మొబైల్‌‌‌‌ నియంత్రణపై ప్రపంచ దేశాల చూపు

మొబైల్‌‌‌‌ నియంత్రణపై ప్రపంచ దేశాల చూపు

పిల్లల చేతిలో ఆటవస్తువుగా మారిన సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌పై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి.  పిల్లల అల్లరి ఆపడం కోసం చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్‌‌‌‌ ఇవ్వడం పరిపాటిగా మారింది. ఇది కాస్తా అలవాటుగా మారి వ్యసనమైంది.  నిత్యజీవితంలో పిల్లలు  ఎక్కువ సమయం ఫోన్‌‌‌‌తో గడుపుతున్నారు. వీటి ప్రభావంతో వారిలో దూకుడు, అవాంఛనీయ నిర్ణయాలు, అసంకల్పిత ఆలోచనలు మితిమీరుతున్నాయి.  

ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన, చికాకు పెరిగిపోతున్నాయి. చిన్న విషయాలకే  తీవ్రంగా స్పందిస్తున్నారు. విచక్షణ కోల్పోయి హింసాత్మక సంఘటనలకూ పాల్పడుతున్నారు. డిజిటల్‌‌‌‌ ఉపకరణాలు,  సామాజిక మాధ్యమాలు, సినిమాలు, గేమ్‌‌‌‌షోలు, వెబ్‌‌‌‌సిరీస్‌‌‌‌ తదితరాలకు బానిసలుగా మారుతుండటంతో పిల్లల్లో  మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి.చిన్నారుల రోజువారీ ఫోన్‌‌‌‌ వినియోగంపై పలు సంస్థలు  అధ్యయనాలు చేశాయి. 

42 శాతం మంది 12 ఏళ్లలోపు వయస్సు పిల్లలు రోజులో  రెండు నుంచి నాలుగు గంటలపాటు ఫోన్‌‌‌‌  స్ర్కీన్‌‌‌‌కు అతుక్కుపోతున్నారు. 12 ఏళ్ల కంటే పైబడిన పిల్లలు రోజులో 47 శాతం సమయం ఫోన్‌‌‌‌ చూస్తున్నారని అధ్యయన నివేదికలు వెల్లడిస్తున్నాయి. 69 శాతం పిల్లలకు సొంత ఫోన్‌‌‌‌లు, ట్యాబ్‌‌‌‌లు ఉన్నాయని తేల్చింది. 74 శాతం మంది పిల్లలు యూట్యూబ్‌‌‌‌ చూసేందుకు ఫోన్‌‌‌‌ వాడుతుంటే, 12 ఏళ్లు 'పైబడినవారు గేమింగ్‌‌‌‌ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. 

23.8 శాతం మంది పిల్లలు పడుకునే ముందు పడకపై  ఫోన్‌‌‌‌ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌‌‌‌ఫోన్లు ఉపయోగిస్తున్న చిన్నారుల్లో 37.15 శాతం మందిలో ఏకాగ్రత స్థాయిలు తగ్గిపోతున్నాయి. పిల్లల జీవితంపై వ్యతిరేక ప్రభావం చూపిస్తున్న స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ వాడకంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈమేరకు చైనా, ఆస్ట్రేలియా,  ఫ్రాన్స్‌‌‌‌, బ్రిటన్‌‌‌‌, అమెరికా తదితర దేశాలు పిల్లలు ఫోన్‌‌‌‌ వాడకాన్ని నియంత్రించేలా పలు నిబంధనలు రూపొందించాయి.

చిన్నారులకు స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ వ్యసనం

చిన్నారుల చేతిలో స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ పెడితే డ్రగ్స్‌‌‌‌ అలవాటు చేసినట్లేనని ఓ ప్రముఖ థెరపిస్టు అభిప్రాయపడ్డాడు.  స్నాప్‌‌‌‌చాట్‌‌‌‌, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌, వాట్సప్‌‌‌‌, యూట్యూబ్‌‌‌‌ తదితర సోషల్‌‌‌‌ మీడియా మాధ్యమాలు పిల్లలను డ్రగ్స్‌‌‌‌, మద్యంలాగే  బానిసలుగా మార్చుకుంటున్నాయని పలువురు ఉపాధ్యాయులు వెల్లడిస్తున్నారు. గడిచిన పదేండ్లలో స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ అడిక్షన్‌‌‌‌ కంప్లయింట్లు విపరీతంగా పెరిగిపోవడంతో సోషల్‌‌‌‌ మీడియా నియంత్రణపై ఆస్టేలియా దేశం ప్లారమెంట్‌‌‌‌లో కీలకబిల్లును ఇటీవల ఆమోదించింది. 

శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాల వినియోగంను నిషేధించింది. ఎక్స్‌‌‌‌, ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌, ఇన్‌‌‌‌స్టాగ్రాం, టిక్‌‌‌‌టాక్‌‌‌‌, స్నాప్‌‌‌‌చాట్‌‌‌‌, రెడిట్‌‌‌‌ వంటి సోషల్‌‌‌‌ మీడియా ప్లాట్‌‌‌‌ఫాంలు నిషేధానికి గురయ్యాయి. ఈ జాబితా నుంచి యూట్యూబ్‌‌‌‌ను మినహాయించింది.  వయసు నిబంధనను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  పిల్లల ఖాతాలు నిరోధించలేని సంబంధిత సామాజిక మాధ్యమ వేదికలకు 50 మిలియన్‌‌‌‌ ఆస్ట్రేలియా డాలర్లు (సుమారు రూ. 290 కోట్లు) జరిమానాగా విధించింది. 

