ప్రపంచంలో ప్రాణాంతకమైన కీటకాలలో దోమ ఒకటి

ప్రపంచంలో ప్రాణాంతకమైన కీటకాలలో దోమ ఒకటి. ఇది ప్రతి సంవత్సరం లక్ష లాది మంది చనిపోవడానికి కారణమవుతోంది. అందుకే దోమల వల్ల కలిగే వ్యాధులు, వాటి నివారణ గురించి అవగాహన పెంచడానికి ఆగస్టు 20న వరల్డ్ ​మస్కిటో డే నిర్వహిస్తారు. ఒకప్పుడు దోమల ద్వారా మలేరియా ప్రబలి పెద్ద సంఖ్యలో జనం మరణించేవారు. బ్రిటీష్ డాక్టర్ సర్ ​రోనాల్డ్ ​రాస్1897వ సంవత్సరం ఆగస్టు 20న తన పరిశోధనల ద్వారా మలేరియాకు ఆడ దోమలే కారణమని మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. దానికి1902లో ఆయనకు నోబెల్​బహుమతి వచ్చింది. అప్పటి నుంచి ఏటా ఆగస్టు 20న వరల్డ్​మస్కిటో డే నిర్వహిస్తున్నారు. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల్లో మలేరియా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రభావం చూపుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​వో) ప్రకారం మలేరియాతోనే ఏటా 4 లక్షల మంది చనిపోతున్నారు. దాదాపు 100 దేశాల్లో ఈ వ్యాధి ప్రభావం ఉంటోంది. దోమల వల్ల వచ్చే ఇతర వ్యాధులు ప్రాణాంతకం కాకపోయినా, తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. నేషనల్​హెల్త్​ పోర్టల్​ఆఫ్ ​ఇండియా ప్రకారం ఏడిస్, అనాఫిలిస్, క్యూలెక్స్ ​దోమలు వెక్టర్​లుగా పనిచేస్తూ అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి. ఓ స్టడీ ప్రకారం దోమలు భూమిపై ఉన్న ఇతర జీవుల కంటే అత్యంత ప్రాణాంతకం. యూనిసెఫ్​ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 40 శాతం జనాభా మలేరియా ప్రమాదం ఎక్కువగా ఉన్నప్రాంతాల్లోనే నివాసం ఉంటోంది. 

బేగంపేటలో రోనాల్డ్​ రాస్ పరిశోధనలు

మలేరియాను పారదోలడానికి ఆవిష్కరణలు జరిగింది మన హైదరాబాద్​లోని బేగంపేటలోనే. ఇక్కడ సర్ ​రోనాల్డ్ ​రాస్ ​పారాసిటమాలజీ ఇన్​స్టిట్యూట్​లో జరిగిన పరిశోధనలే మొదటివి. దోమల వల్ల మలేరియా వ్యాధి సోకుతుందనే విషయం తెలియని రోజుల్లో ఎంతో మంది దోమకాటుతో చనిపోయేవారు. అలాంటి సమయంలోనే బ్రిటీష్​సైన్యంలో పనిచేసే మిలటరీ డాక్టర్​ సర్ ​రోనాల్డ్​రాస్​ఈ వింత వ్యాధిపై ప్రయోగాలు చేశారు. నగరంలో మనుషులకు సోకుతున్న వ్యాధికి  దోమలే కారణంగా తేల్చాడు. లండన్​లోని సెయింట్​బార్తోలోమ్ ​హాస్పిటల్​లో1880లో మెడిసిన్​పూర్తి చేసిన రాస్, 1881లో ఇండియన్​  మెడికల్​సర్వీసులో చేరాడు. 1881 నుంచి1894 వరకు మద్రాస్, బర్మా, బలూచిస్తాన్, అండమాన్ దీవులు, బెంగళూరు, సికింద్రాబాద్​లో వివిధ వైద్యపరమైన బాధ్యతలు చేపట్టారు. 1895 నుంచి1897 మధ్యకాలంలో బ్రిటీష్ రెజిమెంటల్ ట్రూప్​లకు ఆసుపత్రిగా ఉన్న బేగంపేట్ లోని ప్రస్తుత రోనాల్డ్​రాస్​ భవన సముదాయంలో వైద్యాధికారిగా చేరాడు. ఆ సమయంలో నగరంలో చాలా మంది జ్వరంతో బాధపడుతూ ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. అందుకు మలేరియానే కారణమని గుర్తించిన రాస్, ఆ వ్యాధి సోకడానికి వాహకాలు ఏమిటనే దానిపై ఆసుపత్రి ప్రాంగణంలోనే తన పరిశోధనలు కొనసాగించారు. ఆడ అనాఫిలిస్ దోమల్లో మలేరియా పరాన్నజీవి ఉన్నట్లు గుర్తించాడు. 

