తెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్​!

తెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్​!
  • రాష్ట్రంలో తీవ్రత అధికం.. 4  ప్రధాన వేరియంట్లు
  • మూడు వేరియంట్లు ఒకేసారి అటాక్​ చేస్తే ప్రమాదం
  • డబ్ల్యూహెచ్​వో రిపోర్ట్​లో వెల్లడి.. మరణాలూ సంభవించవచ్చని వార్నింగ్

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలోలో డెంగ్యూ తీవ్రత అత్యధికంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) హెచ్చరించింది. దేశంలో డెంగ్యూ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్టు పేర్కొంది. మన దేశంలో డెంగ్యూ తీవ్రతపై ఇటీవల డబ్ల్యూహెచ్​వో ఓ డాక్యుమెంట్​ను విడుదల చేసింది. అందులో రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు హెచ్చరించింది.

డెంగ్యూలోని నాలుగు ప్రధాన వేరియంట్లన్నీ తెలంగాణలో కనిపిస్తున్నట్టు వెల్లడించింది. డీఈఎన్​వీ1, డీఈఎన్​వీ2, డీఈఎన్​వీ3, డీఈఎన్​వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు పేర్కొంది. కొన్నిసార్లు రెండు, మూడు వేరియంట్లు ఒకేసారి ఎటాక్​ చేస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా మరణాల రేటు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంటుందని పేర్కొంది. నిరుడు రాష్ట్రంలో 8 వేలకుపైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటిదాకా 500 మందికిపైగా బయటపడ్డాయి. 

ఇండ్లలో దోమల వృద్ధి

కొన్నేండ్లుగా రాష్ట్రంలో డెంగ్యూను ఎదుర్కొనేందుకు సమర్థవంతంగానే చర్యలు తీసుకుంటున్నా.. పరిస్థితి మాత్రం తీవ్రంగానే ఉందని డబ్ల్యూహెచ్​వో డాక్యుమెంట్​లో పేర్కొంది. డెంగ్యూ దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నా.. సవాళ్లు ఇంకా ఉన్నాయని తెలిపింది. ఇప్పటికీ చాలా చోట్ల కుంటలు, చెరువులు, డ్రైనేజీలు, నాలాల వంటి ప్రదేశాలు డెంగ్యూ దోమల వృద్ధికి కారణమవుతున్నట్టు పేర్కొంది.

ఇప్పుడు ఇండ్లలోనూ డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతున్నాయని, అది కలవరపరిచే అంశమని ఆందోళన వ్యక్తం చేసింది. డెంగ్యూ పేషెంట్లు ఇంటికి వచ్చాక ఆ దోమలతో వారికి మరింత సమస్యగా మారుతున్నట్టు తెలిపింది. మాన్సూన్​ ఎంటరయ్యాక డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటున్నదని తెలిపింది. 

లేట్​గా రిపోర్టవుతున్నయ్​

మాన్సూన్ ఎంటరయ్యాక డెంగ్యూపై ఎర్లీ వార్నింగ్​ సిస్టమ్స్​ లేకపోవడమూ డెంగ్యూ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నట్టు డబ్ల్యూహెచ్​వో పేర్కొంది. కొన్ని ఆస్పత్రులు డెంగ్యూ కేసులపై లేట్​గా రిపోర్ట్​ చేస్తుండడం వల్ల కేసుల సంఖ్యపై ఒక్కోసారి గందరగోళం ఏర్పడుతున్నదని చెప్పింది. కొన్ని  ప్రైవేటు ఆస్పత్రులు కేసులను ఆలస్యంగా రిపోర్ట్​ చేస్తున్నాయని పేర్కొంది. తద్వారా డెంగ్యూ నియంత్రణ కొంత కష్టమవుతున్నట్టు తెలిపింది. డెంగ్యూకు సరైన, కచ్చితమైన ట్రీట్​మెంట్​ అంటూ లేదని డబ్ల్యూహెచ్​వో పేర్కొంది. ఆదిలోనే గుర్తించడం వల్ల తీవ్రతను తగ్గించేందుకు వీలవుతుందని తెలిపింది. డెంగ్యూ మరింత వృద్ధి చెందకుండా అడ్డుకునేందుకు దోహదపడుతుందని పేర్కొంది.

డెంగ్యూ లక్షణాలివే..

డెంగ్యూ సోకిన తొలి ఫేజ్​లో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్లల్లో నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు, గ్రంథుల వాపు, దద్దుర్లు ఉంటాయని డబ్ల్యూహెచ్​వో పేర్కొంది. సివియర్​ డెంగ్యూ కేసుల్లో తీవ్రమైన కడుపు నొప్పి, అదేపనిగా వాంతులు, వేగంగా శ్వాస తీసుకోవడం, ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, అలసట, వాంతులు, విరేచనాల్లో రక్తం, బాగా దాహం వేయడం, చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది.

పెరగడానికి కారణాలేంటి?

డెంగ్యూ ఇన్ఫెక్షన్లు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయని డబ్ల్యూహెచ్​వో తెలిపింది. అందులో పట్టణీకరణ కూడా ముఖ్యమైందని పేర్కొంది. ‘‘క్లైమేట్​ చేంజ్​తో మారుతున్న వాతావరణ పరిస్థితులు కూడా డెంగ్యూ వైరస్​కు దోహదం చేస్తున్నది. కొన్ని కొన్ని సార్లు వివిధ ప్రాంతాలను బట్టి రాజకీయ, ఆర్థిక స్థితిగతులు కూడా డెంగ్యూ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

సరైన చికిత్స లేకపోవడం, స్థానికులకు దానిపై అవగాహన కల్పించకపోవడం, దోమల వృద్ధికి కారణమయ్యే ప్రాంతాలపై సరైన సర్వైలెన్స్​ లేకపోవ డం వంటివి కారణమవుతున్నాయి’’ అని వివరించింది.