హనుమకొండ, వెలుగు: సీఎం కేసీఆర్ డల్లాస్ చేస్తానన్న వరంగల్ నగరంలో డ్రైనేజీ సిస్టం గతి తప్పింది. నగరంలో మురుగునీటి కాల్వలను కలిపే సమగ్రమైన వ్యవస్థ లేకపోవడం, ప్లాన్లు లేకుండా ఎక్కడికక్కడ రోడ్లు, డ్రైన్లు వేసుకుంటూ పోతుండటంతో వృథా నీరు వెళ్లే మార్గం లేకుండాపోయింది. దీంతో రోడ్ల మీదనే పారుతున్న మురుగునీరు, ఇండ్ల మధ్య ఏర్పడుతున్న మురుగునీటి కుంటలతో స్మార్ట్ సిటీ కాస్త.. స్లమ్సిటీగా దర్శనమిస్తోంది. సిటీ డ్రైనేజీ సిస్టంకు సంబంధించిన ప్రత్యేకంగా ఎలాంటి మ్యాప్ లేకపోవడం, వరద, మురుగునీటి ప్రవాహానికి ఒకే కాల్వలు దిక్కవుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంటోంది. అంతేగాకుండా ఏటా రూపొందించాల్సిన సిటీ శానిటేషన్ ప్లాన్‌ను పట్టించుకోకపోవడం కూడా సమస్యకు కారణమవుతోంది.
సగం కాలనీల్లో డ్రైన్లు సున్నా
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న గ్రేటర్ వరంగల్ నగరం 407 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా.. దాదాపు 2.25 లక్షల ఇండ్లు, సుమారు 11 లక్షల జనాభా ఉంది. సిటీలో మొత్తం 1,450 వరకు కాలనీలు ఉండగా.. ఇందులో సగం కాలనీల్లో మురుగునీటి సరఫరా వ్యవస్థ సరిగ్గా లేదనే విమర్శలన్నాయి. ఆఫీసర్ల లెక్కల ప్రకారం నగరంలో 53.3 కిలోమీటర్ల ప్రధాన నాలాలు, 1,433.02 కిలోమీటర్ల డ్రైన్లు, 151 కిలోమీటర్ల ఒక మీటర్ నాలాలు, 882.21 కిలోమీటర్ల మేర పక్కా డ్రైన్లు, 344.27 కిలోమీటర్ల మేర కచ్చా డ్రైన్లు ఉన్నాయి. ఇంతపెద్ద మొత్తంలో డ్రైనేజీ సిస్టం ఉందని ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ ఫీల్డ్లెవెల్లో వందల కాలనీల్లో డ్రైన్లు కనిపించకపోవడం గమనార్హం. దీంతో ఆఫీసర్ల లెక్కలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం డ్రైన్లు ఉన్న కాలనీల్లోనూ ప్లాన్ లేకుండానే నిర్మించారనే ఆరోపణలున్నాయి. రోడ్లు, డ్రైన్లను వేర్వేరుగా చూడకుండా ఒకేసారి వేయాల్సి ఉంటుంది. కానీ, లీడర్లు, ఆఫీసర్ల ప్లానింగ్లోపం కారణంగా కొన్ని చోట్ల రోడ్లు వేయకున్నా డ్రైన్లు నిర్మించి వదిలేశారు. దీంతో రోడ్ల కంటే డ్రైన్లు ఎత్తుగా మారి వృథా నీరు కాల్వలోకి వెళ్లకుండా రోడ్లపైనే నిలిచి ఉంటోంది.
వర్షం పడితే అంతే..
నగరంలో ఏండ్ల కింద నిర్మించిన డ్రైనేజీ సిస్టంనే ఇంకా ఉపయోగిస్తున్నారు. అప్పటి అవసరాల మేరకు రోడ్లు, డ్రైన్లు నిర్మించగా.. తర్వాత పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా లీడర్లు, ఆఫీసర్లు రోడ్లు, డ్రైన్లు వేసుకుంటూ వచ్చారు. కానీ, ఒక కాల్వను, మరో కాల్వను కలిపే ఇంటర్ కనెక్టివిటీని మాత్రం పట్టించుకోలేదు. దీంతో పాటు నగర ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కాల్వల లోతు కూడా లేవు. దీంతో వర్షాలు పడినప్పుడు మురుగునీటి సమస్య తీవ్రమవుతోంది. ఎన్నికలు ఉన్నాయనో.. ప్రజలు అసహనంతో ఉన్నారనో రోడ్లు, డ్రైన్లు వేసుకుంటూ వెళ్లిన పాలకులు.. కనెక్టివిటీని లైట్ తీసుకోవడంతో మురుగునీరు చివరి వరకు వెళ్లడం లేదు. దీంతో కాలనీల్లోని ఓపెన్ ప్లాట్లన్నీ మురుగునీటి కూపంగా మారుతున్నాయి. సిటీలో అధికారికంగా గుర్తించిన స్లమ్ ఏరియాలు 183 ఉండగా.. మురుగునీటి కుంటలు, పందులు, కుక్కలు, దోమల సంచారంతో వందల కాలనీలు స్లమ్ ఏరియాలుగానే కనిపిస్తున్నాయి. వర్షాలు పడినప్పుడు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు.
