
మూత్రం తయారీ మాలిన్య విసర్జన, ఆమ్లం క్షారం సమతుల్యం, బీపీ సమతుల్యత, నీరు, లవణ సమతుల్యం, ఎరిత్రోపోయిటిన్ తయారీ. ఈ పనులలో ఏమైనా సమతుల్యత లోపిస్తే కిడ్నీలకు సంబంధించిన వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
లక్షణాలు
సాధారణంగా కనిపించే కిడ్నీ వ్యాధి లక్షణాలు.ఆకలి మందగింపు, నీరసం, రక్త హీనత, బీపీ సమతుల్యం లోపం, మూత్రం తక్కువ రావడం / ఎక్కువ రావడం / ఎరుపురంగులో రావడం. ముఖం, కళ్ల వాపు.
మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు
కిడ్నీ వ్యాధులు అన్ని వయసులవారికి వస్తున్నాయి. మూత్రం రంగు ఎరుపుగా రావడం, తక్కువ రావడం, బీపీ పెరగడం. మూత్రం ఇన్ఫెక్షన్ కిడ్నీ వ్యాధి లక్షణాలు. కిడ్నీ ఫెయిల్యూర్, డయాలసిస్ పెద్దల్లో ఎక్కువ. గత పది సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం కిడ్నీ వ్యాధిగ్రస్తులు సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది. దానికి కారణం మారుతున్న జీవనశైలి, ఊబకాయం, షుగర్, బీపీ పరిధి దాటి ఉండటం ఎక్కువ మోతాదులో నొప్పి మాత్రలు వాడడం. ముఖ్యంగా యువత ఆహారపు అలవాట్లు చాలావరకు మారాయి. వారు తినే తిండిలో ఉప్పు శాతం మోతాదుకు మించి ఉంటోంది.
ముఖ్యంగా ఫ్రైడ్ రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, నూడుల్స్ వీటితోపాటు యువత శీతల పానీయాలు అధికంగా సేవించడం ఊబకాయానికి దారితీస్తుంది. మారిన జీవనశైలి, యాంత్రీకరణ వలన సగటు మనిషి ఒక రోజులో రెండు కిలోమీటర్లు ఏకధాటిగా నడవలేకపోతున్నాడు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే షుగర్ వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. షుగర్ వ్యాధిగ్రస్తులు అందరికీ కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం 80 శాతం నుంచి -90శాతం వరకు ఉంటుంది. కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం 20–-40% వరకు ఉంటుంది. కిడ్నీ ఫెయిల్ అయిన వారందరూ డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. గత పది సంవత్సరాలతో పోలిస్తే డయాలసిస్ రోగులు రెండు రెట్లు ఎక్కువ అయ్యారు. డయాలసిస్ చేసుకుంటున్నా.. బాధితులు కాళ్లవాపు, ఆయాసం, జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వం డయాలసిస్ సెంటర్లను పెంచుతోంది. అయినప్పటికీ వ్యక్తులు తమ జీవనశైలి మార్చుకోకపోతే సమాజం విషమ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది.
మారవలసిన అలవాట్లు
నియమిత వ్యాయామం/ నియమిత నిద్ర /ఒత్తిడి లేకుండటం. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం. ఉప్పు తక్కువగా ఉపయోగించడం, మసాలా, ఫ్రైడ్ రైస్ కి దూరంగా ఉండడం. బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకోవడం. సాధ్య మైనంత తక్కువగా నొప్పి మందులు వాడడం. సరైన మోతాదులో నీరు తాగడం. ఈ నియమాలు పాటించినట్లయితే 50% వరకు కిడ్నీ వ్యాధులు అరికట్టవచ్చు. బీపీ, షుగర్ ఉన్నవారు కిడ్నీ డాక్టర్ను సంప్రదించి కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
- డా. ఎజి శంకర్