విచ్చలవిడిగా ఇసుక తవ్వేస్తే వినాశనమే!

  • నివేదిక విడుదల
  • ఏటా 5 వేల కోట్ల టన్నుల మేర తవ్వకం
  • రెండు దశాబ్దాల్లో మూడు రెట్లు పెరిగిన వినియోగం
  • ఇట్లైతే భూముల సారం తగ్గిపోయే ప్రమాదం.. తుఫాన్ల ముప్పు
  • దీవులు, తీరప్రాంతాలు మునిగే అవకాశం

న్యూఢిల్లీ, వెలుగు: ప్రపంచ వ్యాప్తంగా ఇసుకను విచ్చలవిడిగా తవ్వేస్తున్నారని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని లక్షల ఏండ్ల పాటు ప్రాసెస్​ జరిగి తయారయ్యే ఇసుకను.. జస్ట్​ కొన్నేండ్లలోనే వాడేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాగైతే అభివృద్ధి మాట దేవుడెరుగు.. వినాశనం తప్పదని హెచ్చరించింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఇసుక వాడకంపై యునైటెడ్​ నేషన్స్​ ఎన్విరాన్మెంట్​ ప్రోగ్రామ్​ (యూఎన్​ఈపీ) నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలోని 22 మంది పరిశోధకులు అధ్యయనం చేసి ఇచ్చిన వివరాల ఆధారంగా నివేదికకు రూపునిచ్చింది. ఇసుకను అతిగా వాడేస్తే ప్రపంచం భవిష్యత్​లో పెను విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్​ ఇచ్చింది. 

నీళ్ల తర్వాత ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్న సహజ వనరు ఇసుకే. కట్టడాలను పక్కనపెడితే.. గాజు గ్లాసుల తయారీకీ ఇసుకను విచ్చలవిడిగా వాడుతున్నారు. వాడకం ఏదైనా సరే.. రెండు దశాబ్దాల్లో ఇసుక వాడకం మూడు రెట్లు పెరిగిందని యూఎన్​ఈపీ రిపోర్ట్​లో వెల్లడించింది. ప్రస్తుతం ఒక్క ఏడాదికి సగటున 5 వేల కోట్ల టన్నుల (50 లక్షల కోట్ల కిలోలు) ఇసుకను తవ్వేస్తున్నట్టు పేర్కొంది. ఆ ఇసుకతో భూమి చుట్టూ 27 మీటర్ల ఎత్తు, 27 మీటర్ల వెడల్పుతో ఓ గోడను కట్టొచ్చని చెప్పింది. ఓ మనిషి రోజుకు సగటున 17 కిలోల ఇసుకను వాడుతున్నట్టు తెలిపింది. 

ఇదీ ముప్పు..

ఇసుకే కదా.. తవ్వి వాడేస్తే ఏమైతదిలే అన్నట్టే ఉంది అక్రమంగా మైనింగ్​ చేసేస్తూ.. ఇసుకను దోచేస్తున్న కొందరి తీరు. కానీ, దాని వల్ల కలిగే ముప్పు ఇంతింత కాదని  హెచ్చరిస్తోంది యూఎన్​ రిపోర్ట్​. పర్యావరణ సంక్షోభం తప్పదని, మనిషి మనుగడే ప్రమాదంలో పడుతుందని వార్నింగ్​ ఇచ్చింది. నదుల్లో ప్రవాహం తగ్గిపోతుందని, తీర ప్రాంతాలు కోతకు గురవుతాయని రిపోర్ట్​లో పేర్కొంది. చిన్న చిన్న దీవులు మునిగిపోతాయని తేల్చి చెప్పింది. నదుల్లో స్వచ్ఛమైన నీరు పారక.. అప్పటిదాకా మంచి పంటలు పండే భూముల్లో సారం తరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. సముద్రాల బీచులు తెగి ఉప్పునీళ్లు నదుల్లోకి వస్తాయని చెప్పింది. ఫలితంగా చాలా ప్రాంతాలు వరదలకు గురవుతాయని హెచ్చరించింది. పర్యావరణ స్వరూపం మారి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. తుఫాన్లు తీవ్ర రూపం దాల్చకుండా కాపాడడంలో ఇసుకది కీలక పాత్ర అని, బీచుల్లో ఇసుకే లేకపోతే ఎప్పటికప్పుడు  మరింత తీవ్రమైన తుఫాన్లు ఏర్పడతాయని హెచ్చరిస్తోంది. అంతేకాదు.. ఇసుకలో బతికే ఎన్నో జీవులు అంతరిస్తాయని, జీవ వైవిధ్యం ప్రమాదంలో పడుతుందని చెప్పింది. ఆగ్నేయాసియాలోనే అతి పొడవైన మెకాంగ్​ నదిలో జరిగిన పరిణామ క్రమాన్ని సైంటిస్టులు ఇందుకు ఉదాహరణగా చెప్పింది.  

