కలుషిత ఆహారం వల్ల ఏర్పడే ప్రమాదాలను నివారించడానికి, గుర్తించడానికి, ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించడానికి, తదుపరి చర్యలను ప్రేరేపించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్ 7న ఐదో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం జరుపుతున్నది. దీన్ని ఆహార భద్రత, మానవ ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు, వ్యవసాయ ఉత్పత్తి, మార్కెట్ అభివృద్ధి, పర్యాటకం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముడిపెడుతున్నది. ఈ సంస్థ ఆహార భద్రత, నాణ్యతను ధ్రువీకరించడానికి ప్రమాణాలు ఒక మార్గం అని నినదిస్తున్నది. కానీ ఆధునిక వ్యవసాయం వల్ల ఆహారంలో విధిగా కలుస్తున్న రసాయనాలను, విషాలను ఎట్లా తగ్గించాలని మాత్రం స్పష్టం చేయడం లేదు. పాలు ఇచ్చే ఆవులకు, బర్రెలకు ఇస్తున్న డ్రగ్స్, వాక్సిన్లు పాలల్లో ఎట్లా చేరుతున్నాయి? అవి చేరకుండా పసి పిల్లల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత నియంత్రణ వ్యవస్థ మీద ఉంది. ఇటీవల అమెరికాలో బీటీ ఆహార పంటల్లో పురుగులను చంపే విషం చొప్పించి, జన్యు మార్పిడి చేశామని, దాంతో పంట దిగుబడి పెరుగుతుందని చెప్పి అమ్ముతున్నారు. కానీ ఇలాంటి విత్తనాల వల్ల ఉత్పత్తి చేసిన ఆహారం తీసుకునే ప్రజల మీద చూపే దుష్ప్రభావాల గురించి అధ్యయనాలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేయడం లేదు. మన దేశంలో ఉన్న ఆహార నాణ్యత నియంత్రణకు ఏర్పాటు అయిన ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ కూడా లోతుగా ఆలోచించడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు నాణ్యతతో కూడిన ఆహారం క్రమేణా అందని ద్రాక్షగా కనపడుతున్నది.
జన్యు మార్పిడి విత్తనాలతో..
ఆహార అభద్రతతో పాటు కలుషిత ఆహారం తీవ్రమైన సమస్య. దాదాపు అన్ని దేశాల్లో ఈ సమస్య ఉంది. పెరుగుతున్న ఆహార ధరలతో పోటీ పడలేక, అనేక కుటుంబాలకు నాణ్యమైన ఆహారం అందడం లేదు. దొరుకుతున్న ఆహారంలో పోషకాల లేమి, రసాయనాల అవశేషాలు కూడా ఒక తీవ్ర సమస్య. గ్రామీణ ప్రాంతాల్లో ఆహారంలో నాణ్యత తక్కువ అవుతున్నది. కలుషిత ఆహారం పెను ప్రమాదంగా పరిణమించింది. రసాయనాల వినియోగం పెరుగుతున్నందున ఆహారంలో నాణ్యత తగ్గుతున్నది. హైబ్రిడ్ విత్తనాల ప్యాకేజీ సాగులో రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలు విధిగా వాడుతున్న పరిస్థితిలో ఆహార నాణ్యత ఆందోళన కలిగిస్తున్నది. జన్యుమార్పిడి పంటలు ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నాయి. హరిత విప్లవ సూత్రాలతో ఏక పంట పద్ధతి పెరిగింది. ఆహారంలో వైవిధ్యం తగ్గింది. ఆహారంలో పోషకాలు ఉండి, నాణ్యత పెరగాలంటే, జీవ వైవిధ్యం చాలా ముఖ్యం. ఈ మధ్య రెండో హరిత విప్లవం పేరుతో జన్యుమార్పిడి విత్తనాలు, కొత్త రకం రసాయనాలు, ఆధునిక పరికరాలు ఉపయోగించి పంట దిగుబడులు పెంచాలనే ప్రయత్నంలో ప్రభుత్వ విధానాలు రూపు దిద్దుకుంటున్నాయి. ఈ పద్ధతుల వల్ల పోషకాలు హరించిపోయి, ఆహారం ఒక శుష్కమైన పదార్థంగా మిగిలే ప్రమాదం పొంచి ఉన్నది. నాణ్యత లేని ఆహారం మాత్రమే మార్కెట్లో ఉండే పెను ప్రమాదం కూడా పొంచి ఉన్నది. అందుకే, ఆహారంలో నాణ్యత లేమిని, కల్తీ, కలుషితాలు గుర్తించి ఆహార వ్యవస్థలను ప్రశ్నించాలి. మానవాళికి ఆహారం అందించే వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థల దిశను కొన్ని కార్పొరేటు సంస్థలు తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలను ఎండగట్టాలి. ప్రకృతి వినాశనానికి బాటలు వేసిన ఆధునిక ఆహార ఉత్పతి వ్యవస్థను రైతులు, గ్రామీణులు అర్థం చేసుకోవాలి. దానికి దన్నుగా రూపొందుతున్న ప్రభుత్వ విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల ఆహార నాణ్యత తగ్గి, సహజ ఆహారం దొరకని పరిస్థితుల్లో అనారోగ్యం బారిన పడుతున్న కుటుంబాల సంఖ్య పెరుగుతున్నది.
