విశ్లేషణ: ఆర్థిక సంక్షోభంతో ధరల పిడుగు

విశ్లేషణ: ఆర్థిక సంక్షోభంతో ధరల పిడుగు

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరమైన ఆందోళన నెలకొంది. మొన్నటి వరకు కరోనా వైరస్ తో ఉత్పత్తి రంగం పడకేయగా.. కర్ఫ్యూలు, లాక్ డౌన్లతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. అన్ని రంగాలు కుదేలయ్యాయి. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై రష్యా– ఉక్రెయిన్​ యుద్ధం రూపంలో మరో పిడుగు దూసుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు బాగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఐఎమ్ఎఫ్, సిటీ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థలు, ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే ముడిచమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ‌‌‌‌‌‌‌‌చాలా దేశాలు ముడిచమురు కోసం రష్యా, ఇరాన్, ఇరాక్, లిబియా, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. యుద్ధాలు సంభవించినప్పుడు అన్ని దేశాలు తమ ఆర్థిక వనరులన్నిటినీ ముడిచమురు కొనుగోలుకు ఖర్చు చేయక తప్పని పరిస్థితి. దీంతో మిగిలిన అన్ని రంగాలు, వ్యవస్థలు ప్రభావితమై చివరికి ప్రజా జీవనమే ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. ఇందుకు శ్రీలంక ఆర్థిక సంక్షోభమే తాజా ఉదాహరణ. ఈ ముప్పు నుంచి బయటపడాలంటే దేశాలు సహా రాష్ట్రాలు స్వయం సమృద్ధి సాధించడంతోపాటు అప్పులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. 

ఉచితాలతో ప్రమాదం..

మనదేశంలో చాలా రాష్ట్రాలు వాటి ఆదాయాలకు మించి ‘ఉచిత పథకాలు’ అమలు చేస్తున్నాయి. ఎఫ్​ఆర్​బీఎం పరిధి దాటి మరీ పీకల్లోతు అప్పుల్లో మునిగి తేలుతున్నాయి. పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఉభయ తెలుగు రాష్ట్రాలది ఇదే పరిస్థితి. ఉత్పాదకత పెంచకుండా పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఉచిత పథకాలకు ఖర్చు చేయడం సరికాదు. 1991 నాటి ఆర్థిక సంక్షోభ పరిస్థితిలో ఎలాగైతే ఎఫ్​ఆర్​బీఎంను తీసుకొచ్చారో.. ఇప్పుడు కూడా అదే తరహా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం గ్లోబల్ ద్రవ్యోల్బణం 3.8 శాతంగా నమోదు అవుతోంది. అమెరికాలో 3.5 %, రష్యా 4.8%, చైనా1.8%, బ్రెజిల్ 5.3%, ఉక్రెయిన్ 7.1% తో ద్రవ్యోల్బణం కొనసాగుతుండగా, మనదేశంలో 4.8 శాతంగా నమోదు అవుతోంది. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతీ రోజూ చాపకింద నీరులా పెరుగుతూ పోతున్నాయి. వీటితో ముడిపడి ఉన్న సుమారు139 వస్తువులదీ అదే బాట.‌‌‌‌‌‌‌‌1978-–79 ప్రాంతంలో ఇరాన్–ఇరాక్ యుద్ధం సందర్భంగా పెరిగినట్లే ప్రస్తుతం రష్యా–- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ముడిచమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. 
ఉత్పత్తులపై ప్రభావం..
నిరుడు రష్యా –ఉక్రెయిన్ దేశాలు సంయుక్తంగా100 మిలియన్ల మెట్రిక్ టన్నుల స్టీల్​ఉత్పత్తి చేశాయి. అందులో 39 శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేశాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో స్టీల్ ధరలు కూడా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. వంట నూనెలకు రష్యా, ఉక్రెయిన్ లు అతిపెద్ద ఎగుమతి దేశాలుగా ఉన్నాయి. ఇండియా సన్​ఫ్లవర్​నూనెలు ఎక్కువగా ఈ రెండు దేశాల నుంచే దిగుమతి చే‌‌‌‌‌‌‌‌సుకుంటోంది. ప్రస్తుత యుద్ధ ప్రభావంతో వంట నూనెల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తిలో కూడా రష్యా ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడం సహా వార్​ క్రైసిస్​తో బొగ్గు సరఫరాపై ఎఫెక్ట్​పడింది. 

రాయితీలు తగ్గించాలె..

ప్రస్తుత సంక్షోభ సమయంలోనైనా ప్రభుత్వాలు బడా పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇవ్వడం మానాలి. సామాన్య ప్రజల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే కుటీర, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి ఆదాయ మార్గాలు పెంచాలి. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ.. దిగుమతులు తగ్గించి ‘‘ఆత్మ నిర్భర్ భారత్” స్ఫూర్తి కొనసాగించాలె. ఆర్థిక పరిపుష్టత, అధిక ధరలకు కళ్లెం వేయాలి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలి. ‌‌‌‌‌‌‌‌విద్య, వైద్య రంగాలు ప్రభుత్వ రంగంలో ఉంచాలి. ‌‌‌‌‌‌‌‌చైనా లాగా ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ‌‌‌‌‌‌‌‌పెంచిన పన్నుల ఆదాయాన్ని అనుత్పాదక రంగాల్లో కాకుండా, ఉత్పత్తి రంగాల బలోపేతానికి ఖర్చు చేయాలి.‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే భారత్ లో 25 వేల టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొనడం తగ్గించాలి. ప్రపంచంలోనే సుమారు 12 శాతం వ్యవసాయ భూమి మనదేశంలోనే ఉందనే విషయం మరువరాదు. ఆహార పదార్థాల ఉత్పత్తులకు ఢోకా లేదు. అయితే నల్లబజారుపై నిఘా ఉంచాలి.‌‌‌‌‌‌‌‌ కాలినడక, సైకిల్ తొక్కడాన్ని ప్రోత్సహించాలి. ఎలక్ట్రిక్​ వాహనాల వినియోగం పెంచాలి.

