కరిగేకాలంలో చెదరని మధుర స్మృతులకు ప్రతిబింబం ఫొటో. ప్రతి ఫొటో వెనుక ఓ జ్ఞాపకం, ఓ కథ, ఓ అనుభూతి దాగుంటుంది. వంద మాటలతో చెప్పలేనిది ఒక్క ఫొటోతో చెప్పొచ్చు. ఈ క్షణాన్ని ఆస్వాదించేలోపే అది మాయమవుతుంది. ఇలాంటి కాలగమనంలో ఎన్నో జ్ఞాపకాలను ఒడిసిపట్టి భద్రంగా బంధించి ఉంచేదే ఫొటో. కోట్ల పదాలతో వర్ణించలేని భావాన్ని ఒక్కఫొటో కళ్లకు కడుతుంది. కరుణ, భక్తి, హాస్యం, రౌద్రం, శాంతం, బీభత్సం, భయానకం, శృంగారం, వీరత్వం ఇలా నవరసాలతో పాటు జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను, గతస్మృతులను పదిలం చేసుకోవడం ఫొటోలతోనే సాధ్యం. అందమైన జ్ఞాపకాలు, తియ్యటి అనుభూతులు, మధుర ఘట్టాలు, విషాద సన్నివేశాలు, వెలకట్టలేని దృశ్యాలను పదికాలాలపాటు పదిలంగా మన కళ్ల ముందు ఉంచేది ఫొటో.
మానవుడు ఆవిర్భవించిన ఆవిష్కరణలో అతి ముఖ్యమైనవాటిలో ఒకటి 'ఫొటో కెమెరా'ఈ భూమిపై ఉన్న జీవరాశులను మన కంటితో చూస్తాం లేదా చూసినవారు చెప్తే ఆ ఆకారాన్ని మన మదిలో ఊహించుకుని ఒక రూపాన్ని చూస్తాం. ఓ చిత్రకారుడు వేసే చిత్రం ద్వారా కూడా అనేకమైన చిత్రాలను చూడగలం. కానీ, సముద్రపు అడుగున, భూమి చివరంచుతో పాటు ఈ విశ్వం ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు మనం ఫొటోల ద్వారా చూడగలుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫొటోగ్రాఫర్‌లను ఏకం చేయడం, ప్రోత్సహించే లక్ష్యంతో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ స్థాయిలో జరుపుకుంటారు.
ఫొటో అంటే కాంతి
ఫొటోగ్రఫీ దినోత్సవం లూయిస్ డాగ్యురో అనే శాస్త్రవేత్త ఆవిష్కరణల నుంచి ఉద్భవించింది. ఫొటోగ్రఫీ అనేది గ్రీకు పదం నుంచి వచ్చింది. ఫొటో అంటే కాంతి, గ్రఫి అంటే తీసుకోవడం. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని 19 ఆగస్టు 1910న మొదటగా జరుపుకున్నారు. ఫ్రెంచ్ దేశానికి చెందిన లూయిస్ డాగ్యురే, జోసెఫ్ నైస్‌ఫోర్ నీప్ప్ అభివృద్ధి చేసిన ఫొటోగ్రఫీ ప్రక్రియల గురించి 1839 జనవరి 9న ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డాగ్యూరే టైప్ ప్రాసెస్‌ను అధికారికంగా ప్రకటించింది. తర్వాత కొద్దినెలలకు 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం ఫొటోగ్రఫీపై పేటెంట్ హక్కులను కొనుగోలు చేసి దానిని ప్రపంచానికి ఉచిత బహుమతిగా అందించింది. అందుకే ఏటా ఆగస్టు 19ని ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా జరుపుతున్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫిక్ కౌన్సిల్ 1991 నుంచి దేశంలో ప్రతిఏటా ఆగస్టు 19న ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది.
మనదేశంలో 1840లోనే ఫొటోగ్రఫీ
భారతదేశంలో 1840లోనే ఫొటోగ్రఫీకి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. మొట్ట మొదటిసారిగా కలకత్తాలో కేలోటైపు మొదటి ఫొటోగ్రఫీ స్టూడియో స్థాపించారు. ఇదే భారతదేశంలో మొట్టమొదటి స్టూడియో ఇప్పటికీ కోల్‌కత్తాలోని 8వ చౌరంగీరోడ్డులో ఉంది. 1854లో ఫొటో గ్రాఫిక్ సొసైటీ ఆఫ్ బాంబే స్థాపించబడింది. మనదేశంలో ఇది మొట్టమొదటి ఫొటోక్లబ్బు. ఆ తర్వాత ఇది ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ ఇండియాగా మార్పు చెందింది. అప్పట్లో కేవలం బ్రిటీష్‌రాజు, జమిందారులకు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. 1877 నుంచి ఫొటోగ్రఫీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది.
ఫొటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అందరిలాగే ఫొటోగ్రాఫర్ల బతుకులు కూడా మారుతాయని కలలు కన్నారు. కానీ, ఆ కలలు .. కలలుగానే మిగిలాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బ్యాంక్‌లలో లోన్స్ ఇవ్వక లక్షలకు లక్షలు అప్పులు చేసి ప్రొఫెషనల్ కెమెరాలు కొని వాటి అప్పు తీరలేక రాష్ట్రంలో ఫొటోగ్రాఫర్లు ఎందరో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. వందేండ్లకు పైగా చరిత్ర ఉన్న ఫొటోగ్రఫీలో ఆది నుంచి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. అత్యాధునిక కెమెరా ఫీచర్లు కల్గిన సెల్ఫోన్లు రావడంతో ప్రస్తుతం ఫొటోగ్రాఫర్లకు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు శుభకార్యాలకు ఫొటోగ్రాఫర్లకు ఫుల్ డిమాండ్ ఉండేది. కానీ, ఎప్పుడైతే అత్యాధునిక కెమెరా ఫీచర్లతో సెల్ఫోన్లు వచ్చాయో మార్కెట్లో ఫొటోగ్రాఫర్లకు డిమాండ్ తగ్గింది. ఫొటోగ్రఫీలో అత్యాధునిక సామర్థ్యంతో కూడిన కెమెరాలు ఉంటేనే ఆర్డర్స్ ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బ్యాంకుల ద్వారా రూ.5 నుంచి 10 లక్షల సబ్సిడీతో కూడిన రుణాలు ఇప్పిస్తే ఫొటోగ్రఫీ రంగంలో అభివృద్ధి చెందుతామని, రైతు బీమాలాగే ఫొటోగ్రాఫర్లకు కూడా ప్రమాద బీమా అమలుచేసి రోడ్డు ప్రమాదాల బాధితులకు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఫొటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్రంలోని ఫొటోగ్రాఫర్లు కోరుతున్నారు.
- కేశపాగ శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్