- జైపూర్ ఎస్టీపీసీ క్యాంటీన్‌లో కనిపించని క్వాలిటీ
- ఉత్తరాది ఉద్యోగికి క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఆఫీసర్లు
- ప్లాంట్‌లో ఆందోళనకు దిగిన కాంట్రాక్ట్ కార్మికులు
మంచిర్యాల/జైపూర్, వెలుగు : ఈగలు, పురుగులతో కూడిన బ్రేక్‌ఫాస్ట్, కుళ్లిన కూరగాయలతో లంచ్.. ఇదీ మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎస్టీపీసీ)క్యాంటీన్‌లో కనిపిస్తున్న ఫుడ్. ఇలాంటి ఫుడ్ తినలేక కార్మికులు కడుపులు మాడ్చుకుంటున్నారు. ఫుడ్ క్వాలిటీగా లేదని, క్యాంటీన్‌ను నీట్‌గా ఉంచడం లేదని ఆఫీసర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాంటీన్ కాంట్రాక్టర్, ఆఫీసర్ల తీరుతో విసిగిపోయిన కార్మికులు శనివారం ఆందోళనకు దిగారు.
ఉత్తరాది ఉద్యోగికి క్యాంటీన్ కాంట్రాక్ట్
ఎస్టీపీపీలో సుమారు 1,200 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి తక్కువ ధరకు ఫుడ్ అందించడం కోసం ప్లాంట్ ఆవరణలో 2021లో క్యాంటీన్ ఏర్పాటు చేశారు. అయితే రూల్స్‌కు విరుద్ధంగా క్యాంటిన్ నిర్వహణ బాధ్యతలను పవర్‌మెక్ కంపెనీలో పనిచేసే ఓ ఉత్తరాది ఎంప్లాయ్‌కి అప్పగించారు. ఇతడు ఓ వైపు ఐటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ లక్షల జీతం తీసుకుంటూనే మరో వైపు క్యాంటీన్ ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నాడు.
అయినా ఫుడ్‌లో కనీస క్వాలిటీ పాటించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు క్యాంటిన్ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిజానికి టెండర్లు పిలిచి తక్కువ రేట్ కోట్ చేసిన వారికి క్యాంటిన్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. కానీ సింగరేణి ఆఫీసర్లు అవేమీ పట్టించుకోకుండా ఉత్తరాది ఉద్యోగికి క్యాంటిన్ బాధ్యతలు అప్పగించడంపై కార్మికులు మండిపడుతున్నారు.
సబ్సిడీలు పొందుతూనే దోపిడీ
ఎస్టీపీపీలో పనిచేస్తున్న కార్మికులకు తక్కువ రేట్లకే క్వాలిటీ ఫుడ్ అందించాలన్న ఉద్దేశ్యంతో మేనేజ్‌మెంట్ క్యాంటిన్‌ను ఏర్పాటు చేసింది. దీని నిర్వహణకు ఓ బిల్డింగ్‌ను కేటాయించడంతో పాటు వాటర్, కరెంట్ ఫ్రీగా సప్లై చేస్తోంది. గ్యాస్, ఫర్నీచర్‌ను పవర్‌మెక్ కంపెనీయే సమకూర్చింది. హౌస్ కీపింగ్ కార్మికులనే క్యాంటీన్‌లో నియమించారు. ఇలా సింగరేణి నుంచి లక్షల్లో సబ్సిడీలు పొందుతున్నప్పటికీ ఫుడ్‌లో క్వాలిటీ పాటించడం లేదని, ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వాంటిన్‌లో నీట్‌నెస్ కనిపించకపోగా ఇటీవల ఓ కార్మికుడికి బజ్జీల్లో వెంట్రుకలు రాగా, మరో కార్మికుడికి ఈగలు కనిపించాయి. ఇలా నిత్యం ఫుడ్‌లో పురుగులు, ఈగలు కనిపిస్తున్నాయని, కుళ్లిన కూరగాయలతో వంటలు చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు.
భూనిర్వాసితులకు అప్పగించాలని డిమాండ్
ఎస్టీపీపీ కోసం భూములు ఇచ్చిన వారికి ప్లాంట్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని సింగరేణి ఆఫీసర్లు గతంలో హామీ ఇచ్చారు. కానీ ఉత్తరాది కార్మికులతో ప్లాంట్ మొత్తాన్ని నింపేశారు. ప్లాంట్‌లో సుమారు 1,200 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తుండగా ఇందులో నిర్వాసితులు, లోకల్ వర్కర్లు కేవలం 300 మందే. భూనిర్వాసితులు సొసైటీలుగా ఏర్పడి సివిల్‌వర్క్స్, క్యాంటీన్ మెయింటెనెన్స్, ఇతర పనులు అప్పగించాలని కోరుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.
నిర్వాసితులకు అప్పగించాలి
ఎస్టీపీపీ క్యాంటిన్ నిర్వహణను నిర్వాసితులకు అప్పగించాలి. ఉత్తరాది ఉద్యోగికి క్యాంటీన్ బాధ్యతలు అప్పగించడంతో అతడు కనీస ప్రమాణాలు పాటించడం లేదు. ఉన్నతాధికారుల సపోర్టుతోనే కాంట్రాక్ట్ వర్కర్లను చిన్నచూపు చూస్తున్నారు. ఓవైపు సింగరేణి నుంచి అన్ని రకాల సబ్సిడీలు పొందుతూ మరో వైపు కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం.
- గడ్డం రాకేశ్, ఐఎన్‌టీయూసీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఇన్‌చార్జి
కాంట్రాక్ట్ వర్కర్ల ఆందోళన
ఎస్టీపీసీలో కుళ్లిపోయిన ఆలుగడ్డలు కనిపించడంతో ఆగ్రహానికి గురైన కాంట్రాక్ట్ వర్కర్లు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఐఎన్‌టీయూసీ లీడర్లు కార్మికులకు మద్దతు తెలిపి ఆందోళనలోపాల్గొన్నారు. క్యాంటీన్‌లో వండిన పదార్థాలను తీసుకొని మేనేజ్‌మెంట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ లీడర్లు పేరం రమేశ్, నారాయణ, తిరుపతిరెడ్డి, ఎలక రమేశ్, తొగరి కృష్ణ, చిప్పకుర్తి లింగయ్య, లక్ష్మీనారాయణ, బండి శ్రీనివాస్, జానంపల్లి శ్రావణ్‌కుమార్, రాజిరెడ్డి, గడ్డం శివ పాల్గొన్నారు.