సదర్ల భీమన్నకు పూజలు

  •   దేవతామూర్తులకు గంగస్నానాలు
  •   అట్టహాసంగా గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర షురూ

కోల్​బెల్ట్, వెలుగు: గిరిజనుల ఆరాధ్య దైవం గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి మూడ్రోజుల జాతర శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సదర్ల భీమన్న దేవుడికి పూజలు, దేవతామూర్తులను గంగస్నానాలకు తరలించే కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారులోని రుష్యమూక పర్వతం వద్ద గల సదర్ల భీమన్న ఆలయంలో దేవాపూర్, ర్యాలీగఢ్​పూర్, ఊరుమందమర్రి తదితర ప్రాంతాలకు చెందిన నాయక్​పోడ్ ​వంశం కులపెద్దలు గిరిజన సంప్రదాయ పద్ధతిలో భీమన్న దేవుడికి పూజలు చేశారు.

అనంతరం నాయక్​పోడ్ ​గిరిజన కుటుంబాలు, భక్తులు, కులపెద్దలు సదర్ల భీమన్న గజాలు(దేవతమూర్తులు), గుర్రాలు, శూలలు, రాజులదేవుడిని పూజ గంపలో ఉంచి నెత్తిన పెట్టుకొని గిరిజన వాయిద్యాల మధ్య కాలినడకన శోభయాత్రగా మంచిర్యాలలోని గోదావరి నదికి తీసుకవెళ్లారు. బొక్కలగుట్టు, తిమ్మాపూర్‌‌‌‌, గద్దెరాగడి, మంచిర్యాల ప్రాంత భక్తులు, గ్రామస్తులు వీరికి ఘన స్వాగతం పలికారు.

గోదావరిలో దేవతామూర్తులకు పూజలు చేసి పుణ్యస్నానం చేయించారు. అనంతరం గోదారి ఒడ్డున పట్నాలు వేసి నైవేద్యం పెట్టారు. అనంతరం రాత్రి దేవతామూర్తులను తీసుకొని తిరిగి సదర్ల భీమన్న ఆలయానికి తీసుకొచ్చారు. రెండో రోజైన శనివారం సాయంత్రం సదర్ల భీమన్న ఆలయం నుంచి దేవతమూర్తులను జాతర జరిగే గాంధారి ఖిల్లా దిగువ ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.