కోటి ఆశలతో ప్రపంచం కొత్త సంవత్సరానికి స్వాగతం

కోటి ఆశలతో ప్రపంచం కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. జనానికి కలలో కూడా ఊహించని కల్లోలాన్ని తీసుకొచ్చిన 2020 కాలగర్భంలో కలిసి పోయింది. ఇలాంటి సంక్షోభం మళ్లీ రావొద్దని కోరుకుంటున్న మానవాళికి కొత్త ఏడాది భరోసానిచ్చేలా హోప్ కనిపిస్తోంది. విషాదం నింపినా.. 2020 సంవత్సరం అంతా డిజాస్టర్లతోనే గడిచింది. కరోనా కారణంగా ప్రపంచ మానవాళిలో గడిచిన వందేళ్లలో కనీవినీ ఎరుగని విషాదం నిండింది. అయితే ఈ ఏడాది ఎప్పుడెప్పుడు అయిపోతుందని ఎదురుచూసినా కూడా.. 2020  మనకు ఎంతో నేర్పింది. కరోనా సంక్షోభ సమయంలో కష్టాన్ని ఎదుర్కొని నిలిచే గుండె ధైర్యాన్ని ఇచ్చింది. పరస్పరం సాయం చేసుకుంటూ.. తోటి వారి కష్టం గురించి ఆలోచించడం అలవాటు చేసింది. కుటుంబ బంధాల విలువను గుర్తించేలా చేసింది. కరోనా షట్ డౌన్ రావడంతో పొదుపు అవసరం ఏంటన్నది తెలిసేలా చేసింది. ఎన్నికష్టాలొచ్చిన పాజిటివ్ గా ఆలోచించి.. రాబోయే మంచి కోసం ఆలోచించడం నేర్పింది. కరోనా వ్యాక్సినేషన్.. 2020 మొత్తం ప్రపంచాన్ని పీడించిన మహమ్మారి కరోనా వైరస్. లక్షల కుటుంబాల్లో తాము ప్రేమించే మనిషి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. కోట్లాది కుటుంబాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధించింది. అపర కుబేరుల నుంచి సామాన్యుల వరకు అందరి బతుకు చిత్రాన్ని మార్చేసింది. ఈ వైరస్ అంత చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు నిర్విరామంగా కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం కష్టపడ్డారు. ఈ మహమ్మారి కొమ్ములు వంచేలా పలు సంస్థలు వ్యాక్సిన్ సిద్ధం చేశాయి. మన హైదరాబాద్ కే చెందిన భారత్ బయో టెక్ సంస్థ సహా ప్రపంచంలోని పలు  మరికొన్ని సంస్థలు వ్యాక్సిన్ కోసం చేసిన కష్టం ఫలించింది. ఇండియా, రష్యా, జర్మనీ, యూకే, అమెరికా వ్యాక్సిన్ రేసులో ముందున్నాయి. వైరస్ మ్యుటేట్ అయినా ఇప్పటికే రెడీగా ఉన్న వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రయోగాలన్నీ సక్సెస్ కావడంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో 2021 జనవరి తొలివారంలో ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త సంవత్సరంలో ఇదే అందరికీ అతి పెద్ద ఊరట. ఎంత కష్టం వచ్చినా.. గట్టి సంకల్పంతో పని చేస్తే దాన్ని ఎదుర్కొవడం సాధ్యమేనన్న పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగే సూచిక ఇది. డిజిటల్ పాఠాలకు బాటలు కరోనా రాకతో చదువు పూర్తిగా అటకెక్కింది. దాదాపు ఒక అకడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోయింది. దీంతో స్టూడెంట్స్ ఇంట్లోనే ఉండి చదువుకునేందుకు అవసరమైన ఇన్‌‌ఫ్రాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా దృష్టి పెట్టాయి. 2021లో రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు డిజిటల్ ఎడ్యుకేషన్ కు బాటలు వేసేందుకు  సిద్ధమవుతున్నాయి. డిజిటల్ ఇండియా లక్ష్యంతో మోడీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నూతన జాతీయ విద్యా విధానంలోనూ ఈ దిశగా చేయాల్సిన మార్పులపై ప్రస్తావన ఉంది. అలాగే దేశంలో అన్ని ప్రాంతాలకు ఫ్రీ వైఫై అందించడం ద్వారా పేదలకు ఈ–క్లాసుల విషయంలో ఎదురవుతున్న కష్టాలను తొలగించే వీలు కలుగుతుంది. ట్రంప్ – బైడెన్ అగ్రరాజ్యం అమెరికా 2021లో చూడబోయే కొత్త పరిణామం అధ్యక్షుడి మార్పు. ఒక రకంగా ఇది ప్రపంచం మొత్తం మీద ప్రభావం చూపే అంశం. అమెరికా ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయాలు, చేసే వ్యాఖ్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తారుమారు చేసేయగలవు. కొన్ని దేశాల భవిష్యత్తునే తలకిందులు చేసే సత్తా ఆ పదవిలోకి వచ్చే వ్యక్తికి ఉంటుంది. ఆ స్థానం నుంచి డొనాల్డ్ ట్రంప్ దిగిపోయి.. 