నీళ్లలాగానే ఇసుకపైనా నియంత్రణ అవసరం

నీళ్ల వాడకంలో  వివిధ దేశాలు, ఆ దేశాల్లోని రాష్ట్రాల్లో నియంత్రణలను పెట్టారు. బోర్డులు, మండళ్లను ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా ఎప్పుడు ఎంత నీటిని వాడుకోవాలనే దానిపై రూల్స్ పెట్టుకున్నారు. నీటి పంపకాల విషయంలోనూ రెగ్యులేషన్​ ఉంది. కానీ, ఇసుక విషయంలో మాత్రం రూల్స్​ అంటూ ఏవీ లేవు. కొద్దో గొప్పో మైనింగ్​ రూల్స్​ను అమలు చేస్తున్నా.. పరిమితంటూ లేదు. దీంతో కొందరు చెలరేగిపోయి అందినకాడికి నదులు, ఏరులు, వాగుల నుంచి ఇసుకను తోడేస్తున్నారు. వ్యాపార సామ్రాజ్యంగా మార్చేసుకుంటున్నారు. ఇటు డ్రెడ్జింగ్​ పేరిట ఓడ రేవులు, సముద్ర తీరాల్లో పూడిక తీస్తుండడమూ ఇసుక తరిగిపోవడానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలోనే నీళ్ల వాడకం లాగానే ఇసుక వాడకంపైనా నియత్రణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని యూఎన్​ ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు. భవిష్యత్​లో సంక్షోభం రాకుండా ఉండాలంటే ఇసుక వాడకాన్ని తగ్గించి.. ఇప్పటికే కట్టిన బిల్డింగులు, ఇతర కట్టడాల నుంచి ఇసుకను రీసైకిల్​ చేసి వాడుకోవాలని సూచిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలకు పలు సూత్రాలను సూచిస్తున్నారు. 

  •     ఇసుకను ముఖ్యమైన సహజ వనరుగా గుర్తించాలి.
  •     ప్రాంతాలకు అనుగుణంగా ఇసుక తవ్వకం, వాడకంపై చట్టపరమైన నిబంధనలను తీసుకురావాలి
  •     ఇసుకకు బదులు పునరుత్పాదక వనరులపై దృష్టి సారించాలి
  •     మినరల్​ రైట్స్​, ఒప్పందం ప్రకారం ఇసుక గనులపై రెగ్యులేషన్​ను తీసుకురావాలి.
  •     ఇసుక వనరులపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాలె. ఎప్పటికప్పుడు నివేదికలను తయారు చేసుకుంటూ ఉండాలి. 
  •     ఇసుకను బాధ్యతాయుతంగా వాడుకోవడంపై అవగాహన కల్పించాలి.
  •     ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు పర్యావరణ సమతుల్యతను పెంపొందించుకోవాలి.

తయారీకి తరాల కాలం..

ఇప్పుడు మనం వాడిన, వాడుతున్న ఇసుక కొన్ని లక్షల ఏండ్ల కిందట తయారైందే. అవును, వాతావరణంలో జరిగే మార్పులు, ఇతర కారణాల వల్ల ఒక రాయి కొన్ని లక్షల ఏండ్ల పాటు తరిగి కరిగి ఇసుకలా మారుతుంది. క్వార్ట్జ్​, ఫెల్డ్​స్పార్​ వంటి రాళ్లు క్రమక్షయం కావడానికి కొన్ని లక్షల ఏండ్లు పడుతుందని నేషనల్​ ఓషియానిక్​ అండ్​ అట్మాస్ఫెరిక్​ అడ్మినిస్ట్రేషన్​ (ఎన్వోఏఏ) చెప్తోంది. సముద్రాల్లోని రాళ్లు కొన్ని వేల కిలోమీటర్లు నిదానంగా నీటి ప్రవాహంలో ప్రయాణించి.. నదులు, సెలయేటి ప్రవాహాల్లోకి చేరుతాయి. ఆ ప్రవాహాల తాకిడికి రాళ్లు నిమ్మలంగా కదులుతూ పొడిగా మారుతుంది. ఆ పొడే మనం వాడే ఇసుక. ఇంత ప్రాసెస్​ జరిగి తయారయ్యే ఆ ఇసుకను వెనకాముందూ చూడకుండా మనం వాడేసి భవిష్యత్​ను ప్రమాదంలో పడేస్తున్నామన్నదే యూఎన్​ ఆందోళనంతా.