ఆహార ప్రమాణాలు కఠినం చేయాలి
సహజంగా దొరికే పండ్లూ ఫలాలు, ఆకులు ఇంకా ఇతర ఆహారం ప్రకృతి వినాశనం వల్ల దొరకడం లేదు. ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండేవి, ఇప్పుడు కొందరికే అధిక ధరకు లభ్యమవుతున్నాయి. ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనపడే పండ్ల చెట్లు, వ్యవసాయ క్షేత్రాల్లో పంటలుగా మారిపోయాయి. స్థానిక ఆహారం స్థానికులకు అందకుండా, ఎగుమతి కావడం కూడా ఆహార వ్యవస్థ పరిణామ క్రమంలో భాగమే. ఆహార ఉత్పత్తికి ఖర్చు పెరిగిపోయి, ధర ఇచ్చే మార్కెట్లకు ఆహారం తరలడం వల్ల కూడా స్థానికులకు ఆహార లేమి ఏర్పడుతున్నది. పర్యావరణ వనరులను ధ్వంసం చేసి, రైతులను రుణగ్రస్తులను చేసి, ప్రజలకు అందని రీతిలో నాణ్యత లేని, పస లేని ఆహార ధాన్యాలు నిలువ చేసుకునే ఆహార వ్యవస్థను మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. స్థిరమైన ఆదాయం లేక, విద్య, వైద్యం మీద అధికంగా ఖర్చు పెడుతూ, గ్రామీణ కుటుంబాలు అనేకం ఆకలితో అలమటిస్తున్నాయి. కాగా, అనేక అంతర్జాతీయ అధ్యయనాలు ఆహారంలో నాణ్యత లేమిని, కలుషిత ఆహార సమస్యను వెలికి తీసినా, సూచిస్తున్న పరిష్కారాలు ఆమోదయోగ్యంగా లేవు. ప్రభుత్వాల దృష్టి కూడా దీర్ఘకాలిక పరిష్కారాల మీద లేదు. సహజ వ్యవసాయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. కల్తీని ప్రభుత్వాలు ఉక్కుపాదంతో నియంత్రించాలి. ఆహార ప్రమాణాలు కఠినం చేయాలి.
గ్రామస్తులకు మంచి ఆహారం దొరకట్లేదు
చాలా గ్రామాల్లో ఇప్పుడు ప్రతి ఆహార వస్తువు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు ఇంకా ఇతర అనేక రకాల వస్తువుల దొరకడం లేదు. ఆధునిక ఉత్పత్తి వ్యవస్థ కోసం గ్రామీణులు కష్టించినా వారికే మంచి ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. పట్టణాల్లో రసాయనాలు నిండిన మురుగు నీటిలో పండించే పంటలు (ఎక్కువగా ఆకు కూరలు) ఆహారాన్ని కలుషితం చేస్తున్నా, ప్రజలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రమాదకర రసాయనాలు, భార లోహాలు కలిగిన పట్టణ చెత్తను ఎరువుగా మార్చి, పంటలు పండించమని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నది. ఆహార ధాన్యాలు, ఉడికించిన ఆహారం ప్లాస్టిక్ వస్తువుల్లో నిల్వ, రవాణా చేయడం వల్ల, రసాయనాలు ఆహారంలో కలుస్తున్నాయి. వాటి నియంత్రణ వ్యవస్థ లేదు. ఆహారం కల్తీ చేసే వ్యాపారుల మీద నిఘా కూడా కొరవడింది. తెలంగాణలో పాలు, అల్లం వెల్లుల్లి, వంట నూనె, మసాలాలు వంటి ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి. రాష్ట్రంలోని వంట నూనెల శాంపిల్స్‌ను టెస్టు చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ అవి క్వాలిటీ ప్రమాణాల మేరకు లేనట్లు తేల్చింది. పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ కింద 120 శాంపిల్స్సేకరించి పరీక్షించగా, అందులో 34 శాంపిల్స్ ఫుడ్ క్వాలిటీ ప్రమాణాల మేరకు లేనట్లు తేలింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలంగాణలో కల్తీ ఆహారం నియంత్రించే చర్యలు లేవని అర్థమవుతున్నది.
కలుషిత ఆహారం
కరోనా తర్వాతి రాజకీయ, ఆర్థిక పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో ఆహార ఉత్పత్తి వ్యవస్థలు, సరఫరా, అందుబాటుల్లో తీవ్ర మార్పులకు కారణమయ్యాయి. ఆహారం ఉత్పత్తి వ్యవస్థలను కుదిపేసిన నిర్ణయాలు అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రస్తుతం విస్తరిస్తున్న ఆహార ద్రవ్యోల్బనానికి కారణంగా ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కూడా ఈ పరిణామాలకు తోడైంది. కానీ, కొందరు భావిస్తున్నట్టుగా అదే కారణం కాదు. దానికి తోడు, ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం వల్ల పరిణమిస్తున్న ప్రకృతి ఉత్పాతాలు కూడా ఆహారం మీద దుష్ప్రభావం చూపుతున్నాయి. పాక్, శ్రీలంక, కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఆకలి కేకలు అనారోగ్య పరిస్థితులకు క్లైమేట్ చేంజ్ కూడా కారణమే. 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో పేదరిక నిర్మూలనతో పాటు ఆకలి సమస్య కూడా కీలకంగా ప్రస్తావించారు. 17 లక్ష్యాల్లో మొదటి రెండు లక్ష్యాలు ఇవే. కరోనా మహమ్మారి లాంటివి ఎదుర్కోవడానికి ఆకలి తీర్చడంతో పాటు నాణ్యతగల, కలుషితాలు లేని ఆహారం అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. బలవర్ధకమైన ఆహారం వల్ల కరోనా మహమ్మారి వంటి అంటు రోగాలను ఎదుర్కొనే సామర్థ్యం శరీరానికి వస్తుందని నిపుణులు చెబుతున్న తరుణంలో ఆహార లేమి, నాణ్యత లేని ఆహారం చాలా తీవ్ర సమస్యగా పరిణమించింది. పోషకాలతో ఉన్న ఆహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- డా. దొంతి నర్సింహా రెడ్డి,
పాలసీ ఎనలిస్ట్