2021 జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం చేయబోతున్నారు. ఆయన తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయన్న దానిపై భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ ఆశగా చూస్తున్నాయి. ట్రంప్ మన దేశానికి మిత్రుడిగానే ఉన్నప్పటికీ ఇమిగ్రేషన్​ విధానం వంటి కొన్ని నిర్ణయాలు మనకీ నష్టాన్ని చేశాయి. అయితే ఇప్పుడు బైడెన్ రాకతో ఆయన ఎక్కడ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తారోన్న చిన్న ఆందోళన ఉన్నప్పటికీ అలాంటిదేం జరగదని విదేశాంగ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. పైగా బైడెన్ దూకుడు నిర్ణయాలు తీసుకోరని, ఒబామా టైమ్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయనకు ఇండియా అవసరం తెలుసని, ఆయన అధ్యక్షుడు కావడం భారత్ కు మేలేనని అంటున్నారు. స్మాల్ స్కేల్ ఎకానమీకి బూస్ట్ కరోనా వైరస్ వచ్చి 2020ను ఓ ఆట ఆడేసుకుంది. మూడు నెలల లాక్డౌన్ ముప్పుతిప్పలు పెట్టింది. అప్పటి వరకు సాఫీగా సాగుతోన్న ఎందరో జీవితాల్లో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. దేశ ఎకానమీని పాతాళంలోకి పడేయగా.. డిజిటల్ పేమెంట్స్, ఈ–కామర్స్, ఎడ్టెక్ లాంటి సెక్టార్లను అందనంత ఎత్తుకు తీసుకెళ్లింది. ముట్టుకుంటే వైరస్ వస్తుందనే భయంతో గడప దాటకుండా అంతా ఆన్లైన్ బాట పట్టారు. దీంతో డిజిటల్ కామర్స్ బాగా పెరిగింది. డిజిటల్ పేమెంట్స్ రికార్డు స్థాయిలను తాకాయి. ఇండియా ముందు లక్ష కోట్ల డాలర్ల డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్పారు. వచ్చే ఏళ్లలో ఈ ఇండస్ట్రీలో ఉన్న సంస్థలు, కన్జూమర్లు లాభపడనున్నారని పేర్కొంటున్నారు. కరోనా తీసుకొచ్చిన మార్పులతో ఐటీ ఇండస్ట్రీలో సరికొత్త టెక్నాలజీలు పుట్టుకొచ్చాయి. అప్పటి వరకు ఆఫీసులకు వెళ్లి పనిచేసే వారందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి సరికొత్త పని విధానాలను అందిపుచ్చుకున్నారు. కరోనా వల్ల పడిపోతున్న ఎకానమీని కాపాడటం కోసం అటు ప్రభుత్వం, ఇటు ఆర్బీఐ ఎన్నో చర్యలు తీసుకున్నాయి. మార్కెట్లలోకి అవసరమైనంత లిక్విడిటీ అందించాయి. దీని ద్వారా 2021లో ఎకానమీకి వెన్నుముకగా ఉండే కుటీర, చిన్న సెక్టార్లు బూస్ట్ అయ్యే చాన్స్ ఉంది. అంతేకాక కరోనాతో వచ్చిన కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం చాలా మంది సొంతంగా వ్యాపారాలను ప్రారంభించారు. దీంతో ఎంట్రప్రెనూర్లు పెరుగుతున్నారు. 5జీ టెక్నాలజీ కొత్త ఏడాది రాబోయే అతి పెద్ద అడ్వాన్స్ మెంట్ 5జీ టెక్నాలజీ. కరోనా తర్వాత అంతా ఇంటర్నెట్ మయం కావడంతో టెలికాం యూజర్లకు కొత్త సబ్స్క్రయిబర్లు పెరిగారు. టెలికాం ఇండస్ట్రీ కూడా 4జీ నుంచి 5జీకి అప్డేట్ అవుతోంది. 5జీతో ఇంటర్నెట్ స్పీడ్ను పెంచాలని, ప్రతీ అవసరాన్ని తీర్చాలని టెలికాం ఇండస్ట్రీలో ఉన్న సంస్థలు భావిస్తున్నాయి. కొత్త ఏడాదిలో 5జీ సేవల లాంచ్  ఉంటుందని చాలా సంస్థలు ప్రకటనలు ఇచ్చేశాయి కూడా.  ఇందుకోసం అవసరమయ్యే టెక్నాలజీ, స్పెక్ట్రమ్ తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం కూడా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది. మొబైల్ తయారీ కంపెనీలు కూడా ఆ దిశ స్పీడ్ గా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, వన్ ప్లస్, మోటరోలా సహా అనేక కంపెనీలు 5జీ సపోర్ట్ చేసే మొబైల్ డివైజ్ లను అందుబాటులోకి తెచ్చేశాయి.