మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం.. వన్యప్రాణుల పరిరక్షణ మన బాధ్యత

మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం.. వన్యప్రాణుల పరిరక్షణ మన బాధ్యత

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 3న జరుపుకోవాలని 2013లో  ఐక్యరాజ్యసమితి జనరల్​ అసెంబ్లీ అధికారికంగా ప్రకటించింది. ఈ దినోత్సవం ప్రకృతి పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడే విధానాలపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ప్రారంభమైంది. ప్రతి ఏటా ప్రపంచ వన్యప్రాణి దినోత్సవానికి ఒక ప్రత్యేకమైన థీమ్‌‌ను నిర్ణయిస్తారు. 2025 సంవత్సరానికి సంబంధించి అధికారికంగా ప్రకటించిన థీమ్  ‘వైల్డ్‌‌ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్. ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్’.

మన భూగ్రహం మీద అనేక ప్రాణులు, వృక్షజాలం సహజంగా విస్తరించి ఉన్నాయి. వీటి పరిరక్షణ మన బాధ్యత.  వన్యప్రాణులు,  ప్రకృతి  వ్యవస్థల  పరిరక్షణ  వాతావరణ మార్పుల  ప్రభావాన్ని  తగ్గించడానికి  సహాయపడుతుంది. పర్యాటకం, ఆయుర్వేదం,  పరిశోధనల ద్వారా వన్యప్రాణులు మన ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. 

అంతరించిపోతున్న వన్యప్రాణులు
మనుషుల నిర్లక్ష్యంతో అనేక జంతువులు, వృక్షజాలం అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడటం అత్యంత అవసరం.   ప్రపంచవ్యాప్తంగా అనేక వన్యప్రాణులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.  International Union for Conservation of Nature (IUCN) రెడ్​ లిస్ట్​ ప్రకారం, కొన్ని జంతువులు అత్యంత ప్రమాదంలో ఉన్నాయి.

పక్షులు- .. కాలిఫోర్నియా కండోర్,  స్పూన్-బిల్ల్డ్ శాండ్ పైపర్, అమ్మోర్​ ఫాల్కన్. అదేవిధంగా  - -బెంగాల్  టైగర్,  ఏసియన్ ఏనుగు,  జయింట్​ పాండా,  సుమాత్రాన్ ఒరంగుటాన్,  సెబ్రియన్ ఖడ్గమృగం, ఏసియన్ లియోపార్డ్, ఇండో-చైనా టైగర్,  సముద్ర జీవులైన.. - హాక్స్​బిల్ సముద్ర తాబేలు, వాకిటా డాల్ఫిన్, బ్లూ వేల్, మాంటారే,  సరిసృపాలు, ఉభయచరాలైన - గోలియత్ ఫ్రాగ్, చైనీస్ ఆలిగేటర్, అక్సోలోటల్,  ఇతర కీలకమైన జంతువులు - రెడ్ పాండా, స్నో లియోపార్డ్,  సైగా యాంటెలోప్,  సుమాత్రన్ రైనో ప్రమాదంలో ఉన్నాయి.  మన రాష్ట్రంలో పాలపిట్ట, బట్టమేక పక్షులు కూడా అంతరించి పోవుటకు దగ్గరగా ఉన్నాయి.

ముప్పుకు కారణాలు
చెట్లు నరకడం చేయడం, అటవీ భూములను వ్యవసాయానికి మార్చడం  వన్యప్రాణులకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తోంది. వాతావరణ మార్పుల వల్ల అనేక జీవులు తమ సహజ  జీవ వాతావరణాన్ని కోల్పోతున్నాయి.  వేట, అక్రమ వాణిజ్యం అని  కొన్ని విలువైన జంతువుల భాగాలను ( ఏనుగు దంతాలు, చిరుతపులి గోర్లు, చర్మం) వ్యాపారం కోసం ఉపయోగించడం పెద్ద సమస్యగా మారింది.  సముద్ర జీవులపై  ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావం అధికంగా ఉంది. అనేక సముద్ర జంతువులు  ప్లాస్టిక్ కారణంగా మరణిస్తున్నాయి. సముద్ర, అటవీ ప్రాంతాల్లో  ప్లాస్టిక్,  రసాయనాల వినియోగాన్ని తగ్గించడంతోపాటు,  వన్యప్రాణుల వేట,  అక్రమ జంతువ్యాపారంపై  కఠినమైన  నిబంధనలు పాటించాలి.

ప్రజల్లో  వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించాలి. వన్య ప్రాణి సంరక్షణ చట్టం (1972) ను కఠినంగా అమలు జరిగేలా చూడాలి. భారతదేశంలో రాయల్ బెంగాల్ టైగర్  ప్రాజెక్ట్ ( 1973)వలన  టైగర్ జనాభా గణనీయంగా వృద్ధిలోకి వచ్చింది.  ఆ దిశగా ఇతర వన్య ప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి.

జీవవైవిధ్యాన్ని సంరక్షించాలి
సముద్ర  వన్యప్రాణుల సంరక్షణ కోసం  నేషనల్ పార్క్ల ఏర్పాటు,  రెడ్ లిస్టెడ్ జంతువుల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు చేయడం ద్వారా వన్య ప్రాణుల సంఖ్య వృద్ధిలోకి వస్తుంది. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మన మాతృభూమి, ప్రకృతి,  జీవవైవిధ్యాన్ని సంరక్షించే బాధ్యతను గుర్తు చేస్తోంది.  ప్రతి మనిషి వన్యప్రాణుల పరిరక్షణలో భాగస్వామి కావాలి.  పర్యావరణానికి హాని కలిగించే చర్యలను తగ్గించి,   భవిష్యత్ తరాల కోసం మన విలువైన ప్రకృతి సంపదలను కాపాడుకోవాలి.   ప్రతి ఒక్కరూ  వన్య ప్రాణులను  సంరక్షించడం ద్వారా  పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి.

-కమలహాసన్ తుమ్మ, జీవశాస్త్ర నిపుణుడు