- కాలనీ రోడ్ల దాకా ఇదే పరిస్థితి
- మరమ్మతులను పట్టించుకోని జీహెచ్ఎంసీ
- వాహనాదారులకు తప్పని ఇబ్బందులు
- వానాకాలంలో నిషేధం ఉన్నా.. రోడ్ల తవ్వకం
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ సిటీ రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు పడే ఉన్నాయి. కాంప్రెన్సివ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్రోగ్రాం (సీఆర్ఎంపీ) కింద ఏజెన్సీల నిర్వహణలోని 709 కి.మీ మెయిన్ రోడ్లు తప్ప.. మిగతా రోడ్లన్నీ కరాబ్అయ్యాయి. వానాకాలం కావడంతో పడిన వర్షాలకు నీళ్లు నిలిచిపోతున్నాయి. రోడ్లపై వేలల్లో పాట్‌హోల్స్ ఉండడం, మరమ్మతులు లేక రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. కొత్తగా వేసిన చోట కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రకారం బీటీ రోడ్డు వేస్తే ఆరేళ్ల వరకు, సీసీ రోడ్డు 10 ఏళ్లు డ్యామేజ్ కాకుండా ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు వేసిన రోడ్లు నెలల వ్యవధిలోనే గుంతలు పడుతున్నాయి. బల్దియా అధికారులు, కాంట్రాక్టర్లు అవినీతి కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి.
క్వాలిటీ కంట్రోల్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో కూడా సమస్య వస్తోంది. గ్రేటర్లో రోడ్లు కరాబ్అయిన వెంటనే వేస్తున్నామని బల్దియా గొప్పలు చెబుతున్నా గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కి.మీ రోడ్లు ఉన్నాయి. ఇందులో 6,167 కి.మీ (68.42 శాతం ) సీసీ రోడ్లు, 2,846 కి.మీ (31.58 శాతం) బీటీ రోడ్లు ఉన్నాయి. ఆయా రోడ్లపై 70 శాతం గుంతలు ఏర్పడ్డాయి. మరో వైపు వానాకాలంలో తవ్వకాలు బంద్ పెట్టినా ఏదో పనుల కారణంగా రోడ్లను తవ్వుతున్నారు.
అంతటా ఇదే దుస్థితి..
మెయిన్ రోడ్ల నుంచి అంతర్గత రోడ్ల వరకు గుంతలు పడ్డాయి. ఒక్కో చోట ఫీట్‌కు పైగా లోతుగా మారాయి. దీంతో వాహనాలు స్లోగా వెళ్తుండగా.. ట్రాఫిక్ జామ్‌తో పాటు ప్రయాణం కూడా ఆలస్యమవుతుంది. స్పీడ్‌గా వెళ్తుంటే గుంతల్లో పడిపోతుండగా వాహనదారులు ఆస్పత్రుల పాలవుతున్నారు. టోలిచౌకి, సికింద్రాబాద్, చార్మినార్, తార్నాక, మల్కాజిగిరి, చందానగర్, కోఠి, దిల్ సుఖ్ నగర్, బహదూర్ పురా, అత్తాపూర్, పటాన్ చెరువు, మియాపూర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు ఏర్పడ్డా యి. బల్దియాకు రోడ్ల పైనే ఎక్కువగా కంప్లయింట్స్వస్తున్నాయి. అయినా మరమ్మతులపై దృష్టి పెట్టడం లేదు.
ఇదేనా డల్లాస్, ఇస్తాంబుల్..
డల్లాస్, ఇస్తాంబుల్ తరహాలో సిటీని డెవలప్ చేస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అప్పట్లో హామీ ఇచ్చినా.. సిటీలో రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ఫండ్స్ఇవ్వకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు. సిటీలో పనులు చేసే కాంట్రాక్టర్లు లేకపోవడంతోనే రోడ్లు దారుణంగా తయారయ్యాయి. రెగ్యులర్ గా బిల్లులు చెల్లించకపోతుండగా కాంట్రాక్టర్లు రోడ్లు వేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
మంజూరైనా పనులు చేయట్లే..
ప్రతి ఏటా కొత్త రోడ్ల పనులకు నిధులు మంజూరవుతున్నా చేయడంలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా ఉంటుంది. గత ఆర్థిక ఏడాదిలో రూ.1274 కోట్లతో 4,790 రోడ్ల పనులు చేపట్టారు. అందులో రూ.697 కోట్లతో 2,480 పనులు మాత్రమే పూర్తి చేశారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలోనైతే రూ.567 కోట్లతో 2,162 పనులు మంజూరు చేయగా ఇప్పటి వరకు రూ.10 కోట్ల నిధులకు సంబంధించి 22 పనులు పూర్తయ్యాయి. ఇలా నిధులు మంజూరు చేసిన పనులే చేయడం లేదు.
సోషల్ మీడియాలో వైరల్..
ఎన్నికలప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఇచ్చిన హామీల ఆడియోతో పాడైన రోడ్ల వీడియోలు మిక్స్ చేసి సోషల్‌మీడియాలో జనం వైరల్ చేస్తున్నారు. డల్లాస్, ఇస్తాంబుల్తరహాలో ఇక్కడ రోడ్లు వేస్తామని చెప్పిన మాటలు ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్నాయి.