ఢిల్లీ థ్రిల్లింగ్​ విక్టరీ .. ఆఖరి బాల్​కు ముంబై ఇండియన్స్‌‌పై గెలుపు

ఢిల్లీ థ్రిల్లింగ్​ విక్టరీ .. ఆఖరి బాల్​కు ముంబై ఇండియన్స్‌‌పై గెలుపు

ఢిల్లీ థ్రిల్లింగ్​ విక్టరీ .. ఆఖరి బాల్​కు ముంబై ఇండియన్స్‌‌పై గెలుపు
 రాణించిన షెఫాలీ, నిక్కీ.. బ్రంట్, హర్మన్ పోరాటం వృథా

వడోదర: ఆధిపత్యం చేతులు మారుతూ.. ఆఖరి బాల్‌‌‌‌ వరకూ హోరాహోరీగా సాగిన పోరులో థ్రిల్లింగ్‌‌‌‌ విక్టరీ సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌‌‌‌) మూడో సీజన్‌‌‌‌లో బోణీ చేసింది. శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో రెండు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌‌‌‌ను ఓడించింది. ముంబై ఇచ్చిన 165 రన్స్ టార్గెట్‌‌‌‌ను 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బాల్‌‌‌‌కు అందుకుంది. ఓపెనర్ షెఫాలీ వర్మ (18 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 43) మెరుపు ఆరంభం ఇవ్వగా..  అరంగేట్రం అమ్మాయి నిక్కీ ప్రసాద్ (33 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లతో 35) కీలక ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని గెలిపించింది. తొలుత ముంబై  19.1 ఓవర్లలో 164 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది.  సివర్ బ్రంట్ (59 బాల్స్‌‌‌‌లో 13 ఫోర్లతో 80 నాటౌట్‌‌‌‌) విజృంభించగా.. కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్ కౌర్ (22 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 42) ధనాధన్ బ్యాటింగ్‌‌‌‌తో అలరించింది. అనాబెల్ సదర్లాండ్ మూడు, శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టారు.  నిక్కీ ప్రసాద్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

షెఫాలీ మెరుపులు.. ఆదుకున్న నిక్కీ

టీమిండియాకు దూరమైన ఓపెనర్ షెఫాలీ వర్మ ఛేజింగ్‌‌‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌కు అదిరిపోయే ఆరంభం ఇచ్చింది.  సైకా ఇషాక్‌‌‌‌ వేసిన రెండో ఓవర్లోనే  నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌‌‌‌తో ఏకంగా 22 రన్స్ రాబట్టింది. మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌ మెగ్ లానింగ్‌‌‌‌ (15).. సివర్ బ్రంట్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో రెండు ఫోర్లతో ఆకట్టుకుంది. ఆపై హేలీ మాథ్యూస్ బౌలింగ్‌‌‌‌లో రెండు ఫోర్లు, సిక్స్‌‌‌‌తో విజృంభించిన షెఫాలీ తర్వాతి బాల్‌‌‌‌కే హర్మన్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో తొలి వికెట్‌‌‌‌కు 60 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. ఏడో ఓవర్‌‌‌‌‌‌‌‌ తొలి బాల్‌‌‌‌కే లానింగ్‌‌‌‌ను ఇస్మాయిల్ బౌల్డ్‌‌‌‌ చేయగా..  జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌ (2), అనాబెల్ సదర్లాండ్ (13) ఫెయిలయ్యారు.  దాంతో 60/0తో ఉన్న ఢిల్లీ ఒక్కసారిగా 76/4తో డీలా పడింది. ఈ టైమ్‌‌‌‌లో అండర్‌‌‌‌‌‌‌‌19 టీ20 వరల్డ్ కప్‌‌‌‌ విన్నింగ్ కెప్టెన్‌‌‌‌ నిక్కీ ప్రసాద్‌‌‌‌, ఎలైస్ కాప్సీ (16)  జాగ్రత్తగా ఆడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు కొడుతూ స్కోరు వంద దాటించారు. క్రీజులో కుదురుకున్న కాప్సీని 15వ ఓవర్లో ఔట్‌‌‌‌ చేసిన కెర్‌‌‌‌‌‌‌‌ కీలక బ్రేక్ ఇచ్చింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న ఈ దశలో నిక్కీకి తోడైన సారా బ్రైస్‌‌‌‌ (21)  వెంటవెంటనే రెండు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌తో అలరించింది. కానీ, ఢిల్లీ విజయానికి 25 రన్స్‌‌‌‌ అవసరమైన టైమ్‌‌‌‌లో బ్రైస్‌‌‌‌ను ఔట్ చేసిన మాథ్యూస్‌‌‌‌ మ్యాచ్‌ను  మరింత ఉత్కంఠగా మార్చింది. 19వ ఓవర్లో శిఖా పాండే (2) రనౌటైనా.. ఆఖరి బాల్‌‌‌‌కు సిక్స్ కొట్టిన రాధా యాదవ్ (9 నాటౌట్‌‌‌‌) ఢిల్లీని రేసులో నిలిపింది. కలిత వేసిన చివరి ఓవర్లో పది రన్స్ అవసరం అవ్వగా.. ఫస్ట్ బాల్‌‌‌‌కే ఫోర్ కొట్టిన నిక్కీ ఐదో బాల్‌‌‌‌కు ఔటైనా.. ఆఖరి బాల్‌‌‌‌కు అరుంధతి రెడ్డి (2 నాటౌట్‌‌‌‌) విజయానికి అవసరమైన  డబుల్ తీయడంతో  ఢిల్లీ గెలిచింది. 

