ఇలా అయితే బతికేదెలా: మొన్న బిర్యానీలో బొద్దింక.. ఇప్పుడు బీరు బాటిల్లో పురుగులు..

ఇలా అయితే బతికేదెలా: మొన్న బిర్యానీలో బొద్దింక.. ఇప్పుడు బీరు బాటిల్లో పురుగులు..

మనిషికి వందేళ్లు ఉన్న ఆయుష్షు కాస్తా క్రమక్రమంగా తగ్గిపోతోంది.. మారుతున్న లైఫ్ స్టైల్ ఇందుకు ఒక కారణం అయితే.. ఆహార కల్తీ మరో ప్రధాన కారణమని చెప్పాలి. అల్లం వెల్లుల్లి  పేస్ట్ దగ్గర మొదలుకొని స్నాక్స్ లోకి తీసుకునే మయోనిస్ వరకు ప్రతి దాంట్లో కల్తీ బాగోతమే.. ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న నాణ్యత లోపాలు, ఆహార కల్తీ వల్ల బయట ఫుడ్ తింటే చాలు మనిషి పోతాడేమో అన్న భయం కలిగిస్తోంది. ఇటీవల వరుసగా బిర్యానీలో బొద్దింకలు వచ్చిన ఘటనలతో ఆహార ప్రియులు బెంబేలెత్తిపోతోంటే.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన మద్యపాన ప్రియులను కూడా భయపెడుతోంది. చిల్డ్ బీర్ తాగి సేదతీరుదామని వెళ్లిన మందుబాబు బీర్ బాటిల్లో వచ్చిన పురుగులను చూసి ఖంగు తిన్నాడు.

 మద్యపాన ప్రియులకు షాకిస్తున్న ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని శివమ్ వైన్స్ లో  బీరు కొని ఓపెన్ చేసి నోట్లో పెట్టుకోగా దుర్వాసన వచ్చింది. బాటిల్లో ఏముందో అని చూడగా అందులో పురుగులు దర్శనమిచ్చాయి. కంగుతిన్న ఆ మద్యం ప్రియుడు వైన్స్ కి వెళ్లి ప్రశ్నించగా తమకెలాంటి సంబంధం లేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు మద్యం ప్రియుడు. 

బీరు రూ.150 పెట్టి కొన్న తనకు మరొకటి ఇవ్వమని అడగగా ఇచ్చేదిలేదని తేల్చిచెప్పారు వైన్స్ నిర్వాహకులు. నాణ్యత లేని కల్తీ మద్యం అమ్మకాల వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి చూడడం లేదని పలువురు మందుబాబులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత వైన్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మందు బాబులు.