అంటున్నారు దుబాయ్ పాలకులు.

జనం హ్యాపీగా ఉంటే దేశం డెవలప్​మెంట్​ వేగంగా సాగుతుంది. ఈ సూక్ష్మాన్ని యూరప్​ దేశాలు గుర్తుపట్టినంతగా ఆసియా దేశాలు పట్టించుకోవు. ఇప్పుడిప్పుడే హ్యూమన్​ రీసోర్స్​ విషయంలో ప్రభుత్వాలు మారుతున్నాయి. తమ ప్రజలు ఎంత హ్యాపీగా ఉంటున్నారో తెలుసుకోవడానికి స్పెషల్​ ఇండెక్స్​లతో సర్వేలు చేయిస్తున్నాయి. ఆసియా దేశాల్లో అరబ్​​ ఎమిరేట్స్​ 21వ ర్యాంక్​కి ఎదిగింది. అగ్రరాజ్యం అమెరికా రెండు స్థానాలు పైన నిలబడింది. కష్టించేవారికి స్వర్గంగా చెప్పుకునే దుబాయ్​ని ప్రపంచంలోనే మోస్ట్​ హ్యాపీయెస్ట్​ ప్లేస్​గా ఎమిరేట్స్​ తీర్చిదిద్దబోతోంది. అంతరిక్షానికి ఎదిగిన ఇండియా మాత్రం హ్యాపీనెస్​ ఇండెక్స్​లో 140వ స్థానానికి దిగిపోవడం మనకు ఇబ్బందిగానే ఉంది.

మనిషి జీవితంలో ఒత్తిడి ఓ భాగమైంది. ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా కత్తి మీద సాములా మారింది. జీవితమంటే ప్రతి రోజూ యుద్ధమే. నిత్యం సమస్యలతో సమరమే. అవి ఇంట్లోని సమస్యలు  కావచ్చు, ఆఫీసులో ఇబ్బందులు కావచ్చు. ఇవి ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. అన్ని దేశాల్లో ఉన్నదే. ఒక్కో దేశంలో పరిస్థితులు ఒక్కోలా ఉంటాయి. ప్రపంచంలో ఏ దేశానికి చెందిన ప్రజలు ఎక్కువ హ్యాపీగా ఉన్నారని సర్వే చేస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి 21వ ర్యాంకు దక్కింది. గల్ఫ్ ప్రాంతంలో మొదటి ర్యాంకు దక్కింది. ఎమిరేట్స్​లో ఒకటైన దుబాయ్​ని ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయస్ట్ ప్లేస్​గా తీర్చిదిద్దడానికి అక్కడి పాలకులు యాక్షన్​ ప్లాన్​ సిద్ధం చేస్తున్నారు.

ఈ ప్లేస్​కి కావలసిన అన్ని అర్హతలు దుబాయ్​కి ఉన్నాయంటున్నారు అక్కడి జనాలు. క్రియేటివిటీని నూటికి నూరు శాతం దుబాయ్ వెలికితీస్తుందని అక్కడ సెటిలైన ఓ బిజినెస్​ మ్యాన్ చెప్పారు. అసలు దుబాయ్ వాతావరణమే ప్రజలను సంతోషంగా ఉంచుతుందన్నారు. ‘ఇక్కడివాళ్లు దేనికీ దిగులు పడాల్సిందంటూ ఉండదు. తెలివి ఉంటే ఏ రంగంలోనైనా ఎదగడానికి బోలెడు అవకాశాలన్నాయి. ప్రజలందరూ మంచి లైఫ్ స్టయిల్​తో బతుకుతున్నారు’ అని మరికొందరు చెప్పారు. సగటు దుబాయ్ వాసి తాను సేఫ్​గా ఉన్నానన్న ఫీలింగ్​తో ఉంటాడదన్నది చాలామంది అభిప్రాయం.

