ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది..అవినీతిలేని ప్రభుత్వాలే : మోదీ

దుబాయ్ :  ప్రస్తుతం ప్రపంచానికి అవినీతి లేని ప్రభుత్వాలు కావాలని ప్రధాని మోదీ అన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ జస్టిస్, ఈజ్ ఆఫ్ మొబిలిటీ, ఈజ్ ఆఫ్ ఇన్నోవేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి వాటిని అందించే ప్రభుత్వాలు ప్రజలకు ఇప్పుడు అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు వీలైనంత తక్కువగా ప్రజల జీవితాల్లో జోక్యం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వంలేదనే భావన ప్రజలకు రాకూడదని, అలా అని ప్రభుత్వం నుంచి ప్రజలపై ఒత్తిడి ఉండకూడదని అన్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా బుధవారం దుబాయ్​లో ‘వరల్డ్ గవర్నమెంట్స్ సమిట్’లో ఆయన మాట్లాడారు. ప్రజల మనోభావాలకు ప్రాధాన్యం ఇచ్చామని, అందుకే తమ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని చెప్పారు. 

‘‘గుజరాత్ సీఎంగా, భారత ప్రధానిగా 23 ఏండ్ల నుంచి ప్రభుత్వంలో ఉన్నాను. ‘మినిమమ్ గవర్నమెంట్.. మ్యాక్సిమమ్ గవర్నెన్స్’ నినాదంతో పనిచేస్తున్నాను. మా ప్రభుత్వం మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేస్తున్నాం. దేశంలో 50 కోట్ల మందిని బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించాం. ఫలితంగా ఫిన్ టెక్, డిజిటల్ పేమెంట్స్ రంగాల్లో భారత్ గ్లోబల్​గా మంచి పొజిషన్ లో ఉన్నది” అని పేర్కొన్నారు. ఓవైపు ప్రపంచం ఆధునికత వైపు పరుగులు పెడుతుంటే.. మరోవైపు టెర్రరిజం, పర్యావరణ మార్పులు సవాళ్లు విసురుతున్నాయని అన్నారు. ‘‘ప్రపంచ నేతలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చేందుకు ఈ సమిట్ గొప్ప వేదిక. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ విజన్ ఉన్న లీడర్” అని కొనియాడారు. కాగా, సమిట్ అనంతరం ద్వైపాక్షిక సమావేశాల్లో మోదీ పాల్గొన్నారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్​తో భేటీ అయ్యారు. మడగాస్కర్ ప్రెసిడెంట్ ఆండ్రీ రాజోలినాతోనూ మోదీ సమావేశమయ్యారు.

హిందూ దేవాలయం ప్రారంభం

అబుదాబీలో నిర్మించిన బోచాసనవాసీ అక్షర్‌‌ పురుషోత్తం స్వామి నారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం పూజారులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రారంభానికి వచ్చిన ప్రధాని మోదీని చూసేందుకు ఇండియన్లు భారీగా తరలి వచ్చారు. దుబాయ్‌–అబుదాబీ మార్గంలోని షేక్‌ జాయెద్‌ హైవే పక్కన 27 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో రాజస్థాన్‌, గుజరాత్‌కు చెందిన నిపుణులు భాగస్వాములయ్యారు. రాజస్థాన్ నుంచి పాలరాయిని దిగుమతి చేసుకుని, ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా ఏడు గోపురాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇందుకోసం దాదాపు రూ.700 కోట్లను వెచ్చించారు.