సివర్‌‌‌‌‌‌‌‌, హర్మన్ జోరు

టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ మూడో బాల్‌‌‌‌కే ఓపెనర్ హేలీ మాథ్యూస్  (0)ను డకౌట్ చేసిన శిఖా పాండే ఢిల్లీకి తొలి బ్రేక్ అందించింది. కానీ, వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన సివర్ బ్రంట్‌‌‌‌ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్‌‌‌‌ చేసింది. మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌ యాస్తికా భాటియా (11)తో  రెండో వికెట్‌‌‌‌కు 31 రన్స్ జోడించింది. రెండు ఫోర్లతో ఊపు మీద కనిపించిన భాటియాను ఐదో ఓవర్లో బౌల్డ్ చేసిన శిఖా ముంబైని మరో దెబ్బకొట్టింది. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్ కౌర్ తోడుగా  బ్రంట్ ఇన్నింగ్స్‌‌‌‌ను నిర్మించింది. సివర్ క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టగా.. రాధా యాదవ్ వేసిన 8వ ఓవర్లో వరుసగా 4,6తో హర్మన్‌‌‌‌ టచ్‌‌‌‌లోకి వచ్చింది. అరుంధతి బౌలింగ్‌‌‌‌లో సివర్ ఫోర్ కొడితే.. హర్మన్‌‌‌‌ సిక్స్‌‌‌‌తో అలరించింది. సదర్లాండ్ వేసిన 11వ ఓవర్లో 4, 4,  6, 4తో స్టేడియాన్ని హోరెత్తించిన హర్మన్‌‌‌‌ మరో షాట్ ఆడే ప్రయత్నంలో నిక్కీ ప్రసాద్‌‌‌‌కు క్యాచ్ ఇచ్చి ఔటైంది. దాంతో  మూడో  వికెట్‌‌‌‌కు 73  రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. అయినా తన ధాటిని కొనసాగించిన బ్రంట్‌‌‌‌36 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. కానీ, మరో ఎండ్‌‌‌‌లో అమేలియా కెర్ (9), సజన (1), అమన్‌‌‌‌జోత్ (7), సంస్కృతి గుప్తా (2), కలిత (1), షబ్నిమ్ (0) పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఇంకోవైపు ఒంటరి పోరాటం చేసిన బ్రంట్  స్కోరు 160 దాటించింది.

సంక్షిప్త స్కోర్లు

ముంబై: 19.1 ఓవర్లలో 164 ఆలౌట్ 
(సివర్ బ్రంట్‌‌‌‌ 80 నాటౌట్‌‌‌‌, హర్మన్‌‌‌‌ 42, సదర్లాండ్ 3/34)) 
ఢిల్లీ:  20 ఓవర్లలో 165/8 (షెఫాలీ 43, నిక్కీ ప్రసాద్‌‌‌‌ 35, కెర్ 2/22, 
హేలీ మాథ్యూస్ 2/31)