హ్యాపీనెస్​కి రాబడి, లైఫ్ స్టయిల్ ఆధారం

ప్రజల రాబడి, స్వతంత్రత, జీవన ప్రమాణాలు, ఆయుర్దాయం వంటి ఆరు కీలక అంశాల ఆధారంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్​ని తయారు చేస్తారు. యునైటెడ్ నేషన్స్ తరఫున ‘సస్టయినబుల్ డెవలప్​మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ (ఎస్డీఎస్ఎన్)’ ఈ రిపోర్ట్​ని తయారుచేసింది. ప్రపంచవ్యాప్తంగా 156 దేశాల్లో ప్రజలు బతుకుతున్న పరిస్థితుల ఆధారంగా ఈ రిపోర్ట్ తయారు చేశారు. ఈ రకంగా హ్యాపీనెస్ రిపోర్ట్​ని విడుదల చేయడం ఐక్యరాజ్య సమితికి ఇది ఏడోసారి.

హ్యాపీగా ఉంచడం ఓ పాలసీ

దేశ ప్రజలను హ్యాపీగా ఉంచడానికి కొన్నేళ్లుగా ఎమిరెట్స్​ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా రెండేళ్ల కిందట  ప్రపంచంలోనే తొలిసారిగా ‘వరల్డ్‌‌ హ్యాపీనెస్ కౌన్సిల్’ను ఏర్పాటు చేసింది. ఈ కౌన్సిల్​లో మొత్తం 13 మంది సభ్యులుంటారు. ప్రజలను హ్యాపీగా ఉంచడానికి ప్రభుత్వపరంగా తీసుకోవలసిన చర్యలపై ఈ కౌన్సిల్ స్టడీ చేసి, తగిన సలహాలు, సూచనలు ఇస్తుంది. ఎమిరేట్స్​ తన ప్రజలను హ్యాపీగా ఉంచడంతోపాటు అన్నిరంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంపైకూడా దృష్టి పెట్టింది.  కొన్నేళ్ల కిందట మొత్తం ఏడు పాలసీలను యుఏఈ ప్రభుత్వం తయారు చేసుకుంది. దానిలో ప్రజలను అన్ని విధాలా హ్యాపీగా ఉంచడం ఒక పాలసీగా పెట్టుకుంది. ప్రజల సంతోషానికి యుఏఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఇదో ఉదాహరణ.

సంతోషానికి టాప్  ప్రయారిటీ

ప్రజల సంతోషకర జీవితానికి ప్రాతిపదికగా అనేక అంశాలు ఉన్నాయన్నారు హ్యాపీనెస్ రిపోర్ట్​ కో–ఎడిటర్ ప్రొఫెసర్ జాన్ హెల్లీవెల్. ప్రపంచం అన్ని రంగాల్లో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులకు తగ్గట్లు ఆయా దేశాల్లోనూ లైఫ్​ స్టయిల్​ మారుతోందన్నారు.  ప్రజల రాబడి, జీవన ప్రమాణాలతో పాటు కాలేజీల్లో, ఆఫీసుల్లో  వివిధ జాతులకు చెందిన ప్రజలు ఒకరితో మరొకరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నామన్నారు. వీటన్నిటి ఆధారంగానే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్​ తయారు చేశామని చెప్పారు. మారుతున్న కాలంలో ప్రజలు ఏ మేరకు సంతోషంగా ఉన్నారనే అంశానికి చాలా ప్రాధాన్యం ఉన్నందున ప్రభుత్వాలు చేయాల్సిన కృషి చాలా ఉందని జాన్ హెల్లీవెల్​ చెప్పారు. నిత్య జీవితంలో సిబ్బంది ఎంత హ్యాపీగా ఉంటే వాళ్లు పనిచేసే సంస్థలు అంతగా  లాభాలు సాధిస్తాయంటున్నారు సైకాలజిస్టులు. దుబాయ్​లోని అనేక గవర్నమెంట్ ఆఫీసుల్లో  సిబ్బంది హ్యాపీనెస్ అంచనాకి వీలుగా ఇండెక్స్​లు ఏర్పాటు చేశారు.

