జూన్ 7న హైదరాబాద్​లో ​ప్రపంచ వరి సదస్సు

జూన్ 7న హైదరాబాద్​లో ​ప్రపంచ వరి సదస్సు
  • రేపటి నుంచి రెండు రోజుల పాటు సెమినార్స్​​ 
  • 30 దేశాలకు చెందిన వరి ఉత్పత్తుల ప్రదర్శన
  • రాష్ట్రం నుంచి ఎగుమతులకు వెసులుబాటు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రపంచ వరి సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 7 నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్​లోని తాజ్ కృష్ణ హోటల్ లో ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. అమెరికాకు చెందిన అంతర్జాతీయ కమాడిటీస్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దీనిని చేపడుతున్నారు. 

ఈ సదస్సులో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థల కన్సార్టియంతో పాటు భారత వరి పరిశోధన సంస్థ, యూపీకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ అగ్రీవర్సిటీ, ఒరిస్సా అగ్రీవర్సిటీ, భారత వరి ఎగుమతిదారుల ఫెడరేషన్ (ఐఆర్​ఈఎఫ్), వరి ఎగుమతిదారుల అసోసియేషన్ తదితర సంస్థల ప్రతినిధులతో పాటు దాదాపు 30 దేశాల నుంచి వరి ఉత్పత్తుల ఎక్స్​పోర్ట్, ఇంపోర్ట్​ దారులు, స్వదేశీ అనుబంధ సంస్థల ప్రతినిధులు, రాష్ట్రం నుంచి అధికారులు, శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొననున్నారు.

పెరిగిన రైస్​ ఎక్స్​పోర్ట్స్​..

మనదేశంలో బియ్యం ఉత్పత్తి స్వాతంత్ర్యం అనంతరం దాదాపు 8 రెట్లు పెరిగి.. 14 కోట్ల టన్నులకు చేరింది. గత ఐదేండ్లలో దేశంతో పాటు తెలంగాణలో బియ్యం ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. ప్రపంచంలో బియ్యం అధికంగా వినియోగించే దేశాల్లో ఏటా 155 మిలియన్​ టన్నులతో చైనా ఫస్ట్​ ప్లేస్​లో ఉండగా.. భారత్​ 114.5 మిలియన్ టన్నులతో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 37.5 మిలియన్ టన్నులు, ఇండోనేషియా 35.6 మిలియన్  టన్నులు, వియత్నాం 21.9 మిలియన్  టన్నులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

వరి అత్యధికంగా ఇంపోర్ట్​ చేసుకొనే దేశాలలో ఫిలిపైన్స్ 3 మిలియన్​ టన్నులతో ఫస్ట్​ ప్లేస్​లో ఉండగా.. చైనా, ఇరాక్, బెనిన్, మొజాంబిక్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. 2022–-23 సంవత్సరంలో దాదాపు 191 దేశాలు 420 లక్షల టన్నులు బియ్యాన్ని దిగుమతి చేసుకున్నాయి. ఎగుమతి చేసే దేశాలలో 17.86 మిలియన్​ టన్నులతో భారత్​ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత థాయ్​లాండ్, వియత్నాం, పాకిస్తాన్​, చైనా ఉన్నాయి. తెలంగాణ నుంచి గత నాలుగేండ్లుగా ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏటా రూ.15 వేల కోట్లకు పైగా విలువైన బియ్యం ఎక్స్​పోర్ట్​అవుతున్నట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రం నుంచి ఫిలిపైన్స్, అమెరికా,  బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే, కెనడా దేశాలకు ఎక్కువగా.. సింగపూర్, ఆస్ట్రేలియాకు తక్కువగా ఎక్స్​పోర్ట్స్​ అవుతున్నాయి. 

అందరి చూపు భారత్​వైపే..

ప్రస్తుతం ప్రపంచంలో అభివృద్ధి చెందిన యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలే కాకుండా ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని దేశాలు బియ్యం దిగుమతి కోసం భారత్​ వైపు చూస్తున్నాయి. ఈ అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే రైతాంగానికి సరైన ధరతో పాటు పెద్దమొత్తంలో మార్కెట్ నిల్వల సమస్యను పరిష్కరించుకోవచ్చని ఎక్స్​పర్ట్స్​అంటున్నారు. 

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ప్రభుత్వం ఈ సమస్యలకు పరిష్కారం చూపించే దిశలో భాగంగా దేశంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ కమాడిటీస్ సంస్థ సహకారంతో  ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తున్నది. ఈ సదస్సుతో ఎక్స్​పోర్ట్స్, ఇంపోర్ట్స్​ చేసే వారికి  ఒక వేదిక కల్పించి వ్యాపార అవకాశాలు వృద్ధి చేయనున్నారు. వరి పండించే రైతులందరికీ ఇది దోహదపడుతుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆశాభావం వ్యక్తం చేశారు.