దోమ మనిషిని కుట్టినపుడు మలేరియా పరాన్నజీవి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుందని 1897 ఆగస్టు 20న తన పరిశోధనల ద్వారా  నిరూపించాడు. ఆయన పరిశోధనా ఫలితాల వల్ల దోమల నివారణతో పాటు మలేరియాకు మందుల ఆవిష్కరణ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి నిర్మూలనకు చర్యలు చేపట్టారు. ఈ ​పరిశోధనలకు గాను రోనాల్డ్​ రాస్​కు1902 లో నోబెల్​బహుమతి లభించింది. సికింద్రాబాద్​ బేగంపేట​లోని ఇన్​స్టిట్యూట్​లో పరిశోధనలు జరుగుతున్న సమయంలో ఆయన తన పరిశోధనల ఫలితాలను ఎప్పటికప్పుడు ఒక నోట్​బుక్​లో రాసుకున్నాడు. ఆ నోట్స్​ ఇప్పటికీ లండన్​లోని ఓ లైబ్రరీలో భద్రంగా ఉన్నాయి.

హెరిటేజ్ ​భవనం పునరుద్ధరణ ఏది?

మలేరియా వ్యాధిపై సర్​ రోనాల్డ్​ రాస్​ పరిశోధనలు చేసిన బేగంపేటలోని పరిశోధనా కేంద్రానికి ప్రభుత్వం గతంలో హెరిటేజ్ ​బిల్డింగ్​ హోదా కల్పించింది. వారసత్వ కట్టడంగా గుర్తించిన తర్వాత 2010-–-12లో రూ.45 లక్షలతో భవన పునరుద్ధరణకు పనులు చేపట్టారు. ఆ పనుల్లో నాణ్యత లోపించి మరమ్మతులు సరిగా జరగలేదు. దానికి మరిన్ని నిధులు సేకరించి అభివృద్ధి చేసేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ ​సింగ్​కు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు ప్రతిపాదనలు పంపింది. ఆ తర్వాత వాటిని ఫాలోఅప్ ​చేయకపోవడంతో నిధులు రాలేదు. పనులు ఎక్కడివక్కడే నిలిచి పోయాయి. ఈ భవన ప్రాంగణం విద్యార్థులతో కలకలలాడేందుకు పలు సర్టిఫికెట్ కోర్సులుపెట్టాలన్న ఓయూ అధికారుల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.  ప్రస్తుతం ఈ ప్రాంగణంలో ఒక వాచ్​మెన్​ మాత్రమే ఉదయం వెళ్లి గేట్లు తీసి సాయంత్రం తలుపులు మూసి వస్తున్నాడు. ఓయూ అధికారులు సైతం ఏడాదిలో రెండు సార్లు మాత్రమే.. అంటే సర్​ రోనాల్డ్ ​రాస్​ జయంతి రోజు అయిన మే13న, ఆయన పరిశోధనల ఫలితాలను వెల్లడించిన ఆగస్టు20న వెళ్లి ఆయన విగ్రహానికి దండలు వేసి నివాళులర్పించి వస్తున్నారు. మిగతా రోజుల్లో అటు వైపు చూడటం లేదు. దీనిపై పూర్తి స్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో ఈ స్థలం చాలా వరకు కబ్జాలకు గురైనట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా పరిశోధన కేంద్రాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉంది. 2020లో 85 దేశాల్లో 241 మిలియన్ల కొత్త మలేరియా కేసులు నమోదవగా, 6,27,000 మలేరియా సంబంధిత మరణాలు రికార్డు అయ్యాయి. మన రాష్ట్రంలో కూడా ఏటా వానాకాలం సీజన్​లో దోమల వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయి. మలేరియా కేసులు ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. దోమల వల్ల కలిగే వ్యాధుల గురించి అవగాహన కల్పించడంతోపాటు వాటి నివారణకు చర్యలు తీసుకోవడమే వరల్డ్​ మస్కిటో డే నిర్వహణ ముఖ్య ఉద్దేశం.

- రేగుంట వెంకటేశ్