ఆహార వృథా వద్దు.. భవిష్యత్తు తరాలపై ప్రభావం

ప్రపంచ జనాభా ఆహారపు అలవాట్లు, వస్తు వినియోగం భవిష్యత్తు తరాలపై కీలక ప్రభావం చూపుతుంది. భూమిపై జనాభా పెరుగుతూనే ఉంది. 2050 నాటికి ప్రపంచ జనాభా 9.8 బిలియన్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుత జీవనశైలిని కొనసాగించడానికి అవసరమైన సహజ వనరులను అందించడానికి దాదాపు మనలాంటి  మూడు గ్రహాలు అవసరం. వీటినుంచి బయటపడాలంటే ప్రజలు వస్తు, ఆహార వినియోగ అలవాట్లను మార్చుకోవాలి. వినియోగ స్థాయిలను తగ్గించుకోవాలి. వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలలో ఆశాజనకమైన మార్పులు చేయాలి. నాసిరకం వస్తువుల ఉత్పత్తి కాకుండా ఎక్కువ మన్నికగల ఉత్పత్తులను తయారుచేయాలి.  నిబద్ధత, వ్యాపార విధానాలలో స్థిరత్వం ప్రధానంగా ఉండాలి. 

ఆహార వృథా అనేది అధిక వినియోగానికి మరొక సంకేతం.  ప్రపంచ జనాభాలో అధికశాతం ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పటికీ,  సంవత్సరానికి 931 మిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతోందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది.  ఆహార వ్యర్థాలతో వార్షిక గ్లోబల్ గ్రీన్‌‌‌‌‌‌‌‌హౌస్ గ్యాస్ (కర్బన) ఉద్గారాలలో 8 శాతం నుంచి 10 శాతం ఉంటుందని అంచనా.  ప్రపంచ వార్షిక ఆర్థిక వ్యవస్థపై ఆహార వ్యర్థాలతో 85.75  లక్షల కోట్ల రూపాయల నష్టం కలుగుతోంది. ఆహార వృథా సమస్యను పరిష్కరించడం అత్యవసరం.  చైతన్యం, పర్యవేక్షణతోనే ఇది సాధ్యం.  ప్రత్యేక విధానాలు, అలాగే సాంకేతికతలు, మౌలిక సదుపాయాలు సక్రమంగా వినియోగించుకోవాలి.

వినియోగ విధానం మారాలి

గత శతాబ్ద కాలంగా పర్యావరణ క్షీణతతో  ఆర్థిక, సామాజిక పురోగతి ముడిపడి ఉంది. ఇది మన భవిష్యత్తు అభివృద్ధి, మనుగడపై ఆధారపడిన వ్యవస్థలకే ప్రమాదం కలిగిస్తోంది. ఆర్థిక కార్యకలాపాల కోసం పర్యావరణ ఒప్పందాలకు లోబడి అందుబాటులో ఉండే వనరులనే సామర్థ్యంతో వినియోగించుకోవాలి.  వినియోగదారులు చిన్నపాటి మార్పులతో మొత్తం సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపగల వినియోగానికి దారి చూపవచ్చు. వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడానికి లక్ష్యాలను నిర్దేశించాలి.  పునర్వినియోగ వస్తు విధానాలను ప్రోత్సహించాలి.   స్థిరమైన సేకరణ విధానాలకు మద్దతు ఇవ్వాలి. మరమ్మతు, పునర్వినియోగ సామర్థ్య ఉత్పత్తులను రూపొందించాలి.  వ్యర్థాలు,  వనరుల క్షీణతను తగ్గించడానికి ఉత్పత్తులను తిరిగి ఉపయోగించడం, పునరుద్ధరించడం, రీసైక్లింగ్ చేయడం వంటి పద్ధతులను ప్రోత్సహించాలి. 

ప్రజలు మరింత స్థిరమైన జీవనశైలిని అవలంబించినప్పుడే తక్కువ వినియోగం సాధ్యమవుతుంది.   పర్యావరణంపై తక్కువ ప్రతికూల ప్రభావాలను చూపే ఉత్పత్తులను ఎంచుకోవాలి.  రోజువారీ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే కార్బన్ ఉద్గారాల విడుదలను వీలైనంత మేరకు తగ్గించాలి.  స్థిరమైన వినియోగం, ఉత్పత్తి విధానాల కోసం కొత్త పరిష్కారాలను కనుగొనాలి. పర్యావరణ అనుకూల వస్తువుల ఉత్పత్తిని పెంచాలి. సామాజిక అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. ఉత్పత్తి మన్నిక ఎక్కువ కాలం ఉండాలి. ప్రజలూ తమ జీవనశైలిని మార్చుకోవడం ద్వారా భావితరాలకు ఆదర్శంగా జీవించాలి. ప్రజల శ్రేయస్సును మెరుగుపరచడానికి పర్యావరణ అనుకూల నూతన ఆవిష్కరణలు, నిర్మాణాలు చేపట్టాలి. పలు దేశాల్లో ప్రపంచ సంక్షోభాల కారణంగా శిలాజ ఇంధన సబ్సిడీలు ఇవ్వక తప్పడం లేదు.

