దారులన్నీకుంభమేళాకే...300 కి.మీ ట్రాఫిక్ జామ్

దారులన్నీకుంభమేళాకే...300 కి.మీ ట్రాఫిక్ జామ్

 

  • ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్
  • ప్రయాగ్​రాజ్​కు వెళ్లే దారులన్నీ వాహనాలతో రద్దీ
  • 50 కిలోమీటర్ల దూరానికే 10–-12 గంటల సమయం
  • త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన రాష్ట్రపతి ముర్ము 

లక్నో: యూపీలోని ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న మహాకుంభ మేళాకు దేశం నలు మూలలనుంచి జనం పోటెత్తుతున్నారు. పుణ్య స్నానాలకోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రయాగ్​రాజ్​కు వెళ్లే దారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఆదివారం నుంచి దాదాపు 300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్​ జామ్​ ఏర్పడడంతో  లక్షలాది మంది భక్తులు గంటలకొద్దీ ట్రాఫిక్​లోనే నిలిచిపోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఇదేనని అధికారులు చెబుతున్నారు. ఈ స్థాయిలో రోడ్లపై వాహనాలు ఎన్నడూ నిలిచిపోలేదన్నారు.  మధ్యప్రదేశ్‌‌లోని జబల్‌‌పూర్‌‌, సివనీ, కట్నీ, మైహర్‌‌, సాత్నా, రివా జిల్లాల్లో వాహనాలు ముందుకు కదలడం లేదు. వారణాసి నుంచి ప్రయాగ్​రాజ్​కు చేరుకునే మార్గంలో దాదాపు 25 కిలో మీటర్ల మేర ట్రాఫిక్​ నిలిచిపోవడంతో త్రివేణి సంగమ క్షేత్రానికి చేరుకునేందుకు 10-–12 గంటల సమయం పట్టింది.  

దాదాపు 200-–300  కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌‌ జామ్‌‌లు ఉన్నట్టు మధ్యప్రదేశ్​ పోలీసులు వెల్లడించారు. రేవా పరిధి చక్‌‌ఘాట్‌‌లోని కట్నీ నుంచి మధ్యప్రదేశ్- ఉత్తరప్రదేశ్ సరిహద్దు వరకు 250 కిలోమీటర్ల మేర వెహికల్స్​ నిలిచిపోయాయని వివరించారు. జబల్ పూర్ – ప్రయాగ్​ రాజ్ హైవేపై ప్రయాగ్​ రాజ్ కు 400 కి.మీ. దూరం వరకు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మహా కుంభమేళాకు వచ్చేవారు ట్రాఫిక్ పరిస్థితిని చూసి బయలుదేరాలని సూచించారు. 50 కిలో మీటర్ల  దూరానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతోందని చెబుతున్నారు. ప్రయాగ్‌‌రాజ్‌‌కు వెళ్తున్న వాహనాల రద్దీ దృష్ట్యా.. మధ్యప్రదేశ్‌‌లోని అనేక జిల్లాల్లో ట్రాఫిక్‌‌ను ఎక్కడికక్కడే నిలిపివేశారు. కాగా, వాహనాల రద్దీ దృష్ట్యా.. రాబోయే రెండు రోజులపాటు ప్రయాగ్‌‌రాజ్ వైపు వెళ్లొద్దని భక్తులకు మధ్యప్రదేశ్‌‌ సీఎం మోహన్ యాదవ్‌‌ సూచించారు. ట్రాఫిక్‌‌ పరిస్థితులను గూగుల్‌‌లో చూసుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు.

యోగి సర్కారు విఫలం: అఖిలేశ్​

మహా కుంభమేళా సందర్భంగా భారీ ట్రాఫిక్ ​సమస్య తలెత్తడంపై సమాజ్​వాదీ పార్టీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్​ స్పందించారు. కుంభమేళా నిర్వహణలో సర్కారు విఫలమైందని మండిపడ్డారు.  ట్రాఫిక్​ రద్దీ ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోలేదని ఫైర్​ అయ్యారు. ప్రయాగ్​రాజ్​లో కనీసం నిత్యావసరాలు కూడా దొరకడంలేదని ఆరోపించారు. ట్రాఫిక్​లో చిక్కుకొని ఆకలి, దాహంతో కొట్టుమిట్టాడుతున్న భక్తులను మానవతా దృక్పథంతో  ఆదుకోవాలని కోరారు. ట్రాఫిక్ జామ్​కు సంబంధించిన ఓ వీడియోను సీఎం యోగికి షేర్​ చేశారు. సీఎం, మంత్రులు, అధికారులెవరూ భక్తులను పట్టించుకోవట్లేదని ఆరోపించారు. మహాకుంభ మేళాలో చిక్కుకున్న లక్షలాది మంది భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సీఎంను డిమాండ్​ చేశారు. ట్రాఫిక్  జామ్‌‌లను నివారించేందుకు టోల్ ఫ్రీ ఉద్యమం చేపట్టాలని కోరారు. ఇదిలా ఉండగా.. భారీగా భక్తులు తరలిరావడంతో ప్రయాగ్​రాజ్​లోని సంగం రైల్వే స్టేషన్​ను మూసేశారు. ఈ నెల14 అర్ధరాత్రి వరకు స్టేషన్​ను 
మూసివేస్తున్నట్టు జిల్లా యంత్రాంగం వెల్లడించింది. 

రాష్ట్రపతి ముర్ము పుణ్యస్నానం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రయాగ్​రాజ్​ను సందర్శించారు.  ప్రత్యేక విమానంలో  లక్నో  చేరుకున్న ఆమెకు గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ప్రయాగ్ రాజ్ నుంచి బోటులో త్రివేణి సంగమానికి చేరుకొని, అక్కడ పుణ్య స్నానం చేశారు. మార్గమధ్యలో సైబీరియన్​కొంగలకు ఆహారం అందించారు. నదిలో కొబ్బరికాయ కొట్టి, సూర్య నమస్కారం చేశారు. అనంతరం బడే హనుమాన్ ఆలయం, అక్షయ వట్​ను సందర్శించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.