నిధులివ్వట్లే.. ఎమర్జెన్సీ పనులు సైతం చేయట్లే

నిధులివ్వట్లే.. ఎమర్జెన్సీ పనులు సైతం చేయట్లే
  • నిధుల కోసం కార్పొరేషన్ల ప్రతిపాదనలు
  • పట్టించుకోని జీహెచ్ఎంసీ

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్ పరిధిలోని డివిజన్లలో సమస్యలు పెరుగుతున్నాయి. బల్దియా నుంచి అభివృద్ది నిధులు రాకపోవడంతో  పనులు జరగడం లేదు.  బస్తీలు మరీ అధ్వానంగా మారుతున్నాయి.   చిన్నపాటి వానలకే బస్తీలు గలీజ్​అవుతున్నాయి. వీధుల్లో ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది.  పట్టించుకోవాల్సిన అధికారులు, కార్పొరేటర్లు.. ఫిర్యాదులు అందించినా తొందరగా స్పందించడం లేదు. అయితే ప్రధాన ప్రాంతాలపైనే జీహెచ్ఎంసీ ఫోకస్ పెడుతోంది. కౌన్సిల్​ ఏర్పడి ఏడాదైన కూడా  వార్డు కమిటీ సభ్యులను ఎన్నుకోవడం లేదు. ఒక్కో వార్డుకి 150 మంది సభ్యులను ఎన్నుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ  నాయకులు దీన్ని పట్టించుకోవడం లేదు.  దీంతో డివిజన్లలో ఉన్న సమస్యలను జనం కార్పొరేటర్ల దృష్టికి తీసుకొస్తున్నారు.  

బస్తీలను పట్టించుకోవట్లే.. 

జీహెచ్‌ఎంసీ ప‌రిధిలో సుమారు 1500 స్లమ్ ఏరియాలు ఉన్నాయి.  మరో 1500 వ‌ర‌కు గుర్తింపు లేని స్లమ్స్ ఉన్నాయి. వీటిల్లో 4 ల‌క్షల కుటుంబాలు,  సుమారు 20 ల‌క్షల జ‌నాభా ఉంది. సరైన సౌకర్యాలు లేక  స్థానిక జనం సతమతమవుతున్నారు. వానలు వచ్చినా, నాలాలు పొంగినా మురికి నీరు అంతా ఇంట్లోకి చేరే పరిస్థితులున్నాయి. సిటీలోని బీజేఆర్ నగర్ బస్తీ, అంబేద్కర్ నగర్ బస్తీ, హకీంపేట కుంట బస్తీ, ఎంజీ నగర్ బస్తీ, ఫిలింనగర్​ వడ్డెర బస్తీ, గౌలిదొడ్డి బస్తీ , మాదాపూర్ వడ్డెర బస్తీ , తీగల కుంట, ముసారంబాగ్ వడ్డెర బస్తీ వంటి  ఏరియాలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయి.  వీటితో పాటు  చాలా ప్రాంతాల్లో  పనులు చేయాలని జనం కార్పొరేటర్లపై ఒత్తిడి తెస్తున్నారు.

సమస్యలను జీహెచ్ఎంసీ దృష్టి తీసుకెళుతున్న కూడా పనులు చేయడంలేదని కార్పొరేటర్లు జనానికి సమాధానం ఇస్తున్నారు. కొన్ని బస్తీల్లో టైమ్​కు నీళ్లు వస్తలేవు.  కొన్ని చోట్ల సిమెంట్ స్తంభాలకు బదులు ఇనుప కరెంట్ పోల్స్ ఏర్పాటు చేశారు.   వీటి పక్కనే 
డ్రైనేజీలు పారుతుండటంతో పాటు  పోల్స్ పై నుంచి ఇండ్లలోకి వాటర్ పైపులు వేశారు. దీంతో వర్షాకాలంలో  వాటివల్ల ప్రమాదముందని బస్తీవాసులు ఆందోళన చెందుతున్నారు. బస్తీల పొడవునా  స్ట్రీట్ లైట్స్‌ ఉన్నా అవి ఎప్పుడు వెలుగుతాయో,  ఎప్పుడు ఆగిపోతాయో  తెలియని పరిస్థతి.  కొన్ని చోట్ల వట్టి పోల్స్ వేసి వదిలేశారు. మరికొన్ని చోట్ల 24గంటలు స్ట్రీట్ లైట్స్ వెలుగుతూనే ఉంటున్నాయి.

ఫండ్స్​ వస్తలే..

డివిజన్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ నుంచి నయా పైసా అందడం లేదని కొందరు కార్పొరేటర్లు చెప్తున్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కో కార్పొరేటర్ కోటి, రెండు కోట్లకు పైగా కూడా పనులు చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం బల్దియా ఖాజాన ఖాళీ కావడంతో  తమకు ఏ మాత్రం ఫండ్స్ రావట్లేదని కొందరు కార్పొరేటర్లు అంటున్నారు. అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యేలను పట్టుకొని వారి ఫండ్స్ నుంచి కొన్ని పనులను చేసుకుంటున్నట్లు సమాచారం. ఫండ్స్ విషయంలో తమకు ఇబ్బందులు తప్పడం లేదని ఇతర పార్టీల కార్పొరేటర్లు చెప్తున్నారు.

పనులు చేయాలె..

డివిజన్లలో ఉన్న సమస్యలు ముందుగా కార్పొరేటర్ దృష్టికే  వస్తాయి. కార్పొరేటర్లు పంపిన ప్రపోజల్స్​ను పరిశీలించి అన్ని పనులు చేయాలె. లేకపోతే కాలనీలు, బస్తీల్లో సమస్యలు అలాగే ఉంటాయి. వీటిపై కౌన్సిల్ మీటింగ్​లో అడిగినా బల్దియా నుంచి  సమాధానం రావట్లేదు. పనుల కోసమే  ఫండ్స్ అడుగుతున్నాం. - ఆకుల శ్రీవాణి, సరూర్ నగర్ కార్పొరేటర్
నాలాకు ఫెన్సింగ్ లేక.. 
నాలాకు  ఫెన్సింగ్ లేకపోవడంతో  పెద్ద సమస్యగా  తయారైంది.  రాత్రివేళల్లో చిన్నారులు అందులో పడి గాయపడు తున్నారు.  వర్షాకాలం వస్తోందంటే ఎక్కడ నాలా పొంగి నీళ్లు ఇండ్లలోకి వచ్చెస్తాయేమోనని  భయంగా ఉంటోంది. - నిరీషా , పీజేఆర్ నగర్ బస్తీ
ఇంటి ముందే మురుగునీరు
డ్రైనేజీ నీరు ఇంటిముందే పారుతోంది. లీడర్లకు కంప్లయింట్ చేసినా  పట్టించుకోవట్లే. ఏ సమస్య ఉన్నా కార్పొరేటర్​కు చెప్పుకోవాల్సిందే. వాళ్లు చెప్తేనే  అధికారులు వచ్చి పరిష్కరిస్తారు. బస్తీలో స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు.  - అజిత్ , అంబేద్కర్ నగర్ బస్తీ