వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ చొరవతో 1992 నుంచీ ప్రతి ఏటా అక్టోబర్ 10వ తేదీన మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై అవగాహన కలిగించడమే దీని ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మందికి పైగా మానసిక రుగ్మతలతో జీవిస్తున్నారు. మానసిక ఆరోగ్యంపై కనీస అవగాహన, ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్య రక్షణ కోసం 'మానసిక ఆరోగ్యం .. సార్వత్రిక మానవ హక్కు-’ అనే నినాదంతో ఈ సంవత్సరం మానసిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మానసిక వ్యాధుల లక్షణాలను గుర్తించి నయం చేయవచ్చు.
మానసిక వ్యాధుల కారణాలు
జీవ రసాయనాల తేడా, మెదడులో సహజంగా ఉత్పత్తి అయ్యే రసాయనిక పదార్థాల హెచ్చుతగ్గులు మానసిక వ్యాధులకు కారణమవుతాయి. ఉదాహరణకు డోపమైన్, సెరొటోనిన్, గ్లుటమిన్. గాభా, ఎపినెప్రిన్, నార్ -ఎపినెప్రిన్. ఎసిటలిన్ లాంటి రసాయన పదార్థాల అసమతుల్యత మానసిక వ్యాధులకు దారితీస్తుంది. మెదడుకు సోకే ఇన్ఫెక్షన్స్ కారణంగా బ్రెయిన్ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. తలకు దెబ్బ తగలడం, మూర్ఛ వ్యాధి, మెదడు రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం, బుద్ధి మాంద్యం, డిమెన్షియా, భావోద్వేగ సమస్యలతో మానసిక రుగ్మతలు వస్తాయి. ఇటీవల పరిశోధనల్లో మానసిక ఆరోగ్యం, జన్యువుల మధ్య బలమైన సంబంధం ఉందని తేలింది. శిశువు గర్భంలో ఉన్నప్పుడు మానసిక ఒత్తిళ్లు, ఇన్ ఫ్లామేటరీ పరిస్థితులు, టాక్సిన్స్, ఆల్కహాల్, డ్రగ్స్‌కు బానిస కావడం, బాల్యంలో హింసకు గురవడం, నిర్లక్ష్యానికి గురైనవారు, పిల్లల పెంపకంలోని లోపాలు, గృహ హింస, పిల్లలు పుట్టక పోవడం, కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నం తదితర కారణాలు మానసిక వ్యాధులకు కారణమవుతాయి. మాదక ద్రవ్యాల వినియోగంతో మానసిక ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది. కొకైన్, గంజాయి, డ్రగ్స్, మద్యం మానసిక ఆందోళన ప్రమాదాన్ని పెంచుతాయి.
మానసిక రోగులపై చిన్నచూపు
ప్రపంచవ్యాప్తంగా మానసిక వ్యాధిగ్రస్తులపై చిన్నచూపు కొనసాగడం- మరో విషాదం. ప్రపంచంలోని ప్రతి అయిదుగురు పిల్లలలో ఒకరు మానసిక అనారోగ్యం కారణంగా బాధపడుతున్నారు. దాదాపు 20శాతం మంది పిల్లలు- కౌమార దశలోనే ఏదో ఒక మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకోవడం ప్రపంచ మరణాల్లో రెండవ ప్రధాన కారణం కావడం శోచనీయం. పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా 2018 నాటి సర్వే ప్రకారం యాంగ్జయిటీ, డిప్రెషన్, స్కిజోఫ్రెనియా లాంటి మానసిక రుగ్మతల బాధితుల్లో అత్యధికులు భారతదేశంలోనే ఉన్నారనేది చేదు నిజం. వీరిలో 25 ఏండ్లలోపువారు 50శాతం, 35 ఏండ్ల వయసులోపువారు 65శాతం ఉన్నారు. మానసిక అనారోగ్యం కారణంగా ప్రతి సంవత్సరం ట్రిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్యానికి బడ్జెట్ కేటాయింపుల్లోనూ వివక్ష కొనసాగుతోంది. ఏ దేశంలో కూడా మానసిక ఆరోగ్యం కోసం చేసే వ్యయం 2శాతం దాటడం లేదు. ఈ వివక్ష భారత్‌లో మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఒక శాతం కన్నా తక్కువ ఉండటం దురదృష్టకరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం- అమెరికాలో ప్రతి పది లక్షల మందికి 100 మంది సైకియాట్రిస్ట్ లు, 300 మంది సైకాలజిస్ట్‌లు ఉన్నారు. భారత్‌లో మాత్రం వారి సంఖ్య చాలా స్వల్పం. 10 లక్షల మందికి కేవలం నలుగురు సైకియాట్రిస్టులు మాత్రమే ఉండగా.. క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ ల సంఖ్య నామమాత్రమే. మానసిక సమస్యలతో అనేకమంది మద్యం, ధూమపానానికి అలవాటుపడి మరిన్ని కష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు.
భూతవైద్యంలాంటి అపోహలు తొలగాలి
ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ ) మానసిక అనారోగ్య సమస్యల విపత్తును పైకి కనిపించని సంక్షోభం (హిడెన్ ఎమర్జెన్సీ)గా పేర్కొన్నది. బాల్యం,- కౌమార దశ నుంచే అనేక మానసిక సమస్యలు మొదలవుతున్నాయని పరిశోధనలు సైతం చెబుతున్నాయి. ఆధునిక వైద్య చికిత్స విధానాలు సాధ్యమైనంత తొందరలోనే వ్యాధులను నయం చేయగలుగుతున్నాయి. వ్యాధి తొలి దశలో ఉన్నప్పుడే చికిత్స తీసుకుంటే నయం కావడం గ్యారంటీ. అయితే, ముదిరిన దశలో వైద్యులను సంప్రదించడంతో నష్టం భారీగానే ఉంటుంది. మూఢనమ్మకాలు, మూఢాచారాలు, భూత వైద్యంలాంటి వాటిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోవాలి. ఈ బాధ్యతను కేవలం ప్రభుత్వాలే కాదు. స్వచ్ఛంద సంస్థలు కూడా నెరవేర్చాలి. మానవునికి అన్నిటికన్నా మానసిక ఆరోగ్యమే మహా బలం.
వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ చొరవతో 1992 నుంచీ ప్రతి ఏటా అక్టోబర్ 10వ తేదీన మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై అవగాహన కలిగించడమే దీని ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మందికి పైగా మానసిక రుగ్మతలతో జీవిస్తున్నారు. మానసిక ఆరోగ్యంపై కనీస అవగాహన, ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్య రక్షణ కోసం 'మానసిక ఆరోగ్యం .. సార్వత్రిక మానవ హక్కు-’ అనే నినాదంతో ఈ సంవత్సరం మానసిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మానసిక వ్యాధుల లక్షణాలను గుర్తించి
నయం చేయవచ్చు.
- డా. బి. కేశవులు నేత, ఎండీ,
ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్,
ఎర్రగడ్డ మానసిక వైద్యశాల