కామేపల్లి హైస్కూల్​లో మధ్యాహ్న భోజనంలో పురుగులు

కామేపల్లి హైస్కూల్​లో మధ్యాహ్న భోజనంలో పురుగులు
  • విద్యార్థులతో కలిసి అదే అన్నం తిన్న ఖమ్మం డీపీవో
  • కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని వెల్లడి

కామేపల్లి,వెలుగు : ఖమ్మం జిల్లా కామేపల్లి జడ్పీ హైస్కూల్​లో మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించడం, అదే అన్నాన్ని డీపీవో, డీఎల్పీవో, ఇతర అధికారులు తినడం కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. కామేపల్లి మండలం టేకుల తండా గ్రామంలో ఈ నెల 15న పిసా గ్రామసభ నిర్వహించనున్నారు. ఈ సభకు కలెక్టర్  హాజరు కానుండడంతో బుధవారం డీపీవో ఆశాలత, డీఎల్పీవో రాంబాబు, అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పలు గ్రామాల్లో పర్యటించారు.

మధ్యాహ్నం సమయంలో కామేపల్లి హైస్కూల్ ను విజిట్​ చేశారు. అదే సమయంలో స్కూల్​ విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుండగా, వారితో కలిసి భోజనం చేశారు. అధికారుల భోజనం చేస్తుండగా, అన్నంలో పురుగులు కనిపించాయి. దీంతో వారు అవాక్కయ్యారు. విద్యార్థులతో మాట్లాడగా ప్రతిరోజు భోజనంలో పురుగులు వస్తున్నాయని, పురుగులను ఏరుకోని అన్నం తింటున్నామని చెప్పారు.

స్కూల్​ హెచ్ఎం, టీచర్లతో పాటు వంట వండే వారిపై డీపీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇళ్లలో కూడా ఇలాగే వంట చేసి మీరు తిని, మీ పిల్లలు పెడతారా? అని నిలదీశారు. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని డీపీవో హెచ్చరించారు. విద్యార్థులకు ఇక నుంచి నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు.