ఈ మధ్యకాలంలో మడతపెట్టే డిస్ప్లేలు రాబోతున్నట్టు బాగా ప్రచారం సాగింది. దాంతో వాటిని కొనేందుకు చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే మరో ఇంట్రెస్టింగ్ డిస్‌ప్లే తెరపైకి వచ్చింది. అదే సాగదీసే (స్ట్రెచబుల్) డిస్‌ప్లే.
దక్షిణ కొరియా కంపెనీ ఎల్జీ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రూలీ స్ట్రెచబుల్ డిస్‌ప్లే ప్రోటోటైప్‌ను పరిచయం చేసింది. దీన్ని50 శాతం వరకు సాగదీయొచ్చు. 12-అంగుళాలు ఉన్న ఈ ప్రోటోటైప్ స్క్రీన్18 అంగుళాలకు విస్తరిస్తుంది. అదే టైంలో అంగుళానికి100 పిక్సెల్స్ హై రిజల్యూషన్, ఆర్‌జీబీ రంగులను కూడా ఇస్తుంది. అయితే ఎల్జీ స్ట్రెచబుల్ డిస్‌ప్లేతో రావడం ఇదే మొదటిసారి కాదు.
కంపెనీ 2022లో కూడా ప్రవేశపెట్టింది. కానీ, దానికి 20 శాతం మాత్రమే సాగే గుణం ఉండేది. ఇక దీని స్పెషాలిటీస్ ఏంటంటే... ఇది చాలా సన్నగా, తేలికగా ఉంటుంది. దీన్ని10 వేల సార్లు లాగినా పాడవ్వదు. దీనికి 40 మైక్రో మీటర్ల మైక్రో ఎల్ఈడీ లైట్ సోర్స్ ఉంది. కాబట్టి ఎక్కువ టెంపరేచర్లతోపాటు ఇతర పరిస్థితుల్లోనూ ఇమేజ్ క్వాలిటీని కాపాడుతుంది. 2020లో ప్రారంభించిన ఈ డిస్ప్లేని నేషనల్ ప్రాజెక్ట్‌లో భాగంగా డెవలప్ చేశారు. దీన్ని వివిధ రంగాల్లో అనేక విధాలుగా వాడొచ్చు.