50 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

50 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తూనే ఉంది. ఇవాళ ఒక్క రోజులోనే 47 వేల కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య‌ 50 ల‌క్ష‌ల 30 వేలు దాటాయి. దాదాపు 3 ల‌క్ష‌ల 26 వేల మందిని ఈ మ‌హ‌మ్మారి బ‌లితీసుకుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1600 మంది మ‌ర‌ణించారు. క‌రోనా నుంచి కోలుకుని 19 ల‌క్ష‌ల 83 వేల మంది కోలుకోగా.. 27 ల‌క్ష‌ల మందికి పైగా చికిత్స పొందుతున్నారు.

ర‌ష్యాలో మూడు ల‌క్ష‌లు దాటిన కేసులు

చైనాలోని వుహాన్ సిటీలో తొలి క‌రోనా వైర‌స్ కేసును 2019 డిసెంబ‌రు చివ‌రిలో గుర్తించిన‌ట్లు ఆ దేశం చెబుతోంది. వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వేగంగా వ్యాపిస్తుండ‌డంతో ఆ దేశం అప్ర‌మ‌త్త‌మై వుహాన్ న‌గ‌రంలో లాక్ డౌన్ విధించింది. క‌ఠిన ఆంక్ష‌ల అమ‌లుతో దాదాపు నాలుగు నెలల్లో వైర‌స్ వ్యాప్తి పూర్తిగా కంట్రోల్ లోకి తెచ్చింది. అయితే ఇటీవ‌ల మ‌ళ్లీ కొత్త‌గా కేసులు పెరుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశంలో 82,965 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. 4,634 మంది మ‌ర‌ణించారు. ఈ మ‌హ‌మ్మారి చైనాలో పుట్టినా అతి తీవ్రంగా ప్ర‌భావితం అయింది మాత్రం అగ్ర‌రాజ్యం అమెరికానే. ఆ దేశంలో ఇప్ప‌టికే 15 ల‌క్ష‌ల 75 వేల పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఆ దేశంలో 93 వేల మంది మ‌ర‌ణించ‌గా.. 3 ల‌క్ష‌ల 61 వేల మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 11 ల‌క్ష‌ల మందికి పైగా చికిత్స పొందుతున్నారు.

ఇక ర‌ష్యాలో తొలుత వైరస్ వ్యాప్తి త‌క్కువ‌గా క‌నిపించినా.. ఆ త‌ర్వాత తీవ్రంగా వ్యాపించింది. ప్ర‌స్తుతం ర‌ష్యా క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో 3 ల‌క్ష‌ల మందికి పైగా క‌రోనా బారిన‌ప‌డ్డారు. అయితే మ‌ర‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉండ‌డం ఆ దేశ ప్ర‌జ‌ల‌కు ఊర‌ట‌నిస్తోంది. ర‌ష్యాలో ఇప్ప‌టి వ‌ర‌కు 2972 మంది మ‌ర‌ణించారు. స్పెయిన్ లో 2 ల‌క్ష‌ల 78 వేలు, బ్రెజిల్ లో 2.75 ల‌క్ష‌లు, యూకేలో 2.48 ల‌క్ష‌లు, ఇట‌లీలో 2.26 ల‌క్ష‌లు, ఫ్రాన్స్ లో 1.80 ల‌క్ష‌లు, జ‌ర్మ‌నీ 1.78 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ట‌ర్కీలో 1.5 ల‌క్ష‌లు, ఇరాన్ లో 1.26 ల‌క్ష‌లు, భార‌త్ లో 1.11 ల‌క్ష‌లు, పెరూలో 99 వేల మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు.