వావ్ శాంటాక్లాజ్.. క్రిస్మస్ వేడుకలు ఒక్కో చోట ఒక్కో వింత.. మీరూ తెలుసుకోండి

వావ్ శాంటాక్లాజ్.. క్రిస్మస్ వేడుకలు ఒక్కో చోట ఒక్కో వింత.. మీరూ తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రధాన పండుగల్లో క్రిస్మస్ ఒకటి. డిసెంబర్ మొత్తం జరిగే క్రిస్మస్ సంబరాలకు ఒక్కో చోట ఒక్కో ప్రత్యేకత. అయితే, వేడుకలు జరుపుకునేందుకు నియమాలు లేకపోవడమే ఈ పండుగ స్పెషాలిటీ. దాదాపు అన్ని దేశాల్లో క్రిస్మస్‌కు పదిహేను రోజుల ముందు నుంచే -వేడుకలు మొదలవుతాయి. కొన్ని దేశాల్లో మాత్రం పండుగ తర్వాత కూడా వేడుకలు జరుగుతాయి.

క్రిస్మస్‌ను నిర్వహించుకునే దేశాల్లో స్వీడన్ ఒకటి. స్వీడన్ లోని గెవిల్స్ స్క్వేర్ నగర వీధులన్నీ పండుగకు నెల రోజుల ముందు నుంచే విద్యుత్ దీపాలతో కళకళలాడుతుంటాయి. ఇక్కడ ప్రతి ఇంట్లో క్రిస్మస్ ట్రీని తప్పనిసరిగా ఉంచుతారు. గెవిల్స్ స్క్వేర్లో క్రిస్మస్ రోజున వేడుకలు అట్టహాసంగా మొదలవుతాయి.

అందులో భాగంగా ఏడాది కుప్పలు నూర్చిన తర్వాత వచ్చే గడ్డితో పెద్ద గొర్రె బొమ్మను తయారుచేస్తారు. అత్యంత భారీగా గొర్రె బొమ్మను తయారు చేయడంపై పోటీలు కూడా పెడతారు. అంతేకాదు తయారు చేసిన ఈ బొమ్మను తగులబెట్టడం కూడా ఇక్కడొక వేడుకే. ఇప్పటివరకు 31 సార్లు గడ్డిబొమ్మలను తగులబెట్టారట. ఈ వేడుకల్ని చూసేందుకు. వివిధ దేశాల నుంచి సందర్శకులు గెవిల్స్ స్క్వేర్‌‌కు వస్తుంటారు. 

లాంతర్ల పండుగ

 ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌ను ఎక్కువమంది జరుపుకుంటున్న దేశంగా రికార్డుకెక్కింది ఫిలిప్పైన్స్. ఇక్కడి జాన్ ఫెర్నాండోలో ఈ పండుగ చాలా వినూత్నంగా జరుగుతుంది. పండుగకు ముందురోజు ఇక్కడ అతిపెద్ద లాంతర్ల పండుగ నిర్వహిస్తారు. శాన్ ఫెర్నాండోలో ఉన్న పదకొండు గ్రామాలూ ఈ వేడుకల్లో భాగమవుతాయి. ఈ పదకొండు గ్రామాలని 'బ్యాదెంగేస్' అని పిలుస్తారు. లాంతర్ల పండుగలో భాగంగా అతి పెద్ద లాంతర్లని తయారు చేసే పోటీ కూడా ఉంటుంది. లాంతర్లను జపాన్ ఒరిగామి కళను ఉపయోగించి కేవలం కాగితంతో తయారు చేస్తారు. వేడుకల ప్రాంగణమంతా దీపాలతో అలంకరించి వాటిని సాయంత్రాల్లో కొవ్వొత్తులతో వెలిగిస్తారు. 

పిల్లల సంబరాలు 

 ఐస్‌ల్యాండ్‌లో జరిగే క్రిస్మస్ వేడుకలు పిల్లలకి చాలా స్పెషల్. క్రిస్మస్‌కు మూడు వారాల ముందు నుంచే వేడుకలు ప్రారంభమవుతాయి. కేవలం పిల్లల కోసమే ప్రత్యేకమైన వేడుకలు నిర్వహిస్తారు. అది కూడా రాత్రి వేళ మాత్రమే జరుగుతాయి. వేడుకలో భాగంగా మంచు తెరల మధ్య నుంచి రకరకాల వస్త్రధారణతో కొందరు వ్యక్తులు పైకొస్తుంటారు. ఇదంతా పిల్లలకు సర్‌‌ప్రైజ్‌లా ఉంటుంది. వారిని 'యులే ల్యాడ్' అని పిలుస్తారు. ఇలా మంచు నుంచి బైటకొచ్చిన తర్వాత వారి చేష్టలతో పిల్లల్ని నవ్విస్తూ.. కానుకలు కూడా ఇస్తుంటారు. 

