డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారోత్సోవం తదుపరి వెలువడిన కార్యనిర్వాహక ఉత్తర్వులు ఆశ్చర్యం కలిగించాయి. 2025 జనవరి 20న ఒకే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏకబిగిన మునుపటి బైడెన్ ప్రభుత్వం ఇచ్చిన 84 ఆర్డర్‌లను రద్దు చేసింది. ఈ ఒక్క ఉపసంహరణ ఉత్తర్వు మంచి, చెడుల సమాహారం. ఈ పరిణామాలు ఆయా విషయాలను అర్థం చేసుకోవడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు.
ట్రంప్ ఇంకా కొన్ని విపరీత చర్యలకు పాల్పడతారని కూడా భావిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రపంచ రాజకీయాలు మారతాయి. ప్రభావితమవుతాయి. ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, సామాజిక, రాజకీయ పరిస్థితులను మార్చేస్థాయిలో ట్రంప్ నిర్ణయాలు ఉండబోతున్నాయి.
వాతావరణ మార్పులు, పుడమి ఉష్ణోగ్రత పెరుగుదల, కర్బన ఉద్గారాల వల్ల ఏర్పడుతున్న విపరీత ప్రకృతి వైపరీత్యాలు, రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ దుందుడుకుతనం వంటి పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలు, తీసుకోబోతున్న నిర్ణయాలు అమెరికాను మార్చగలదు లేదా నాశనం చేయగలదు. తన ప్రస్తుత, భవిష్యత్ చర్యలు అమెరికాను మళ్లీ గొప్పగా మార్చబోతున్నాయని డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం.
అమెరికా భవిష్యత్తు ఎట్లా ఉన్నా.. పారిస్ ఒప్పందం (వాతావరణ మార్పుల మీద) నుంచి అమెరికా దేశం వైదొలగడం వల్ల భూగ్రహం చుట్టూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు విషయంలో ఉమ్మడి నిర్ణయాలు ఉండే అవకాశం సన్నగిల్లి వినాశనానికి దారి తీస్తుంది.
ట్రంప్ ఉత్తర్వులను ఒక వర్గం స్వాగతిస్తుంటే, ఇంకొక వర్గం వ్యతిరేకిస్తున్నది. ఈ రద్దులు ఒక అనూహ్య కలయిక. వారికి సంబంధించిన ఉత్తర్వుల పట్ల ప్రభావితమైనట్లు భావించేవారు ఇతర రద్దులను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక రద్దు పురోగమన చర్యగా భావించేవారు. ఇంకొక రద్దును తిరోగమన చర్యగా అభివర్ణించక తప్పడం లేదు.
ట్రంప్ నిర్ణయాల వెనుక ఉన్న తర్కం అంతుపట్టడం లేదు. వీటిలో ఉన్న అనూహ్యత ఈనాడు రాజకీయ పండితుల ముందున్న ఒక అంశం. ఈ నిర్ణయాలను ఏ కోణంలో చూడాలి - రాడికల్, క్యాపిటలిస్ట్, కమ్యూనిస్ట్, సోషలిస్ట్, ఆర్కియిస్ట్ లేదా ఏ విధమైన ఆలోచనా విధానం అని చెప్పడానికి వాటి మధ్య ఒక సాధారణ ఆధారం లేదు.
వైరుధ్య నిర్ణయాలు
పెట్రోల్, డీజిల్ వాహనాల మీద ఆంక్షలను రద్దు చేయడం వెనుక కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి అనుకున్నా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగినందువల్ల కార్పొరేట్ ప్రయోజనాలకు వస్తున్న నష్టం వంటి పరస్పర వైరుధ్య నిర్ణయాలు ట్రంప్ వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి. ట్రంప్ తన పాలన కోసం ఏరికోరి కీలక స్థానాలలో నియమించిన వ్యక్తులలో కూడా అందరూ అన్ని విషయాలలో ఆయనకు మద్దతుగా ఉండే అవకాశం లేదు.
మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజేన్స్ (ఏఐ) మీద నియంత్రణను కోరుకున్నారు. కానీ, సుందర్ పిచాయ్‌కి అది నచ్చకపోవచ్చు. రాబర్ట్ కెన్నెడీ డబ్ల్యూహెచ్ఓ నుంచి ఉపసంహరణను ఇష్టపడతారు. కానీ, సాధారణంగా అమెరికా సమాఖ్య స్ఫూర్తి సడలింపును ఇష్టపడకపోవచ్చు. బేషరతు మద్దతు ఇచ్చే వర్గాలు ట్రంప్‌కు ఉంటాయా అనేది పెద్ద అనుమానం.
