
హాస్టల్ గదిలో పుస్తకాలతో కుస్తీపట్టి రాత్రి అలసిసొలసి నిద్రించిన ఆ విద్యార్థినుల్లో ఓ ఇద్దరు అర్ధరాత్రి దాటాక ఉలిక్కిపడి లేచారు. కాళ్లు, పాదాలకు గాయాలై.. నెత్తురు కారుతుండటాన్ని చూసుకొని భయాందోళనలకు గురయ్యారు. మెదక్ జిల్లా రామాయంపేటలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఎలుకల స్వైర విహారంచేస్తున్నాయి. 9 వతరగతికి చెందిన 12 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. చికిత్స కోసం బాధిత విద్యార్థులు ఆస్పత్రికి వెళ్లారు. కాగా ఘటన జరిగిన గదిలో పారిశుధ్యం లోపించిందని.. పనికిరాని వస్తువులన్నీ నిల్వ ఉంచారని ఫలితంగా ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని విద్యార్థినులు చెప్పారు. ఎలుకలతో తాము ఇబ్బందిపడుతున్నామంటూ ఎన్నోసార్లు హాస్టల్స్ కేర్‌టేకర్లు, ఇతర సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి చేరుకున్న విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన చేశారు.