లిటిల్ క్యాండిల్స్ డే

క్రిస్మస్ రోజు క్యాండిల్స్ వెలిగించే సంప్రదాయం గురించి అందరికీ తెలిసిందే. అయితే కొలంబియాలో మాత్రం ఇది ప్రత్యేకమైన వేడుక. క్రిస్మస్‌లో భాగంగా అక్కడి వాళ్లు ఒక రోజును 'లిటిల్ క్యాండిల్స్ డే'గా జరుపు కుంటారు. తొలినాళ్లలో ఇళ్ల ముంగిట, బాల్కనీల్లో వివిధ అకృతుల్లో ఉండే క్యాండిల్స్ వెలిగించడం సాంప్రదాయం. ఆ తర్వాత ఈ వేడుకను వీధుల్లో అందరూ కలిసి జరుపుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం నగర వాసులంతా కలిసి ఈ పండుగ చేసుకుంటున్నారు. లిటిల్ క్యాండిల్స్డేకు కొలంబియా లోని క్విమ్ ఎంతో ప్రసిద్ధి. 

నార్వేలో వింత ఆచారం

 నార్వేలో క్రిస్మస్‌కు పదిహేను రోజుల ముందు వేడుకలు మొదలవుతాయి. ఇందులో భాగంగా క్రిస్మస్ రోజున ఇళ్లు అలంకరించుకునే ముందే అక్కడి వాళ్లంతా చీపుర్లను ఒక గదిలో దాచిపెడతారు. క్రిస్మస్ రోజున జపాన్ వాసులంతా చికెన్‌తో రకరకాల పదార్థాలు తయారు చేసుకుంటారు. చికెన్ ఫ్రై వంటకాలకు అక్కడ పోటీలు కూడా జరుగుతాయి. క్రిస్మస్ ప్రత్యేక రుచులకు స్వీడన్‌లో కూడా చాలా ఫేమస్. మొక్కజొన్న పిండితో చేసిన రోల్స్ లో మాంసాన్ని ఉంచి తయారు చేసే 'థమేల్స్' వంటకం తయారుచేస్తారు. క్రిస్మస్ రోజున వెనిజులాలో పొద్దుపొద్దున్నే స్కేటింగ్ చేసుకుంటూ చర్చికి వెళుతుంటారు. ఆ రోజు వాహనాలతో అక్కడంతా అత్యంత రద్దీగా ఉంటుంది. అందుకే ఇలా స్కేటింగ్ చేస్తూ పనులన్నీ చక్కబెట్టుకుంటారు. 

ముందే బహుమతులు

 క్రిస్మస్‌కు శాంటా క్లాజ్ పిల్లలకు బహుమతుల్ని అందించడం దాదాపు అన్ని దేశాల్లో ఉండేదే. అయితే, హాలెండ్లో మాత్రం ఇదొక ప్రత్యేక వేడుక. ఈ వేడుక జరిగేది క్రిస్మస్ రోజున కాదు. పండుగకు సరిగ్గా ఇరవై రోజుల ముందే. అంటే.. డిసెంబర్ 5న ఈ వేడుక నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి పిల్లలంతా తమకు బహుమతులు తెచ్చే శాంటా' కోసం గుమ్మం బయట క్యారెట్లు ఉంచుతుంటారు.

జర్మనీలో కూడా డిసెంబర్ 5న ఇలాంటి వేడుక ఉంటుంది. క్రిస్మస్ ముందు రోజు రాత్రి పిల్లలు తమ కోరికలను ఒక విష్‌లిస్టుగా రాసి ఇంటి ముందు వాటిని వేలాడదీస్తారు. అవన్నీ శాంటా చదువుతాడనేది వారి నమ్మకం.. అలాగే పిల్లలు తమ బూట్లను గుమ్మాల ముందు ఉంచుతారు. వాటిలో శాంటా క్లాజ్ బహుమతులు ఉంచుతాడు. రష్యాలోనూ ఇలాంటి వేడుకలున్నాయి. అయితే, అవి జరుపుకునేది జనవరి 7న. అయితే ఇక్కడ పిల్లలకు బహుమతులిచ్చేది శాంటా కాదు ఐబుష్కా. ఐబుష్మా అంటే అమ్మమ్మ అన్నమాట.

మెదక్‌లో వేడుకలు 

మెదక్ సీఎస్ఐ చర్చిలో తెల్లవారుజామున 4:00 గంటలకు హోలి కమ్యూనియన్ సర్వీస్ (ప్రాతకాల ఆరాధన) ఉంటుంది. సీఎస్ఐ మెదక్‌ డయాసిస్ బిషప్ రైట్ రెవరెండ్ ఏసీ సాల్మన్ భక్తులకు దైవ సందేశం ఇస్తారు. ఉదయం 10 గంటలకు జనరల్ సర్వీస్ ఉంటుంది. తర్వాత చర్చిలో ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలుపుతూ ఏర్పాటు చేసే పశువుల పాకను దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. అప్పటి నుంచే భక్తులకు గురువులు దీవెనలు అందిస్తుంటారు. సాయంత్రం 6 గంటల వరకు చర్చి సందర్శనకు అవకాశం ఉంటుంది.