ఫైటర్ ప్లేన్లు, మిస్సైళ్లు తెగ కొంటున్నరు!

పందెం కోళ్లకు కత్తులు కట్టడానికి అన్ని దేశాలు పోటీ పడుతున్నా యి. ప్రపంచవ్యాప్తం గా ఆయుధాల వ్యాపారం జోరందుకుంది. ఒకళ్లను చూసి
మరొకళ్లు ఎడాపెడా ఆయుధాలను కొనేస్తున్నా రు. కిందటేడాది లెక్కలు తీస్తే వరల్డ్ వైడ్ గా ఆయుధాల అమ్మకాలు ఐదు శాతం పెరిగాయి.  ఆయుధాలు ఎక్కువగా అమ్ముతున్నది అమెరికా కంపెనీలే.

 

ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా  ఆయుధాల అమ్మకాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా ఆసియా ప్రాంతం ఈ అమ్మకాలకు పెద్ద మార్కెట్​గా మారింది. ఆసియాలోని అనేక దేశాల మధ్య గొడవలు పెరగడమే దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. తూర్పు చైనా సముద్రంపై చైనా, జపాన్ మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. అలాగే చైనా, మరికొన్ని ఆసియా దేశాలకు మధ్య దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి గొడవలు ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్ మధ్య చాలాకాలంగా మంచి సంబంధాలు లేవు. జమ్మూ కాశ్మీర్​కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తరువాత రెండు దేశాల మధ్య గొడవలు మరింత పెరిగాయి. పాకిస్తాన్ తన బడ్జెట్​లో సైనిక అవసరాలకే టాప్ ప్రయారిటీ ఇస్తోంది. అలాగే ఇండియా, చైనా మధ్య కూడా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన గొడవలున్నాయి. డోక్లాం, అరుణాచల్ ప్రదేశ్ అనేకసార్లు రెండు దేశాల మధ్య వివాదాలకు కారణాలయ్యాయి. అదేవిధంగా సిరియా, యెమెన్ దేశాల్లో గొడవల నేపథ్యంలో సౌదీ అరేబియా పెద్ద సంఖ్యలో ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అలాగే నౌకల ద్వారా ఇతర దేశాలతో వాణిజ్యం చేసే తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్,మలేసియా, బ్రూనై వంటి మరికొన్ని  దేశాలకు ఐలాండ్స్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇక్కడ ప్రతి రోజూ విమానాల ద్వారా సరిహద్దుల గస్తీ కాస్తుంటారు. తీరరక్షణ కోసం సబ్ మెరైన్లు, గస్తీ విమానాలను ఈ దేశాలు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటూ ఉంటాయి. ఇరుగుపొరుగు దేశాల మధ్య తగాదాలు పెరగడంతో ఏ దేశానికి ఆ దేశం తమ భద్రత కోసం ఆయుధాలను పోగేసుకోవడం మొదలెట్టాయి.

98 దేశాలకు అమెరికా ఆయుధాలు

ప్రపంచంలోని కనీసం 98 దేశాల్లో అమెరికా కంపెనీలు తయారు చేసిన ఆయుధాలు కనిపిస్తాయి. ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాలు మొత్తం 40 వరకు ఉన్నాయి. వీటిలో 20 దేశాలకు అమెరికానే ఎక్కువగా ఆయుధాలు సరఫరా చేస్తోంది.

యుద్ధ విమానాలకే గిరాకీ

ఆయుధాల అమ్మకాల్లో యుద్ధ విమానాలదే టాప్ ప్లేస్. 2027 కల్లా యుద్ధ విమానాల మార్కెట్ 16.6 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ‘ఫోర్ కాస్ట్ ఇంటర్నేషనల్’ సంస్థ అంచనా వేసింది. వచ్చే పదేళ్లలో ఏడాదికి సగటున దాదాపుగా 280 యుద్ధ విమానాలు తయారవుతాయని పేర్కొంది. యుద్ధ విమానాలతో పాటు మిస్సైళ్లు, సబ్ మెరైన్లు, సర్ఫేస్​ షిప్స్, యాంటీ సబ్ మెరైన్ వెపనరీ, యుద్ధ ట్యాంకులు, రాడార్లు ఎక్కువగా అమ్ముడవుతుంటాయని నిపుణులు చెప్పారు.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన

