
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ డబ్ల్యూపీఎల్ లో వరుసగా రెండో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో దుమ్మురేపిన ముంబై ఈ సారి బౌలింగ్‌లో మెరిసింది. అమేలియా కెర్ (4/17, 31) ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌కు తోడు షబ్నిమ్ ఇస్లాయిల్ (3/18), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (46 నాటౌట్) చెలరేగడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. టాస్ ఓడిన గుజరాత్ జెయింట్స్ తొలుత 20 ఓవర్లలో 126/9 స్కోరు మాత్రమే చేసింది. కెప్టెన్ బెత్ మూనీ (24) రాణించినా.. ముంబై బౌలర్ల దెబ్బకు వేదా కృష్ణమూర్తి (0), హర్లీన్ డియోల్ (8), ఫోబె లిచ్‌ఫీల్డ్ (7), హేమలత (3) నిరాశ పరిచారు. చివర్లో కేథరిన్ బ్రైస్ (25 నాటౌట్), తనూజ కన్వార్ (28) పోరాటంతో స్కోరు 120 దాటింది. అనంతరం ముంబై 18.1 ఓవర్లలోనే 129/5 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఓపెనర్లు యాస్తిక భాటియా (7), హేలీ మాథ్యూస్ (7) ఫెయిలైనా సివర్ బ్రంట్ (22), కెర్‌తో కలిసి హర్మన్ టార్గెట్‌ను కరిగించింది. కెర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.