వలస కుటుంబాలకు ట్రంప్ ధన్యవాదాలు
డొనాల్డ్ ట్రంప్ తన ప్రమాణ స్వీకారోత్సవ ప్రసంగంలో ఆసియా అమెరికన్లతో సహా తనకు ఓటువేసిన వలస కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపారు. కానీ, వారందరూ అతని చర్యలకు మద్దతు ఇవ్వరు. ఎందుకంటే, వలసలను అరికట్టడానికి తీసుకున్న నిర్ణయాలలో ఒకటి అమెరికాలో పుడితే వచ్చే పౌరసత్వం రద్దు చేశారు. వలసల నిరోధానికి కఠినచర్యలు చేపడతామని అనేకసార్లు ప్రకటించారు.
ఇప్పటినుంచి అమెరికా ప్రభుత్వ దృష్టిలో స్త్రీలు, పురుషులు అని స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో థర్డ్ జెండర్ గా భావించేవారందరూ ట్రంప్‌కు మద్దతు ఇవ్వకపోవచ్చు. ఐరోపాలో నాటో విస్తరణపై డొనాల్డ్ ట్రంప్ రష్యాకు హామీ ఇవ్వవచ్చు, అయితే, గ్రీన్‌ల్యాండ్, కెనడాను అమెరికాలో కలుపుకుంటానని బాహాటంగా ప్రకటించిన నేపథ్యంలో వేరొక దిశ నుంచి రష్యన్ భూభాగానికి నాటో దగ్గరగా వస్తుంది. రష్యాకు అది నచ్చకపోవచ్చు. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత ఏర్పడే పోటీతో ఐరోపా కూటమికి ఆర్థికపరమైన చిక్కులు ఎదురు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
‘అమెరికా ఫస్ట్’కు ప్రాధాన్యం
కార్పొరేట్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ‘అమెరికా ఫస్ట్’ విధానం పట్ల ప్రతిస్పందించే ప్రపంచంతో వ్యవహరించవలసి ఉంటుంది. ఈ విధానం కేవలం చైనా నుంచి వస్తున్న దిగుమతులకే పరిమితం కాదు. ఇతర దేశాల మార్కెట్‌లను చేరుకోవాలన్నా, దేశం అవతల వ్యాపారం చేయాలనుకున్నా దౌత్యం ద్వారా సాధించే పాతపద్ధతి మారుతుందా లేదా అనేది కూడా ఆసక్తికర అంశం.
పారిశ్రామిక వ్యవసాయంతో సహా అమెరికన్ తయారీ ఎగుమతులపై ఆధారపడి ఉంటుంది. ఎంతో కొంత దిగుమతులకు అంగీకరించకుండా ఏ దేశమైనా ఎగుమతి చేయదు. ట్రంప్ దేశ వ్యాపార ప్రయోజనాలు కాపాడే నాయకుడుగా ఎదిగే అవకాశం కూడా లేదు. అధ్యక్షుడుగా ఎన్నికైనప్పటికీ తన వ్యాపారాలను పక్కన పెట్టడం లేదు. ప్రమాణ స్వీకారానికి ముందే ఇటీవల తన కుటుంబ వ్యాపార ప్రయోజనాలను, ప్రత్యేకంగా మధ్యప్రాచ్యంలో తన అల్లుడు, కొడుకుల వ్యాపారాలతో ముడిపెడుతూ, రాజకీయాలతో కలపడం గమనార్హం.
ప్రపంచ వాణిజ్య సంస్థ బలహీనపడటం, యుద్ధాలు, ఆంక్షలకు తోడు డొనాల్డ్ ట్రంప్ చర్యలతో ప్రపంచ వాణిజ్యంపై అమెరికా తన పట్టును కోల్పోవచ్చు. డబ్ల్యూటీఓ, డబ్ల్యూహెచ్ఓ వంటి ప్రపంచ సంస్థలు బలహీనపడటం వాటి మీద ఆధారపడిన బహుళజాతి కార్పొరేటు సంస్థలకు, వారి ప్రపంచీకరణ మద్దతుదారులకు నచ్చకపోవచ్చు.
