లీటర్ మంచినీళ్లు రూ.45 లక్షలు.. నిత్యం యవ్వనంగా ఉంటారు

నీరు మన శరీరానికి అత్యంత ముఖ్యమైనది. ఇది శరీర అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల ఖనిజాలను అందిస్తుంది. ప్రతి మనిషికి ఫిట్ గా ఉండాలంటే స్వచ్ఛమైన మినరల్ రిచ్ వాటర్ అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోని ధనవంతులందరూ ఖనిజాలు అధికంగా ఉండే స్వచ్ఛమైన నీటిని తాగుతూ ఉండడం చూస్తూనే ఉంటాం.  స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గురించి చెప్పాలంటే.. రూ.4000 ఖరీదు చేసే నీటిని విదేశాల నుంచి తెప్పించి తాగుతుంటాడు. విరాట్ కోహ్లి వెచ్చించే ఖర్చులో ఏడాదికి రూ.4-5 లక్షలు నీటికే ఖర్చు చేస్తాడని ప్రచారం. విరాట్‌ కోహ్లి ఎవియన్‌ నేచురల్‌ స్ప్రింగ్‌ బ్రాండ్‌ నీళ్లను తాగుతాడని పలు మీడియాల్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ నీటిని ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటారు. దీని ధర లీటరు రూ.4200గా చెబుతున్నారు.

విరాట్ తాగే వాటర్ బ్రాండ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీరు కాదు. ప్రపంచంలో నీటి బ్రాండ్లు చాలా ఉన్నాయి. ఇది అత్యంత ఖరీదైన బ్రాండ్‌లలో ఒకటి మాత్రమే. అత్యంత ధర పలికే  నీరు లీటరుకు రూ. 45 లక్షల వరకు పలుకుతోంది. ఈ బ్రాండ్ పేరు ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న ఈ నీరు... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బ్రాండ్‌గా చెప్పబడుతోంది.

నీరే బంగారం

మార్చి 4, 2010న యూఎస్ లో ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఇ మొడిగ్లియాని వాటర్ బాటిల్ కోసం జరిగిన వేలంలో 60,000 డాలర్ల కంటే ఎక్కువ ధరకు విక్రయించబడింది. అంటే ఇది రూపాయిలలో చెప్పాలంటే  దాదాపు రూ.49 లక్షలు. ఈ నీటి బొట్టులో బంగారం కరిగిపోతుందని మీడియాలో అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. నీటిలో బంగారాన్ని కరిగించడం వల్ల, అది మరింత ఆల్కలీన్ అవుతుంది. దీని కారణంగా దాని ధర పెరుగుతుంది. దీంతో పాటు స్వర్ణ భస్మం కలిపిన నీటిని తాగడం వల్ల సాధారణ నీటితో పోలిస్తే శరీరానికి ఎక్కువ శక్తి లభిస్తుందని కూడా ప్రచారం ఉంది. అంతే కాదు ఈ నీటిని తాగితే మరింత యవ్వనంగా కనిపిస్తారని చెబుతున్నారు.

ఎందుకు ఇంత ఖరీదు

ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఇ మోడిగ్లియాని బ్రాండ్ వాటర్ ను ఈ భూమిపై మూడు ప్రదేశాల నుండి సేకరిస్తారు. అవి ఫిజీ, ఫ్రాన్స్, ఐస్‌లాండ్‌లోని హిమానీనదాలు. ఇవి ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం కావడంతోఈ నీరు ఎంతో స్వచ్ఛమైనదగా భావిస్తారు. అందుకే దీని ధర లీటరు రూ.49 వేలుగా ఉందని అంటూ ఉంటారు. వాస్తవానికి ఈ నీటిని ఖరీదైనదిగా మార్చడానికి ముఖ్య కారణం దాని బాటిల్. ఈ నీటి కోసం ప్రత్యేకంగా 24 క్యారెట్ల బంగారంతో బాటిల్స్ సిద్ధం చేస్తారు. ఇది ప్రపంచ ప్రఖ్యాత బాటిల్ డిజైనర్ ఫెర్నాండో అల్టమిరానో నేతృత్వంలో ఉత్పత్తి చేయబడుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బాటిల్‌ను రూపొందించిన రికార్డు కూడా ఫెర్నాండో అల్టమిరానోకు దక్కింది.

ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఇ మొడిగ్లియాని తర్వాత ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన వాటర్ బ్రాండ్. ఇది జపాన్ నీరు. దీన్ని సముద్ర మట్టానికి వేల అడుగుల లోతు నుండి సేకరిస్తారు. కొన్ని ప్రత్యేకమైన మినరల్స్ ఈ నీటిలో ఉంటాయి. ఈ నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతుంది. అలాగే మీరు మరింత శక్తివంతంగా ఉంటారు, చర్మం కూడా నిగారిస్తుంది. ఈ నీటి 750 ఎంఎల్ బాటిల్ ధర 402 డాలర్లు అంటే దాదాపు 33 వేల రూపాయలు. లీటరు నీటి ధర దాదాపు రూ.44,000. ఇది లోతైన సముద్రంలో సహజంగా లభించే ఎలక్ట్రోలైట్‌లను కలిగి ఉంటుంది.