హ్యాపీనెస్ అంటే …

సంతోషం అనేది ఓ  మానసిక స్థితి. అయితే సంతోషానికి ఫిక్స్ డ్ గా కొలమానాలంటూ లేవు. అయితే నలుగురితో మాట్లాడటానికి బిడియపడే వాళ్లు ఆనందంగా ఉండలేరంటున్నాయి లేటెస్ట్  పరిశోధనలు.  ఎప్పుడూ పదిమందితో  గలగలమని మాట్లాడేవాళ్లు, మనసులో ఏమున్నా దాచుకోకుండా బయటపెట్టే వాళ్లే  హ్యాపీగా ఉంటారని తేల్చి చెప్పాయి పరిశోధనా ఫలితాలు. ప్రపంచంలో ఏ  రోగానికైనా చిర్నవ్వును మించిన  చికిత్స లేదు.  ఎప్పుడూ  చెదరని  చిర్నవ్వుతో ఉండే వాళ్లు  ఎంత పెద్ద సమస్య వచ్చినా చాలా ఈజీగా  ఎదుర్కొంటారన్నారు. అంతేకాదు హ్యాపీగానూ ఉంటారని  తేల్చి చెప్పారు.

140వ స్థానంలో ఇండియా

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్​లో ఇండియాకి 140 వ స్థానం దక్కింది. కిందటేడాది 133వ స్థానంలో ఉండగా, ఈసారి ఏడు స్థానాలు దిగజారింది. అగ్రరాజ్యమైన అమెరికాకు జాబితాలో 19 వ స్థానంలో నిలిచింది.  ఏమాత్రం సంతోషం లేకుండా బతుకుతున్న దేశాల్లో దక్షిణ సూడాన్ ఫస్ట్ ప్లేస్​లో ఉంది. ఆ తర్వాత సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఆఫ్ఘనిస్తాన్, టాంజానియా, రువాండా ఉన్నాయి.

ఫిన్లాండ్​కి ఫస్ట్ ప్లేస్

ప్రపంచంలోనే అత్యంత సంతోషమైన దేశాల్లో స్కాండినేవియన్​ దేశమైన ఫిన్లాండ్​కి ఫస్ట్ ప్లేస్ దక్కింది. హ్యాపీనెస్ రిపోర్ట్​లో ఫిన్లాండ్ టాప్ స్కోర్ చేయడం వరుసగా ఇది రెండోసారి. చాలా చిన్న దేశం. విస్తీర్ణం 3,38,145 చదరపు కిలోమీటర్లు. 2016 లెక్కల ప్రకారం జనాభా కేవలం 55 లక్షలు. ఇక్కడ అడవులు ఎక్కువ. మూడింట రెండు వంతులు అడవులే ఉంటాయి.  కాల్వలు కూడా ఎక్కువే. దేశం మొత్తం మీద 56వేల కాల్వలు ఉన్నాయి.హెల్సింకీ దేశ రాజధాని. 18 ఏళ్లు దాటిన అందరికీ  ఓటు హక్కు కల్పించిన తొలి యూరోపియన్ దేశంగా ఫిన్లాండ్​ చరిత్ర సృష్టించింది.

హ్యాపీగా ఉంటే బోలెడన్ని లాభాలు 

మానసికంగా హ్యాపీగా ఉన్న వారు అన్ని రంగాల్లోనూ దూసుకుపోయే అవకాశాలున్నాయి. మిగతా వారితో పోలిస్తే హ్యాపీగా ఉన్నవారి పనితీరు 50 శాతం మెరుగ్గా ఉంటుంది. పనిని కష్టపడి కాకుండా ఇష్టపడి చేయడంవల్ల అవుట్​పుట్ పెరుగుతుంది. హ్యాపీగా ఉద్యోగం చేస్తున్నవాళ్లు తమ కంపెనీ పట్ల 88 శాతం విధేయతతో ఉంటారు.

                                                                                              – డాక్టర్​ కొర్రీ బ్లాక్​, బిజినెస్ స్ట్రాటజిస్ట్​, హ్యాపీనెస్​ ఎక్స్​పర్ట్​