ఆయుధాల బిజినెస్ విపరీతంగా పెరగడం పట్ల ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. తమ దేశాల్లో తిరుగుబాట్లను అణచివేయడానికి ఆయా ప్రభుత్వాలు  దిగుమతి చేసుకుంటున్న ఆయుధాలు అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని ఆమ్నెస్టీ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. విచ్చలవిడిగా పెరుగుతున్న ఆయుధ వ్యాపారానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ‘క్యాంపెయిన్ అగైనస్ట్ ది ఆర్మ్స్  ట్రేడ్ (సీఏఏటీ)’ పేరుతో ఉద్యమం కూడా నడుస్తోంది. అయితే, ఆయుధాలను పేర్చుకోవడంలో  బిజీ అయిపోయిన దేశాలు ఈ ఉద్యమాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఆయుధాల బిజినెస్​కు అంతం లేదా?

90ల్లో  కోల్డ్ వార్ ముగిసిన తరువాత ఇక ఆయుధాల బిజినెస్ ఉండదని అందరూ అనుకున్నారు. కోల్డ్ వార్ తరువాత కొద్దికాలం మాత్రమే ప్రపంచ రాజకీయాల్లో మార్పు వచ్చింది. ఆ తరువాత మళ్లీ షరా మామూలే. దేశాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇందులో భాగంగా కొత్త ఈక్వేషన్స్ తెరమీదకు వచ్చాయి. దీంతో దేశాల మధ్య టెన్షన్లు పెరిగాయి. ఫలితంగా రకరకాల ఆయుధాలకు గిరాకీ పెరిగింది.

ఆయుధాల అమ్మకాల ఒప్పందం బేఖాతర్

విచ్చలవిడిగా జరుగుతున్న ఆయుధాల అమ్మకాలను ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ సంస్థ మొదటి నుంచి ఆపెయ్యాలని అంటూనే ఉంది. ఈ అమ్మకాలను కంట్రోల్ చేయకపోతే జరిగే నష్టాలను అన్ని దేశాలకు వివరిస్తూ  ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఈ బ్యాక్ డ్రాప్​లో యునైటెడ్ నేషన్స్ చొరవతో ‘ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ’ 2014 డిసెంబర్ 24న అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంపై 32 దేశాలు సంతకాలు చేశాయి. వందల మందిని చంపడానికి, యుద్ధ నేరాలకు పాల్పడడానికి అవకాశం ఉన్న దేశాలకు ఆయుధాల అమ్మకంపై ఒప్పందం నిషేధం విధించింది. అలాగే, ప్రపంచ శాంతిని దెబ్బతీసే అవకాశం ఉన్న దేశాలకు ఆయుధాలు అమ్మకూడదన్న కొన్ని కఠిన నియమాలు కూడా ఈ ఒప్పందంలో చేర్చారు. ఈ రూల్స్ అన్నీ కాగితాల మీదే ఉన్నాయి. డాలర్ల మోజులో పడ్డ  ఆయుధాల కంపెనీలు పట్టించుకునే పరిస్థితిలో లేవు.

గల్ఫ్ దేశాలకు పెరుగుతున్న అమ్మకాలు

గల్ఫ్ దేశాలకు కొన్నేళ్లుగా ఆయుధాల అమ్మకాలు బాగా పెరిగాయి. పదేళ్లలో ఈ సేల్స్ 87 శాతం పెరిగినట్లు లెక్కలు తేల్చి చెబుతున్నాయి. 2014 నుంచి 2018 వరకు అమెరికా ఎగుమతుల్లో ఈ దేశాల వాటా సగం ఉన్నట్లు తెలుస్తోంది.  అలాగే బ్రిటన్ ఎగుమతుల్లో కూడా సగం అక్కడికేనని లెక్కలు చెప్పాయి. ఎక్కువగా కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్​ను గల్ఫ్ దేశాలు దిగుమతి చేసుకున్నాయి. మిడిల్ ఈస్ట్​లో ఆయుధాలకు గిరాకీ రావడానికి సిరియా, యెమెన్ గొడవలు ప్రధాన కారణమంటున్నారు నిపుణులు.

రూ.29 లక్షల కోట్ల టర్నోవర్​

ఆయుధాలు తయారు చేసే వంద కంపెనీల టర్నోవర్​ కిందటేడాది 29 లక్షల కోట్ల రూపాయలు ఉంది. మొత్తం మార్కెట్‌లో అమెరికా కంపెనీల టర్నోవరే 59 శాతం ఉండగా, దానిలో లాక్ హీడ్ మార్టిన్ సంస్థ వాటా 11 శాతం.  కిందటేడాది ఈ సంస్థ 47.3 బిలియన్ డాలర్ల (రూపాయల్లో 3.34 లక్షల కోట్లు) బిజినెస్ చేసింది. 2009 నుంచి ఆయుధాల అమ్మకాల్లో ఇది నెంబర్ ఒన్​గా కొనసాగుతోంది. 2016లో కూడా సేల్స్​లో 11 శాతం పెంపు సాధించింది.  మొత్తంగా చూసినప్పుడు ఆయుధ కంపెనీలు 7.2 శాతం అభివృద్ధి సాధించాయి.