శ్రీలంక నుంచి వలసలు..

మన పొరుగు దేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. నాయకత్వ లోపం, అప్పులు, అవినీతి, కరోనా, ఎల్​టీటీఈ 2018, 2019 దాడులతో ఆ దేశం దివాళ దిశగా వెళ్తోంది. ముందుగా ఆహార సంక్షోభంగా ప్రారంభమై ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఒక్క చైనా దేశానికే 500 బిలియన్ల డాలర్ల అప్పు చెల్లించాల్సి ఉంది. అప్పులు తీర్చలేక ఇప్పటికే ఒక పోర్టును లీజుకు ఇచ్చేశారు. ప్రస్తుతం శ్రీలంక జనాభా 2.2 కోట్ల మంది ఆహార భద్రత గాలిలో దీపంలా మారింది. ధరలు విపరీతంగా పెరిగి పోయాయి.‌‌‌‌‌‌‌‌ కేజీ చికెన్ రూ.1000, ఒక కప్ టీ రూ.100,- కోడి గుడ్డు ధర రూ. 35, లీటర్ పెట్రోల్ ధర రూ.300కు పైగా ఉంది. అన్ని ధరలు పెరగడంతో నిత్యవసర వస్తువులు,30 శాతం పెరిగిన మందుల ధరలు ఆకాశాన్ని తాకి, శ్రీలంక ప్రజలు తట్టుకోలేక శరణార్థులుగా ప్రయాణం ప్రారంభిస్తున్నారు.‌‌‌‌‌‌‌‌ శ్రీలంక శరణార్థుల విషయంలో మన దేశం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

చమురు ధరల పెరుగుదల..
నిరుడు ముడిచమురు ధరలు కనిష్టంగా 47.62 డాలర్లు, గరిష్టంగా 84.65 డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం బ్యారెల్ ధర140 డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు వాటి ఆదాయాల్లో ఎక్కువ శాతం ముడిచమురు కొనుగోలుకే వెచ్చించే పరిస్థితి నెలకొంది. మనదేశంలో లీటర్ పెట్రోల్ పై 45.5 శాతం పన్ను, సెస్ రూపంలో వసూలు చేస్తున్నారు. ‌‌‌‌‌‌‌‌డీజిల్ పై 39 శాతం పైబడి పన్ను పోటు, ఇప్పటికే టోకు ధరల సూచీ13 శాతం దాటింది. నిరుద్యోగ రేటు 8 శాతంకు పైగా నమోదవుతోంది.‌‌‌‌‌‌‌‌ జీడీపీ వృద్ధి 8.9 శాతంగా ఉంటుందని తాజాగా సవరించారు. ‌‌‌‌‌‌‌‌మనదేశంలో వంటనూనెల ఉత్పత్తి -వినియోగం మధ్య వ్యత్యాసం 56 శాతంగా ఉంది.‌‌‌‌‌‌‌‌ దీంతో ప్రస్తుతం లీటరు మంచి నూనె ధర దాదాపు 50 రూపాయలు పెరిగింది. ప్రజల సంపాదనలో ఎక్కువ మొత్తం నిత్యవసర వస్తువులు, కూరగాయల కొనుగోలుకే సరిపోతోంది. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. 

ఆర్థిక మాంద్యం?

అమెరికా పరిస్థితి కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. అధిక నగదు ముద్రణ చేస్తోంది. డాలర్ విలువ తగ్గుతోంది. అయితే ఇదే సమయంలో యూరో విలువ పెరగడం గమనార్హం. అమెరికా కూడా చాలా అంశాల్లో ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే, ప్రపంచం ఆర్థిక మాంద్యం ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ‌‌‌‌‌‌‌‌ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి సమస్యల్లో చిక్కుకోవడం తథ్యం. అందుకే అన్ని దేశాలు వాటి దిగుమతులుపై ఆధారపడే స్థితి నుంచి బయటపడాలి. కనీసం వారి దేశాల్లో తయారయ్యే వస్తువులైనా ఉత్పత్తి చేయడానికి ఇకనైనా ‌‌‌‌‌‌‌‌శ్రీకారం చుట్టాలి. స్వయం సమృద్ధి సాధించడంతో పాటు, నిరుద్యోగానికి ముకుతాడు వేసేందుకు చర్యలు చేపట్టాలి.అప్పుడే ‌‌‌‌‌‌‌‌వలసల నియంత్రణ సాధ్యం అవుతుంది. 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- ఐ. ప్రసాదరావు
సోషల్ ​ఎనలిస్ట్