జలం ఒడిసిపడితేనే ప్రతిఫలం

జలమే జీవనాధారం. నీరు లేనిదే సమస్త జీవ కోటికి మనుగడ లేదు. అసలు జీవ పరిణామం ప్రారంభమైందే సముద్ర గర్భంలో అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు పుష్కలంగా దొరికిన మంచి నీటిని అభివృద్ధి పేరిట మనిషి అందనంత దూరానికి తీసుకువెళ్తున్నాడు. అవసరానికి మించి వాడుతూ, కలుషితం చేస్తూ  ఉన్న కాస్త నీటిని వృథా చేస్తున్న పరిస్థితి. సమీప భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరిగే రోజులు కూడా రానున్నాయనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఐక్యరాజ్య సమితి ‘ప్రపంచ జల దినోత్సవం(వరల్డ్ వాటర్ డే)’  నిర్వహిస్తున్నది. ఏటా మార్చి 22న దీన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. నీటి, పారిశుద్ధ్య సమస్య పరిష్కారాన్ని వేగవంతం చేయాలనే ‘యాక్సిలరేటింగ్ చేంజ్’​ఇతి వృత్తంతో ఈ ఏడాది వాటర్​డే నిర్వహిస్తున్నారు. ఆదిమ కాలం నుంచి నేటి మానవుడికి, నీటికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. చారిత్రకంగా మన పురాతన నాగరికతలు కూడా జలవనరుల దగ్గర విలసిల్లినవే. 

జలశక్తి అభియాన్ ​స్ఫూర్తితో..

సమర్థ జల వనరుల నిర్వహణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి పౌరుడు జలవనరుల పట్ల జాతీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలి. వ్యర్థ జలాల పునర్వినియోగం, కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలి. ప్రభుత్వాలు వాటర్ షెడ్ పథకాలు, ఇంకుడు గుంతలను ప్రోత్సహించాలి. నదుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, నవీకరణ కార్యక్రమాలను చేపట్టాలి. జలవనరులు తక్కువ ఉన్న ప్రాంతాల్లో బిందు సేద్యం, తుంపర సేద్యంను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సబ్సిడీలు పెంచాలి. సేద్యపు నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి. సమీకృత నీటి నిర్వహణ విధానాన్ని పటిష్టంగా అమలు పరచాలి. జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1974 పటిష్టంగా అమలు చేయాలి. సుస్థిర నీటి సంరక్షణ, నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి రాజస్థాన్ లోనీ అల్వార్ జిల్లాకు చెందిన రాజేంద్ర సింగ్, మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి ప్రాంతంలో అన్నా హజారే చేపట్టిన కార్యక్రమాలను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలి. ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణకు చేపట్టిన “జల శక్తి అభియాన్” ను జల ఉద్యమంగా తీసుకువెళ్లి నీటి కరువుకు చరమగీతం పాడాలి. 2018-–2028 దశాబ్దాన్ని ‘వాటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్’గా యూఎన్​వో జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. దీనికి అనుగుణంగా జలంను ఒడిసిపట్టినప్పుడే.. మానవాళికి ప్రతిఫలం ఉంటుంది.

భవిష్యత్​లో కొరత రాకుండా..

ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, నదులు, సరస్సులు ద్వారా భూ ఉపరితలంపై నీరు లభిస్తున్నది. బావులు, బోర్ల ద్వారా భూగర్భ జలంను తాగు, సాగు నీటికి వాడుకుంటున్నం. భూగోళంపై భూమి కంటే నీరే ఎక్కువ ఉన్నది. కానీ 2.5 శాతమే మంచినీరుగా ఉంది. అందులో 0.3 శాతం నదులు, కాలువల్లో ఉన్నది. ఈ నీరు మాత్రమే తాగడానికి పనికొస్తున్నది. కాబట్టి మానవుడి తాగునీటి అవసరాలకు నదులు, కాలువల నీరే ఆధారం. 2015లో పేర్కొన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యం 6 ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా అందరికీ నీరు, పారిశుద్ధ్యం వసతి కల్పించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ  వాగ్దానానికి ప్రపంచ దేశాలు ఆమడ దూరంలో ఉన్నాయి. ప్రపంచంలో నేడు ప్రతి ముగ్గురిలో ఒకరికి శుద్ధమైన తాగునీరు దొరకడం లేదు. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇంధన డిమాండ్ 25 శాతానికి, నీటి డిమాండ్ 50 శాతానికి పైగా పెరగనుందని అంచనా.  ప్రపంచవ్యాప్తంగా సగానికంటే ఎక్కువ స్కూళ్లలో విద్యార్థులకు హ్యాండ్ వాషింగ్ సౌకర్యాలు లేవు. కనీసం చేతులు కడుక్కోవడానికి నీరు, సబ్బు కూడా అందుబాటులో లేని స్కూళ్లు చాలా ఉన్నాయి. అపరిశుభ్రమైన నీరు తాగి ఏటా ప్రపంచవ్యాప్తంగా 2,97,000 మంది(సుమారు రోజుకు 800) పిల్లలు అతిసారం బారిన పడి చనిపోతున్నారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు నీటి ఆవశ్యకతను గుర్తించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.

నీటి వృథాను అరికట్టాలి

ప్రపంచ జనాభాలో 17% భారత్ లో ఉన్నప్పటికీ, ప్రపంచంలోని మంచినీటి వనరుల్లో భారతదేశం కేవలం 4 శాతం మాత్రమే కలిగి ఉంది. కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా నీటి ఎద్దడి పెరుగుతున్నది. భారతదేశంలో నీటి వినియోగాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా నదులు, బావులు, చెరువుల ద్వారా నీటి అవసరాలను తీర్చుకుంటున్నాం. భారతదేశంలో గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి మొదలైన నదుల ద్వారా నీరు లభ్యమైనా, నిర్వహణ లోపం వల్ల అత్యధిక నీరు సముద్రంలో కలిసి వృథా అవుతోంది. ముఖ్యంగా నేడు పారిశ్రామీకరణ, పట్టణీకరణ, సాంద్ర వ్యవసాయం, అధిక జనాభా వల్ల జల వనరులపై అధిక ఒత్తిడి పెరుగుతోంది. మానవుని రోజువారీ జీవక్రియల నిర్వహణకు నీరు ప్రాణాధారం. కానీ అనేక రూపాల్లో నీరు కాలుష్యం కావడం వల్ల పలు రకాల వ్యాధులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా కలరా, టైఫాయిడ్, ఫ్లోరోసిస్ లాంటి హానికరమైన వ్యాధులు ప్రబలుతున్నాయి. భారతదేశంలో సరైన నీటి పొదుపు ప్రణాళికలు, నిర్వహణ, ప్రజల్లో అవగాహన లేమి వల్ల నీటి వృథా జరిగి జల సంక్షోభానికి దారి తీస్తున్నది. భారతదేశంలో అత్యధిక వర్షపాతం రుతుపవనాల వల్ల కలుగుతున్నది. నీరు లభ్యమైనా, నిర్వహణ లోపం, మానవ నిర్మిత కట్టడాలైన డ్యాములు, ప్రాజెక్టులు సరిపడా లేకపోవడం వల్ల ఎక్కువ వృథా అవుతున్నది. మానవ ప్రమేయం వల్ల వాతావరణ మార్పులు చోటుచేసుకొని, వర్షపాతంలో అనిశ్చితి ఏర్పడుతున్నది. అయితే అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయి. రక్షిత మంచి నీరు, పారిశుద్ధ్యం అనేవి ప్రజల కనీస ప్రాథమిక హక్కులుగా భారత రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ జల వనరుల నిర్వహణ లోపం వల్ల నేటికీ ఆచరణలో అది అమలు కావడం లేదు.
- సంపతి రమేశ్
సోషల్​ ఎనలిస్ట్