క్వింటిలియన్.. ఈ పదం ఎక్కడైనా విన్నారా? ఒకటి పక్కన 18 సున్నాలు ఉంటే దాన్ని క్వింటిలియన్ అంటారు. ఒకటి పక్కన అన్ని సున్నాలను లెక్కపెట్టడమే కష్టం. అట్లాంటిది ఒక సెకనులో అన్ని లెక్కలను పూర్తి చేస్తే? ఒక సెకనులో క్వింటిలియన్ ను కంప్యూట్చేయగలిగితే? సెకనుకు లక్ష సినిమాలను డౌన్లోడ్ చేస్తే? ఇదేలా సాధ్యమని అనుకుంటున్నారా? త్వరలో సాధ్యమే. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ను అమెరికా తయారు చేస్తోంది. కిందటేడాది ఫాస్టెస్ట్ కంప్యూటర్‘సమ్మిట్’ను డెవలప్ చేసిన అగ్ర దేశం.. రెండేళ్లలో కొత్త దాన్ని తీసుకురానుంది.
50 రెట్లు వేగంగా..
ఈ కంప్యూటర్‌కు ఫ్రంటీర్ అని యూఎస్ పేరు పెట్టింది. సూపర్ కంప్యూటర్ల తయారీ కంపెనీ ‘క్రే’తోపాటు అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ (ఏఎండీ)లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెరికా ఎనర్జీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ప్రాజెక్టు కోసం 600 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఉన్న సూపర్ కంప్యూటర్లతో పోలిస్తే 50 రెట్లు వేగంగా ఫ్రంటీర్ పని చేస్తుందని చెప్పింది. 2021 నాటికి సిద్ధమవుతుందని వెల్లడించింది. గతంలో ‘సమ్మిట్’ను తయారు చేసిన ఓక్ రిడ్జ్ నేషనల్ లేబరేటరీలోనే ఫ్రంటీర్ను సిద్ధం చేస్తున్నారు.
ఉపయోగాలివీ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ తోపాటు భవిష్యత్‌లో ఇంకా ఎన్నింటికో ఫ్రంటీర్ ఉపయోగపడుతుందని యూఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. 160 సూపర్ కంప్యూటర్లు కలిసి ప్రాసెస్ చేయగలిగినంత కంప్యూటింగ్ పవర్ ఫ్రంటీర్ సొంతం. ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులను అంచనా వేయడం, అతి క్లిష్టమైన మెడికల్ పరీక్షలు నిర్వహించడం, మేథమెటికల్ ప్రాబ్లమ్స్ ను పరిష్కరించడం దీనితో చేయొచ్చు. ఆస్టరాయిడ్స్ నుంచి భూమిని రక్షించడం, స్పేస్ లో మిస్టరీలైన బ్లాక్ హోల్స్ వంటి వాటిని సాల్వ్ చేయడంలో ఇది ఉపయోగపడనుంది. తన కెపాసిటీతో సగటున లక్ష సినిమాలను ఒక సెకెండ్లో డౌన్లోడ్ చేయగలదని అంచనా.
రేసులో చైనా కూడా..
ఫ్రంటీర్ సిద్ధమైతే.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కంప్యూటర్ గా నిలుస్తుంది. అయితే చైనా కూడా సూపర్‌కంప్యూటర్ కోసం గట్టిగా పని చేస్తోంది. సెకనుకు ఒక క్వింటిలియన్ లెక్కలు చేయగల సిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది. అది కూడా ఫ్రంటీర్ కన్నా ఏడాది ముందుగానే అందుబాటులోకి తీసుకురావాలని ఇప్పటికే ప్లాన్ చేసింది. అమెరికన్ టెక్నాలజీ వార్తా సంస్థ ‘ది వెర్జ్’ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్లు చైనాలో 227 వరకు ఉన్నాయి. అదే అమెరికాలో 109 మాత్రమే ఉన్నట్లు అంచనా.
అమెరికా, ఇంటెల్ కలిసి మరొకటి
ఒకవైపు ఫ్రంటీర్ పనులు సాగుతుండగానే, అమెరికా, ఇంటెల్ సంస్థ కలిసి మరో ప్రాజెక్టు కోసం పని చేస్తున్నాయి. ‘అరోరా’ పేరుతో మరో సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేస్తున్నాయి. దీని సామర్థ్యం కూడా సెకెనుకు క్వింటిలియన్ ను కంప్యూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాయి. దీన్ని కూడా 2021లోనే సిద్ధం చేయాలని భావిస్తున్నాయి. షికాగోలోని ఆర్గాన్ నేషనల్ లాబోరేటరీలో డెవలప్ చేస్తున్నారు. కిందటేడాది అమెరికా ఎనర్జీ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన ‘సమ్మిట్’ సూపర్ కంప్యూటర్ను ఫ్రాంటియర్, అరోరా రెండూ ఫాలో అప్ చేయనున్నాయి.