
హైదరాబాద్, వెలుగు: వారసత్వ సంపద పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతిఒక్కరి బాధ్యత అని డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్చైర్మన్మణికొండ వేదకుమార్తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం హెరిటేజ్ వాక్ నిర్శహించారు. చార్మినార్ నుంచి ప్రారంభమైన ఈ వాక్ చౌమహల్లా ప్యాలెస్ వరకు కొనసాగింది. వేదకుమార్మాట్లాడుతూ హైదరాబాద్ నగరం చారిత్రక వైభవాన్ని ప్రజలకు తెలియజెప్పడంతోపాటు వారసత్వ పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు.
ముదుమల్ మెగలిథిక్ మెన్హిర్స్ సైట్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చేందుకు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, రాష్ట్ర పురావస్తుశాఖ కలిసి చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు. పురావస్తు శాఖ హైదరాబాద్ సర్కిల్, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ, జేపీఆర్ఏసీ, ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జీఎస్వీ సూర్యనారాయణ మూర్తి, డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ, డాక్టర్ జీ జయశ్రీ, కోటయ్య వింజమూరి, సాయికృష్ణ, రాజేశ్వరి, సాయి రామ్, సుధాకర్ , టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఎస్. ప్రభాకర్, శ్రీనివాస్, శ్యాంసుందర్ రావు, , వీరమల్లు, జేబీఆర్ఏసీ, ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్, ఎస్ఆర్డీపీ, వాసవి స్కూల్, వైష్ణవి ఆర్కిటెక్చర్ కాలేజ్ విద్యార్థులు హాజరయ్యారు.
కాచిగూడలో మ్యూజియం.. కోటలో ఫ్రీ ఎంట్రీ
వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా రైల్వే అధికారులు శుక్రవారం చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్ను అందంగా తీర్చిదిద్దారు. స్టేషన్లో రైల్ మ్యూజియం ఏర్పాటు చేసి, పలు స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు, రైలు ప్రయాణికులకు ఫ్రీ ఎంట్రీ కల్పించారు. గతంలో పనిచేసిన రైల్వే పరికరాలు, కోచ్‌ల నమూనాలు, టికెట్లు, సిగ్నల్ వ్యవస్థలు వంటి పాత సాంకేతిక నమూనాలను ఇందులో ప్రదర్శించారు.
1960 నుంచి ఇప్పటి వరకూ ఉపయోగించిన ఫ్యాన్లు ప్రదర్శనలో ఉంచారు. ఈ మ్యూజియం సందర్శకులను ఎంతో ఆకర్షించిందని అధికారులు తెలిపారు. రైల్వేల చరిత్ర, వృద్ధికి సంబంధించిన ఆడియో- విజువల్స్, రైల్వేలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రదర్శన నిర్వహించారు.
మెహిదీపట్నం: అలాగే వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా గోల్కొండ కోటలో సందర్శకులకు పురావస్తు శాఖ ఫ్రీ ఎంట్రీ కల్పించింది. సుమారు 2000 పైగా సందర్శకులు కోటను సందర్శించినట్లు ఇన్చార్జి అధికారి మల్లేశం తెలిపారు.