సెకండ్ ప్లేస్​లో రష్యా

ఆయుధాల అమ్మకాల్లో రష్యా సెకండ్ ప్లేస్ కొట్టేసింది. మొత్తం బిజినెస్​లో రష్యా కంపెనీల వాటా 8.6 శాతం. ఆ తరువాతి స్థానాల్లో యునైటెడ్ కింగ్​డమ్, ఫ్రాన్స్ ఆయుధాలు ఉన్నాయి. చైనాకు సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. ఈ విషయంలో చైనా చాలా సీక్రెసీ మెయింటైన్ చేసినట్లు మిగతా దేశాలు భావిస్తున్నాయి. అయితే ఎక్కువ టర్నోవర్ సాధించిన టాప్ హండ్రెడ్ కంపెనీల్లో చైనా సంస్థలు దాదాపు ఏడు వరకు ఉన్నట్లు ఒక అంచనా. వీటితోపాటు యూరప్​కు చెందిన మిస్సైళ్ల తయారీలో పేరొందిన ‘ఎంబీడీఏ’తో పాటు మరో యూరోపియన్ కంపెనీ ‘ఎయిర్ బస్’ కూడా 2018లో బాగా  బిజినెస్ చేసినట్లు ‘సిప్రి’ వర్గాలు తెలిపాయి.

ఎఫ్ –15 ఫైటర్లపై సౌదీ మోజు

సౌదీ అరేబియా 2014 నుంచి 2018 వరకు రూ. 27,028 కోట్లు ఆయుధాల కొనుగోలుపై ఖర్చు పెట్టింది. అమెరికా నుంచి ఎఫ్ –15 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్​లను విపరీతంగా కొన్నది. దీంతో పాటు థాడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్​ని, బ్లాక్ హాక్ హెలికాఫ్టర్లను కూడా ఎక్కువగా కొన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. బ్రిటన్ నుంచి యూరో ఫైటర్ టైఫూన్ మల్టీ రోల్ ఫైటర్స్​ను, కెనడా నుంచి పిరాన ఆర్మర్డ్ వెహికిల్స్, అవంతే 2200 కార్వెట్స్, ఉక్రెయిన్ నుంచి 132 ట్రాన్స్​పోర్టు ఎయిర్ క్రాఫ్టుల్ని కొన్నది.

 సీ–4000 వైపు ఆస్ట్రేలియా మొగ్గు

ఆస్ట్రేలియా ఎక్కువగా కొన్న ఆయుధాల్లో సీ– 4000, ఎయిర్ –6000 ఉన్నాయి. అలాగే ఎఫ్​ –35 కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్,  పీ –8ఏ యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ ను కూడా పెద్ద సంఖ్యలో ఆస్ట్రేలియా కొనుగోలు చేసింది. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల నుంచి  ఆస్ట్రేలియా ఎక్కువగా ఆయుధాలు కొన్నది. వీటితో పాటు మిస్సైల్స్ , ఆర్మర్డ్  వెహికిల్స్, హెలికాఫ్టర్లు, రాడార్ సిస్టమ్స్ ను కూడా ఆస్ట్రేలియా కొనుగోలు చేసింది. వీటి కోసం రూ. 11,137 కోట్లు ఆస్ట్రేలియా ఖర్చు పెట్టినట్లు ‘సిప్రి’ వర్గాలు చెప్పాయి.

 చైనా కొంటుంది, అమ్ముతుంది!

పాకిస్థాన్​, బంగ్లాదేశ్​ లాంటి చిన్న దేశాలకు ఆయుధాలు అమ్ముతున్న చైనాకూడా టాప్–10 కొనుగోలు దేశాల్లో ఉంది. ఈ లిస్టులో చైనాకి థర్డ్ ప్లేస్ దక్కింది. కిందటేడాది రష్యా నుంచి చైనా బాగా ఆయుధాల కొనుగోళ్లు చేసింది. మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్, కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, వార్ షిప్స్​కు అవసరమైన ఇంజన్లను చైనా కొన్నది. వీటితో పాటు జర్మనీ నుంచి ఎంటీయూ డీజిల్ ఇంజన్లు, ఉక్రెయిన్ నుంచి డీటీ –59 గ్యాస్ టర్బైన్ ఇంజన్లు చైనా కొనుగోలు చేసింది. మొత్తం రూ.11,066 కోట్లు ఈ ఆయుధాల కోసం ఖర్చు పెట్టింది.