చైనా దేశం 2019లోనే చిన్నారులు పగటిపూట ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ ఆడుకునే సమయాన్ని 90 నిమిషాలకు పరిమితం చేస్తూ ఆంక్షలు విధించింది. శుక్ర, శని, ఆదివారాలతోపాటు సెలవు రోజుల్లో ఈ సమయాన్ని గంటకే పరిమితం చేసింది. 2021లో ఈ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ వినియోగం రోజుకు గరిష్టంగా రెండు గంటలకు చైనా అంతర్జాల నియంత్రణ సంస్థ (సీఏసీ) పరిమితం చేసింది. ఇంటర్నెట్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫాంలలో 'యూత్‌‌‌‌ మోడ్‌‌‌‌'ను తీసుకువచ్చి చిన్నారుల వయసుకు తగిన సమాచారం అందేలా నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో చిన్నారులు మొబైల్‌‌‌‌కు అతుక్కుపోవడం చాలావరకు తగ్గినట్లు చైనా అధికారులు గుర్తించారు.

రోజు రోజుకీ పెరిగిపోతున్న సైబర్‌‌‌‌ నేరాలు

 గత ఏడాది 15 ఏళ్లలోపు వారికి సోషల్‌‌‌‌ మీడియా వాడకంపై నిషేధం విధించాలని ఫ్రాన్స్‌‌‌‌ ప్రతిపాదించింది. కానీ వినియోగదారులు, తల్లిదండ్రుల సమ్మతితో  నిషేధాన్ని దాటవేయగలిగారు. అమెరికాలో 18 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌‌‌‌ మీడియాను యాక్సెస్‌‌‌‌ చేయాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఇక మన దేశంలో పలు స్వచ్ఛంద సంస్థలు, పలువురు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేధావులు పిల్లల సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ వాడకం పట్ల అభ్యంతరాలు వ్యక్తం  చేస్తున్నారు.  

రోజు రోజుకీ పెరిగిపోతున్న సైబర్‌‌‌‌ నేరాలకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళనకు గురవుతోంది. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని సమాలోచనలు జరుపుతోంది. ఇదే తరహాలో ఇతర దేశాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న సోషల్‌‌‌‌ మీడియాను నియంత్రించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పిల్లల మానసిక ప్రవర్తన, ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం పడకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాయి. 

 పిల్లల్లో మానసిక పరివర్తన తీసుకురావడానికి ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కట్టుదిట్టంగా వ్యవహరించాల్సిన సమయమిది.  భావి పౌరులైన బాలలు దారితప్పకుండా వారిని ఉత్తములుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలి.  ఖాళీ సమయంలో వారు ఏం చేస్తున్నారో ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. 

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ ఆడకుండా జాగ్రత్తపడాలి

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ స్థానంలో  పిల్లల్లో విజ్ఞానాన్ని పంచే సృజనాత్మకతను పెంపొందించే నీతి కథలను బోధించే యాప్‌‌‌‌లు, వెబ్‌‌‌‌సైట్లు, యూట్యూబ్‌‌‌‌ వీడియోలను ప్రోత్సహించాలి. ఏకాంతాన్ని దూరం చేస్తూ వారిలో మానసికోల్లాసాన్ని కలగజేయడానికి తోటి విద్యార్థులతో సంతోషంగా ఆడుకునేలా చూడాలి.  విద్యార్థులు ఒత్తిడికి లోనవకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మానసిక నిపుణులను నియమించాలి. 

Also Read : రేవంత్ అంటే భయమా? ప్రజలంటే అలుసా?

అవసరమైన విద్యార్థులకు వారితో కౌన్సెలింగ్‌‌‌‌ చేయించాలి. విద్యార్థులు సైబర్‌‌‌‌ నేరాల బారినపడకుండా అన్ని పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టి వారిలో అవగాహన పెంచాలి. డిజిటల్‌‌‌‌ ఉపకరణాల వినియోగాన్ని నియంత్రించాలి.  అశ్లీల చిత్రాలు చూడకుండా, పెడదోవ పట్టించే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ ఆడకుండా జాగ్రత్తపడాలి. విజ్ఞానం, వినోదం పంచే, సృజనాత్మకతను పెంచే అప్లికేషన్లు, ఆటపాటలపైకి వారి దృష్టిని మళ్ళించాలి. బహుముఖ కార్యాచరణ చేపడితేనే, 
అభం శుభం తెలియని చిన్నారులను నేరాల ఊబిలో చిక్కుకోకుండా కాపాడుకోవచ్చు.

-  కోడం పవన్‌‌‌‌ కుమార్‌‌‌‌,  సీనియర్ జర్నలిస్ట్ -