శానిటేషన్ ప్లాన్ ఊసే లేదు
నగరంలోని డ్రైన్లు, పూడికతీత, టాయిలెట్స్ తదితర అవసరాలకు సంబంధించి ప్రతి ఏడాది బల్దియా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సిటీ శానిటేషన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి టాయిలెట్స్ నిర్మాణం, డ్రైన్లు కట్టడం, డీసిల్టేషన్ పనులు చేయాలి. కానీ, సిటీలో చివరిసారిగా 2013లో శానిటేషన్ ప్లాన్ తయారు చేసిన అధికారులు.. తర్వాత దాని ఊసెత్తడం లేదు. దీంతో శానిటేషన్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఏటా రూ.2 కోట్లతో నాలాల్లో
డీసిల్టేషన్ చేపడుతున్నప్పటికీ ఫలితం లేదు.
డల్లాస్ చేస్తమన్నరు
సీఎం హోదాలో తొలిసారి వరంగల్ నగరానికి వచ్చిన కేసీఆర్ ఇక్కడి స్లమ్ ఏరియాలు, బస్తీల్లో కలియ తిరిగారు. ఇక్కడి పరిస్థితులను చూసి గుడిసెలన్నీ తీసేసి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. ఏటా రూ.300 కోట్లు కేటాయించి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయడంతో పాటు వరంగల్ నగరాన్ని డల్లాస్ చేస్తానని హామీ ఇచ్చారు. స్వయంగా సీఎం హామీ ఇచ్చి ఎనిమిదేండ్లు దాటినా ఇంతవరకు నగరంలో మురుగునీటి సమస్యే పరిష్కారం కాలేదు. నగరంలో ఉన్నది మొత్తం ఓపెన్ డ్రైన్ సిస్టమే కాగా.. ఇక్కడి సమస్యలకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమే పరిష్కారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్బ్యాంక్ కాలనీ సమీపంలోని సాయి శివాని కాలేజీ ప్రాంతం. గోపాలపూర్ కల్లుమండువ జంక్షన్ నుంచి భీమారం వెళ్లే మార్గంలోని ఈ ప్రాంతంలో సరైన విధంగా మురుగుకాల్వలు లేవు. దీంతో పైనుంచి వచ్చే మురుగునీళ్లు రోడ్డు మీద నుంచి ప్రవహించి, ఇక్కడి ఓపెన్ప్లాట్లలోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి నీళ్లు వెళ్లేందుకు కనెక్టివిటీ లేకపోవడంతో అక్కడే నిల్వ ఉండి చిన్నపాటి కుంట ఏర్పడింది. అదికాస్త పందులు, దోమలకు ఆవాసంగా మారింది. దీంతో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు.
సొంత ఖర్చుతో క్లీన్ చేయించుకుంటున్నం
మా ఏరియాలో డ్రైన్లు సరిగా లేక పైనుంచి వచ్చే మురుగు మా ఇండ్ల పక్కనే నిలిచి ఉంటోంది . ఇక్కడి నుంచి నీళ్లు బయటకు వెళ్లేందుకు మార్గం కూడా లేకుండా కాల్వలు కట్టి చేతులు దులుపు కున్నారు. దీంతో నీళ్లన్నీ ఇక్కడే నిలిచి కుంటలాగా మారుతోంది. లీడర్లు, ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుం టలేరు. చేసేదేమీ లేక సొంత ఖర్చుతో నీటిని తోడించు కుంటున్నాం. లీడర్లు, ఆఫీసర్లు చొరవ చూపి సమస్యకు పరిష్కారం చూపాలి.
-
మహమ్మద్అబ్దుల్అజీజ్, 55వ డివిజన్, భీమారం
సరైన ప్లాన్ లేక ఇబ్బందులు
నగరంలో మురుగునీటి సరఫరాకు సరైన ప్లాన్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిటీలో వెలువడే వేస్ట్ వాటర్ ను లెక్కగట్టి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి. కానీ, ఆ దిశగా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో కాలనీల్లో మురుగునీరు నిలుస్తోంది. కొన్నిచోట్ల కాల్వలు ఉన్నప్పటికీ ఆ నీటిని శుద్ధి చేసేందుకు ఏర్పాట్లు లేక అలాగే వెళ్లి చెరువుల్లో కలుస్తున్నాయి. ఫలితంగా నీటి కాలుష్యం ఏర్పడుతోంది. ఇలాగే ఉంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఇకనైనా గ్రేటర్ ఆఫీసర్లు సరైన ప్లాన్ రూపొందించి మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపాలి.
- పుల్లూరు సుధాకర్, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ప్రతినిధి