 సగానికి తగ్గిన ఇండియా కొనుగోళ్లు

ఇండియా ఆయుధ కొనుగోళ్లు సగానికి (47 శాతం) తగ్గాయి. ఇప్పటికే ఇచ్చిన ఆర్డర్లు డెలివరీ అయ్యేవరకు కొత్తగా కొనకూడదని నిర్ణయించింది. దీంతో కొనుగోళ్లు తగ్గినట్లు స్టాక్​హోం ఇంటర్నేషనల్​ పీస్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​ (సిప్రి) వర్గాలు తెలిపాయి. ఇండియా ఎక్కువగా రష్యా నుంచి కొంటుంది. 2014–18 మధ్య కాలంలో ఇజ్రాయెల్, అమెరికా, ఫ్రాన్స్ దేశాల నుంచి కూడా కొనుగోలు చేసింది. ఎస్​యు–30 ఎంకె ఫైటర్ జెట్లు, టీ–90 ఎస్ ట్యాంకులు, ఎంఐ–8 ఎంటీ/ఎంఐ–17 హెలికాఫ్టర్లు,  మిలాన్ యాంటీ ట్యాంక్ మిస్సైళ్లు, ఎంటీయూ ఇంజన్లను ఇండియా ఎక్కువగా కొన్నది. వీటికోసం రూ.10,854 కోట్లు ఖర్చు పెట్టింది.

 ఈజిప్టుపై గల్స్​ గొడవల ప్రభావం

2018లో లెక్కలు తీస్తే ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా కొనుగోళ్లు చేసిన దేశం ఈజిప్టు. గల్ఫ్​ దేశాల్లో గొడవల కారణంగా ఈజిప్టు ఎక్కువ సంఖ్యలో ఆయుధాల్ని కొనాల్సి వస్తోంది. ఫ్రాన్స్, రష్యాలకు బాగా వెపన్స్​ ఆర్డర్​ చేస్తుంది. వాటిలో రాఫెల్ ఫైటర్​ జెట్లు, ఎంఐసీఏ మిస్సైల్స్, రాడార్ సిస్టం, పాంథేరా టీ6 ఆర్మర్డ్ వెహికిల్స్ ఉన్నాయి. వీటి కోసం రూ.10,499 కోట్లు ఖర్చు పెట్టింది.  అయితే, కిందటేడాది ఈజిప్టు కొనుగోళ్లు 38.2 శాతం తగ్గాయి.

 అల్జీరియాకి 66 శాతం రష్యా వెపన్స్​

ఆఫ్రికా దేశమైన అల్జీరియా కూడా ఆయుధాల్ని బాగానే పోగేసుకుంటోంది. 2018లో 37 శాతం కొనుగోళ్లు పెరిగాయి. 2014–18 వరకు లెక్కలు తీస్తే  రష్యా నుంచి ఎక్కువగా కొనేసింది. మొత్తం కొనుగోళ్లలో రష్యా వాటానే 66 శాతం. ఆ తర్వాత చైనా, జర్మనీలకు కూడా ఆర్డర్స్​ ఇస్తోంది. వీటికోసం రూ.9,364 కోట్లు ఖర్చు పెట్టింది అల్జీరియా.

 దక్షిణ కొరియా కొనుగోళ్లు

ఉత్తర కొరియా భయంవల్ల దక్షిణ కొరియా కూడా ఆయుధాలకు ప్రయారిటీ ఇస్తోంది. అమెరికా, జర్మనీ, బ్రిటన్ దేశాల నుంచి ఎక్కువగా కొంటుంది. ఎహెచ్–64ఈ, అపాచే హెలికాఫ్టర్లు, టైప్–214 సబ్ మెరైన్లు, ఎంటీయూ డీజిల్ ఇంజన్లు, ఎంటీ–30 గ్యాస్ టర్బైన్లతోపాటు కొన్ని రకాల మిస్సైళ్లను సౌత్ కొరియా ఎక్కువగా కొనుగోలు చేసింది. వీటి కోసం పెట్టిన ఖర్చు రూ. 9,293 కోట్లు.

