ఆర్థిక వ్యవస్థకు టూరిజం ఊతం.. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

ఆర్థిక వ్యవస్థకు టూరిజం ఊతం.. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

“తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది” అనే సామెత ఆధారంగా కొత్త ప్రదేశాల సందర్శన మానవుల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తోంది.  దీంతో పాటు ఓర్పు, విజ్ఞానం, సానుకూల దృక్పథాలను  అలవరుస్తాయి.  విహారం కొందరికి వినోదం మరికొందరికి విజ్ఞానం ఇంకొందరికి విలాసం.  విహారం ఒక అనుభవ సారం. 1970 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో ప్రపంచ పర్యాటక సంస్థను ఆమోదించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకోవడం 1980 నుంచి ప్రారంభమైనది.  ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ఉత్సవాలు నిర్వహించే ప్రపంచ పర్యాటక సంస్థ ఈసారి పర్యాటకం, శాంతి అనే నినాదంతో ముందుకు వచ్చింది. 

ఆర్థిక వ్యవస్థలో ప్రధాన  భూమిక

యాత్రలు వినోదాలు, విలాసాల పరిధిని దాటి విజ్ఞాన సాధనాలుగా, అనుభవ సారాలుగా ఎదగడం మధ్యయుగాలలోనే మొదలైంది. సాంకేతికత అలవర్చుకున్న ఆధునిక కాలంలో రకరకాల ప్రయోజనాలకోసం ప్రజలు పర్యటనలు చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల విహారం ఒక పరిశ్రమగా రూపుదిద్దుకొని శాఖోపశాఖలుగా విస్తరించింది.  ఇది చాలా దేశాలకు వాటి ఆర్థికవ్యవస్థలలో ప్రధాన  భూమికను పోషిస్తుంది. ఆధునిక పర్యాటక పితామహుడుగా పేరుగాంచిన థామస్ కుక్.. బ్రిటిష్ రవాణా సంస్థ థామస్ కుక్ అండ్ సన్ 1842లో ఏర్పాటు చేసిన తర్వాత పర్యాటక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మందికి పైగా పర్యాటకులు  వివిధ ప్రదేశాలను సందర్శించారు. అత్యధిక పర్యాటకులు సందర్శించిన దేశంగా ఫ్రాన్స్ ముందు వరుసలో ఉంటుంది. తరువాత వరుసగా స్పెయిన్, అమెరికా,  చైనా,  ఇటలీ,  టర్కీ,  మెక్సికో,  జర్మనీ, థాయ్  లాండ్,  బ్రిటన్ ఉన్నాయి. 

పర్యాటక రంగంలో భారత్ 39వ స్థానం

ప్రపంచంలో ఇతర దేశాల కన్నా  భారతదేశంలో గణనీయమైన వారసత్వ సంపద ఉంది. యునెస్కో ప్రకటించిన ప్రపంచ వారసత్వ కట్టడాలు భారత్ లో 43 ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ప్రాతిపదికన  వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రచురించిన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్(TTDI) 2024 నివేదిక ప్రకారం 114 దేశాలలో భారత్ 39వ స్థానంలో ఉంది. 1966లో ప్రారంభమైన భారత పర్యాటక అభివృద్ధి సంస్థ, ఇతర రాష్ట్ర స్థాయి పర్యాటక సంస్థలు అనేక పథకాలకు శ్రీకారం చుట్టాయి.  గత ఏడాది నాటికి భారత పర్యాటక రంగం ద్వారా 16 లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభించింది. 2029 నాటికి పర్యాటక రంగం ఆదాయం రూ. 35 లక్షల కోట్లకు చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 దేశంలోని వివిధ పర్యాటక స్థలాలను సందర్శిస్తున్న వారిలో 90%  భారతీయులే ఉంటున్నారు. స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. స్వదేశీ దర్శన్ ప్రసాద్ లాంటి పథకాలతో పాటు స్వదేశీ విమాన ప్రయాణాలను ప్రోత్సహించడానికి ఉడే దేశ్ కా హమ్  నాగరిక్ (ఉడాన్) పథకాన్ని ప్రారంభించింది.  టూరిజం మంత్రిత్వ శాఖ ఇన్​క్రెడిబుల్ ఇండియా నినాదంతో దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.  భారత పర్యాటక రంగం ప్రస్తుతం 6.9% వార్షిక వృద్ధిరేటును నమోదు చేసుకుంది. భారత్​కు వచ్చే విదేశీ పర్యాటకులలో ఎక్కువగా  సందర్శించే ప్రాంతాలలో ఆగ్రా ముందు వరుసలో ఉంటుంది. ఆ తరువాత వరుసగా ఢిల్లీ, జైపూర్,  గోవా,  ముంబై,  చెన్నై,  మైసూర్, హంపి, కేరళతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ పర్యాటక ప్రాంతాలకు ఎక్కువ తాకిడి ఉంటుంది. 

- డా. చల్ల ప్రభాకర్ రెడ్డి,
ప్రిన్సిపాల్, ప్రభుత్వ​ జూనియర్​ కాలేజ్