వాతావరణ మార్పుల హెచ్చరికలు ట్రంప్ బేఖాతర్
పుడమి మీద జరుగుతున్న విపరీత మార్పులను విశ్లేషిస్తూ ఈ శాస్త్రవేత్తల చేసిన హెచ్చరికలను ట్రంప్ ఎగతాళి చేశారు. భూమిని వేడెక్కిస్తున్న బొగ్గు, చమురు, సహజ వాయువుల నిక్షేపాలను వెలికితీసి తమ ఆర్థికాభివృద్ధికి ఉపయోగించడం తన లక్ష్యంగా ప్రకటించారు. ప్రపంచ వాతావరణ మార్పులను తాను అంగీకరించను, అమెరికా ప్రయోజనాలే తనకు ముఖ్యం అని ఘంటాపథంగా చెప్పారు.
2008లో డెమొక్రాట్ బరాక్ ఒబామా ఎన్నికైనప్పటి నుంచి అమెరికా చమురు ఉత్పత్తి రోజుకు 6.8 బిలియన్ బ్యారెళ్ల నుంచి 2023 నాటికి 19.4 బిలియన్లకు పెరిగింది. ట్రంప్ రాకముందే యునైటెడ్ స్టేట్స్ ఇప్పటికే ఎక్కువ ముడిచమురును ఉత్పత్తి చేస్తోంది. ట్రంప్ ఇంకా ఎక్కువ చేస్తా అంటున్నాడు. ట్రంప్ తన రెండవ పదవీకాలం మొదటి రోజే 2015 పారిస్ ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించుకున్నారు .
1992లో రియో డిజనీరోలో వాతావరణ మార్పుపై జరిగిన ఒప్పందం (యూఎన్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్) నుంచి కూడా వైదొలగవచ్చు. అంటే ప్రపంచ క్లైమేట్ చేంజ్ (వాతావరణ మార్పు) నాయకత్వం అమెరికా వదులుకున్నట్లే. ఇది చైనాకు అవకాశం ఇస్తుంది. ఇటీవల సంభవించిన కాలిఫోర్నియాలో కార్చిచ్చు కూడా పరిగణనలోనికి తీసుకోకపోవడం ట్రంప్ ప్రత్యేకత. ఇది పుడమి భవిష్యత్తుకు ప్రమాదకరం.
ట్రంప్ చర్యలు భారత్‌పై ప్రభావం
డొనాల్డ్ ట్రంప్ చర్యలు భారతదేశాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఇటీవల డాలర్ మారకం మీద భారత్‌ను హెచ్చరించిన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా జాగ్రత్త పడకతప్పదు. ఇప్పటివరకు చైనాను ఎదుర్కోవడానికి అమెరికా భారత్‌ను వాడుకుంటున్న దౌత్యంలో మార్పులు వస్తాయి.
అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి కూడా వైదొలగవచ్చు. ట్రంప్ పెంచే దిగుమతి సుంకాల మీద ప్రపంచ వాణిజ్య సంస్థతో పేచీలు పెరగవచ్చు. ఎగుమతుల మీద ఆధారపడే అమెరికా ఉత్పత్తులకు ఇది విఘాతం కలిగిస్తుంది. అమెరికా తన దేశానికి వచ్చే దిగుమతుల మీద ఆంక్షలు పెడితే ఆ దేశం చేసే ఎగుమతుల మీద ఆయా దేశాలు ఆంక్షలు విధిస్తాయి. ట్రంప్ హూంకరించినా పరిస్థితి మారకపోవచ్చు.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు దారి తీయవచ్చు. 1980వ దశకంలో అనేక దేశాలు వద్దు అంటున్నా గ్యాట్ ఒప్పందం ప్రపంచం మీద రుద్దిన అమెరికా తన ప్రయోజనాలకు భంగం వాటిల్లుతున్నదని ఇప్పుడు డబ్ల్యూటీఓను నిర్వీర్యం చేసే పనిలో ఉంది. అయితే, 2025లో చేపట్టే ఈ చర్య వల్ల ప్రపంచ వ్యాప్తంగా అమెరికా కార్పొరేట్ల గుత్తాధిపత్యానికి దెబ్బపడవచ్చు.
- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్-