 పెరిగిన యూఏఈ కొనుగోళ్లు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చుట్టూ సౌదీ, ఇరాన్​, ఒమన్​, యెమన్​ లాంటి దేశాలున్నాయి. ఈ దేశాల ప్రభావంతో యూఏఈ ఆయుధాలు కొంటోంది. ఎక్కువగా ఆమెరికాకే పర్చేజింగ్​ ఆర్డర్​ ఇస్తోంది. థాడ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం, హెల్ ఫైర్ మిస్సైల్స్, మాక్సో ప్రో ఆర్మర్డ్  పర్సనల్ క్యారియర్స్​ వంటి ఆయుధాల కోసం రూ.7,803 కోట్లు యూఏఈ ఖర్చు పెట్టింది.

 ఖతార్​కి పెద్ద సప్లయిర్​ అమెరికానే 

ఖతార్​దికూడా ఎమిరేట్స్​ పరిస్థితే. ఇదికూడా అమెరికా నుంచే ఎక్కువగా ఆయుధాలు కొంటోంది. వీటిలో 65 శాతం వాటా అమెరికాది కాగా, తరువాతి స్థానాల్లో జర్మనీ, ఫ్రాన్స్, చైనా, రష్యా ఉన్నాయి. మొత్తం రూ.5,789 కోట్లతో కొత్త ఆయుధాలను కొనుగోలు చేసింది ఖతార్.

పాకిస్థాన్ ప్రయారిటీ మిస్సైళ్లే

పాకిస్థాన్ కొనుగోలు చేసిన వాటిలో ఎయిర్ క్రాఫ్ట్​లు, మిస్సైళ్లు, ఆర్మర్డ్ మిసైళ్లు, నావల్ మిసైళ్లు ఎక్కువ. 2014–18 మధ్య కాలంలో అమెరికా నుంచి ఎక్కువగా కొన్నది. ఈమధ్య చైనా మీద ఆధారపడుతోంది. జెఎఫ్–17 థండర్ ఫై‌‌టర్ ఎయిర్ క్రాఫ్ట్, అల్ ఖాలిద్ ట్యాంకులు, అజ్మత్ క్లాస్ కార్వెట్లు, సీ–802 యాంటీ షిప్ మిస్సైళ్లు, మాక్స్ ప్రో ఆర్మర్డ్ వెహికిల్స్​ వంటివి పాకిస్తాన్ కొనేవాటిలో ఎక్కువ. ఆయుధాల కోసం 2018లో రూ.5,512 కోట్లు ఖర్చు పెట్టింది పాకిస్థాన్.

యెమెన్ కోసమే సౌదీ కొనుగోళ్లు

ప్రపంచవ్యాప్తంగా పదేళ్ల అమ్మకాలను పరిశీలిస్తే సౌదీ అరేబియానే పెద్ద సంఖ్యలో ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి పెద్ద సంఖ్యలో కొనుక్కుంది. వీటిలో ‘ఆర్మర్డ్ వెహికిల్స్’తో పాటు యుద్ధ ట్యాంకులు ఎక్కువగా ఉన్నాయి. హౌతీ తిరుగుబాటుదారుల నుంచి యెమెన్​ను ఆదుకోవడానికే సౌదీ పెద్ద ఎత్తున ఆయుధాలు కొనాల్సి వచ్చిందంటున్నారు ఎనలిస్టులు. ఆరేళ్ల క్రితం యెమెన్​లో యుద్ధానికి బీజాలు పడ్డాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హౌతీ రెబెల్స్ రెచ్చిపోయారు. యెమెన్ రాజధాని సనా సిటీని రెబెల్స్​ స్వాధీనం చేసుకోవడంతో 2015లో గొడవలు పతాక స్థాయికి చేరాయి. హౌతీ రెబెల్స్ షియాలు కావడంతో ఇరాన్ అండగా నిలిచింది. దీనికి కౌంటర్​గా సున్నీ దేశంగా పేరున్న సౌదీ అరేబియా అప్పటి యెమెన్ పాలకుడు హదీకి అండగా నిలిచింది. యెమెన్ కోసం సౌదీ అరేబియానే ఆయుధాలు కొని అందచేసింది. 2014 నుంచి 2018 వరకు వరల్డ్ వైడ్​గా పెద్ద సంఖ్యలో ఆయుధాలు కొన్న దేశంగా సౌదీ అరేబియా రికార్డు నెలకొల్పింది.