
- 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపు
- రాణించిన లిచ్‌ఫీల్డ్, డాటిన్, తనుజా
బెంగళూరు: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రెండు వరుస పరాజయాల తర్వాత గుజరాత్ జెయింట్స్ మళ్లీ గాడిలో పడింది. ఆష్లే గాడ్నెర్ (31 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58, 1/22) ఆల్‌రౌండ్ షోకు ఫోబీ లిచ్‌ఫీల్డ్ (21 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 30 నాటౌట్) అండగా నిలవడంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెక్ పెట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 125/7 స్కోరు చేసింది. కనికా అహుజా (33) టాప్ స్కోరర్. రాఘవి బిస్త్ (22), జార్జియా వారెహామ్ (20 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.
తర్వాత గుజరాత్ 16.3 ఓవర్లలో 126/4 స్కోరు చేసి నెగ్గింది. లక్ష్య ఛేదనలో ఆరంభంలో గుజరాత్‌ను ఆర్‌సీబీ బౌలర్లు అడ్డుకున్నా.. తర్వాత ఫెయిలయ్యారు. రేణుకా సింగ్ (2/24), వారెహామ్ (2/26) కట్టుదిట్టంగా బాల్స్ వేయడంతో బెత్ మూనీ (17), హేమలత (11), హర్లీన్ డియోల్ (5) త్వరగానే ఔటయ్యారు. 66/3తో ఉన్న స్కోరు బోర్డును గాడ్నెర్, లిచ్‌ఫీల్డ్ గట్టెక్కించే బాధ్యత తీసుకున్నారు. ఈ ఇద్దరు ఆర్‌సీబీ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టారు. ఈ క్రమంలో గాడ్నెర్ 28 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసింది. నాలుగో వికెట్‌కు 51 రన్స్ జత చేసి గాడ్నెర్ వెనుదిరిగినా, లిచ్‌ఫీల్డ్ మెరుగ్గా ఆడి మరో 21 బాల్స్ మిగిలి ఉండగానే విజయాన్ని అందించింది. గాడ్నెర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బౌలర్లు అదుర్స్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరును గుజరాత్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. పేసర్ దియోంద్ర డాటిన్ (2/31), లెఫ్టార్మ్ స్పిన్నర్ తనుజా కన్వర్ (2/16)కు ఆష్లే గాడ్నెర్ (1/22), కశ్వీ గౌతమ్ (1/17) అండగా నిలిచారు. దీంతో టాప్ ఆర్డర్‌లో కెప్టెన్ స్మృతి మంధాన (10), డ్యానీ హోడ్జ్ (4), ఎలైస్ పెర్రీ (0) నిరాశపర్చడంతో పవర్‌ప్లేలోనే ఆర్‌సీబీ 25/3 స్కోరుతో కష్టాల్లో పడింది. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో పెర్రీ మూడుసార్లు 80 ప్లస్ స్కోరు చేసినా ఈ మ్యాచ్‌లో మాత్రం తేలిపోయింది. ఈ దశలో కనిక, రాఘవి కౌంటర్ అటాక్‌కు దిగారు. ప్రియా మిశ్రా బౌలింగ్‌లో కనిక వరుస బౌండరీలతో హోరెత్తించింది.
రెండో ఎండ్‌లో బిస్త్ కూడా మేఘనా సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడింది. ఇక ఫర్వాలేదనుకుంటున్న టైమ్‌లో ఐదు రన్స్ తేడాలో ఈ ఇద్దర్ని ఔట్ చేసిన గుజరాత్ మళ్లీ పైచేయి సాధించింది. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 37 బాల్స్‌లో 48 రన్స్ జత చేశారు. చివర్లో వారెహామ్, రిచా ఘోష్ (9) ఆరో వికెట్‌కు 21 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ కశ్వీ వేసిన సూపర్ యార్కర్‌కు రిచా ఔట్ కావడంతో ఇన్నింగ్స్ మళ్లీ కష్టాల్లో పడింది. కిమ్ గార్త్ (14) ఉన్నంతసేపు వేగంగా ఆడటంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 125/7 (కనికా 33, రాఘవి 22, తనుజా 2/16).
గుజరాత్: 16.3 ఓవర్లలో 126/4 (గాడ్నెర్ 58, లిచ్‌ఫీల్డ్ 30*, రేణుకా సింగ్ 2/24, వారెహామ్ 2/26).