స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలి

మానవ ఆరోగ్యం, పర్యావరణంపై రసాయనాల వినియోగం ప్రతికూల ప్రభావాలను చూపుతోంది. రసాయనాల కారణంగా గాలి, నీరు, మట్టి కలుషితమై ప్రజలతోపాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది. ఆ వస్తువులు, ఆహార వృథాను  నివారించేందుకు  వస్తువుల ఉత్పత్తి తగ్గింపునకు ప్రాధాన్యమివ్వాలి. పునర్వినియోగంతో వ్యర్థాల ఉత్పత్తిని గణనీయంగా తగ్గించుకోవాలి. జాతీయ విధానాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా స్థిరమైన ప్రజాసేకరణ పద్ధతులను ప్రోత్సహించాలి. ప్రకృతికి అనుగుణంగా స్థిరమైన అభివృద్ధి కొనసాగాలి. 

జీవనశైలి అలవరచుకోవడానికి ప్రజలకు  సంబంధిత సమాచారం, అవగాహన కల్పించాలి. మరింత స్థిరమైన వినియోగం, ఉత్పత్తికి శాస్త్రీయ, సాంకేతిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు మద్దతు ఇవ్వాలి. స్థానిక  ఉత్పత్తులను ప్రోత్సహించాలి. స్థిరమైన అభివృద్ధి ప్రభావాలను పర్యవేక్షించడానికి అవసరమైన ప్రణాళిలను రూపొందించి అమలుచేయాలి.  జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ,  పర్యావరణంపై తీవ్ర  ప్రభావాలను తగ్గిచేవిధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలి. శిలాజ-ఇంధన రాయితీలను, హానికరమైన సబ్సిడీలను దశలవారీగా హేతుబద్ధం చేయాలి. ప్రకృతి, పర్యావరణానికి అనుకూలంగా మానవ జీవనశైలి  మారినప్పుడే పెరుగుతున్న జనాభా ఎదుర్కోబోయే ఆహార సంక్షోభాన్ని నివారించగలం. 

వినియోగదారుల బాధ్యత

వస్తువుల వ్యర్థాలను తగ్గించడంలో వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కొనుగోలు చేసే వస్తువు గురించి వాస్తవికంగా ఆలోచించి స్థిరమైన, ఎక్కువ కాలం మన్నిక కలిగిన వస్తువులనే ఎంపిక చేసుకోవాలి.  ప్లాస్టిక్ వినియోగాన్ని సాధ్యమైన మేరకు తగ్గించాలి. పునర్వినియోగ సంచులను ఉపయోగించాలి. ప్లాస్టిక్ స్ట్రాలను తిరస్కరించాలి. ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేయాలి. పూర్తి వివరాలను సరిచూసుకున్న తర్వాతే వస్తువును కొనుగోలు చేయాలి. స్థానిక వనరుల నుండి ఉత్పత్తి అయ్యే వస్తువులను కొనుగోలు చేయాలి. ఉత్పతులపై వ్యాపార ఒత్తిడి తగ్గుతుంది. 

తక్కువ- ఆదాయ దేశాల స్థాయి కంటే 10 రెట్లు ఎక్కువగా అధిక -ఆదాయ దేశాలలో తలసరి వస్తు వినియోగం ఉంది.  2030 నాటికి తలసరి ఆహార వ్యర్థాలు, నష్టాలను సగానికి తగ్గించే ప్రయత్నాలలో ఐక్యరాజ్యసమితి పలు సూచనలు చేస్తోంది.  సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వేగవంతమైన ప్రణాళికలకు బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి తప్పనిసరిగా, సమగ్రంగా ఉండాలి. ఆహారాన్ని వృథా చేయకూడదు. స్థిరమైన అభ్యాసాల వైపు మళ్లడానికి, వనరుల వినియోగం నుంచి ఆర్థికవృద్ధికి మద్దతు ఇచ్చే విధానాలను అమలు చేయడం చాలా కీలకం.

డా. సునీల్ కుమార్ పోతన,
సీనియర్‌‌‌‌‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