
- వారియర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరి!
- 8 రన్స్‌తో గెలిచిన గుజరాత్
- సత్తా చాటిన షబ్నమ్
న్యూఢిల్లీ : ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ నిరాశ పరిచింది. దీప్తి శర్మ (60 బాల్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 నాటౌట్) అద్భుతంగా పోరాడినా తమ ఆఖరి మ్యాచ్‌లో యూపీకి ఓటమి తప్పలేదు. గుజరాత్ జెయింట్స్ పేసర్, ఏపీకి చెందిన 16 ఏండ్ల షబ్నమ్ షకీల్ (3/11) సూపర్ బౌలింగ్‌తో ఆ జట్టు ఆశలపై నీళ్లు కుమ్మరించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 8 రన్స్ తేడాతో యూపీని ఓడించింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదోసారి ఓడిన యూపీ (6 పాయింట్లు) నెగెటివ్ రన్‌రేట్ (–0.371)తో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్ర్కమించింది. తొలుత గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 152/8 స్కోరు చేసింది. కెప్టెన్ బెత్ మూనీ (52 బాల్స్‌లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 74 నాటౌట్) ఫిఫ్టీతో సత్తా చాటగా, లారా వోల్‌వర్ట్ (30 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 43) రాణించింది. యూపీ బౌలర్లలో ఎకిల్‌స్టోన్ మూడు, దీప్తి రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో యూపీ ఓవర్లన్నీ ఆడి 144/5 స్కోరు మాత్రమే చేసింది. దీప్తితో పాటు పూనమ్ ఖెమ్నర్ (36 నాటౌట్) పోరాడింది. గుజరాత్ బౌలర్ షబ్నమ్ షకీల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఓపెనర్ల మోత
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు ఓపెనర్లు మూనీ, వోల్‌వర్ట్ మంచి ఆరంభం ఇచ్చారు. ముఖ్యంగా వోల్‌వర్ట్ దూకుడుగా ఆడింది. తొలి ఓవర్లోనే బౌండ్రీతో ఖాతా తెరిన ఆమె అంజలి వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు, సైమా వేసిన నాలుగో ఓవర్లో మూడు ఫోర్లతో విజృంభించింది. గ్రేస్ హారిక్‌కు రెండు బౌండ్రీలతో వెల్‌కం చెప్పిన లారా.. గైక్వాడ్ వేసిన ఆరో ఓవర్లో మిడాఫ్ మీదుగా సిక్స్ కొట్టింది. ఆమె జోరుతో పవర్ ప్లేలో గుజరాత్ 53/0 స్కోరు చేసింది. ఫీల్డింగ్ మారిన తర్వాత యూపీ బౌలర్లు పుంజుకున్నారు. ఎనిమిదో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన ఎకిల్‌స్టోన్ ఫ్లయిటెడ్ బాల్‌తో వోల్‌వర్ట్‌ను స్టంపౌట్ చేసి తొలి వికెట్‌కు 60 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేసింది. తర్వాతి ఓవర్లోనే హేమలత (0)ను చామరి ఆటపట్టు పెవిలియన్ చేర్చగా, ఫోబ్ లిచ్‌ఫెల్డ్ (4)ను దీప్తి శర్మ ఔట్ చేసింది. 7 నుంచి 11 ఓవర్ల మధ్యలో మూడు వికెట్లు కోల్పోయిన గుజరాత్ ఒకే ఫోర్ రాబట్టి డీలా పడింది. ఈ టైమ్‌లో మూనీ ఒక్కసారిగా గేరు మార్చింది. ఎకిల్‌స్టోన్ బౌలింగ్‌లో 6, 4తో జోరందుకుంది. గార్డ్‌నర్ (15) ఓ ఫోర్, సిక్స్ కొట్టి ఔటవగా, భార్తి ఫుల్మాలి (1) నిరాశ పరిచింది. కేథరిన్ బ్రైస్ (11), తనూజ (1) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఈ ఇద్దరినీ ఎకిల్‌స్టోన్ పెవిలియన్ చేర్చడంతో గుజరాత్ 18 ఓవర్లకు 120/7తో నిలిచింది. అదే ఓవర్లో శ్వేత క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన బెత్ మూనీ చివర్లో మళ్లీ దూకుడు పెంచింది. దీప్తి వేసిన 18వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఆమె ఇచ్చిన మరో క్యాచ్‌ను డ్రాప్ చేసిన యూపీ మూల్యం చెల్లించుకుంది. ఎకిల్‌స్టోన్ వేసిన చివరి ఓవర్లో హ్యాట్రిక్ సహా ఐదు ఫోర్లతో ఏకంగా 21 రన్స్ రాబట్టిన మూనీ గుజరాత్ స్కోరు 150 మార్కు దాటించింది.
షబ్నమ్ దెబ్బ.. దీప్తి ధనాధన్
నార్మల్ టార్గెట్ ఛేజింగ్‌లో యూపీకి స్టార్టింగ్‌లోనే వరుస షాక్‌లు తగిలాయి. షబ్నమ్ దెబ్బకు టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి ఓవర్లోనే కెప్టెన్ అలీసా హేలీ (4), చామరి ఆటపట్టు (0)ను ఔట్ చేసిన షబ్నమ్ ప్రత్యర్థిని దెబ్బకొట్టింది. తర్వాతి ఓవర్లోనే కిరణ్ నవగిరె (0) కేథరిన్ బ్రైస్ డకౌట్ చేయగా.. ఫామ్‌లో ఉన్న గ్రేస్ హారిస్ (1) సైతం నిరాశ పరిచింది. తను గార్డ్‌నర్‌కు వికెట్ ఇచ్చుకోవడంతో యూపీ 16/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ టైమ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకుంది. కాసేపు సపోర్ట్ ఇచ్చిన శ్వేతా సెహ్రావత్ (8)ను షబ్నమ్ ఐదో వికెట్‌గా పెవిలియన్ చేర్చినా దీప్తి తన పోరాటాన్ని కొనసాగించింది. ఏడో నంబర్‌లో వచ్చిన పూనమ్ ఖెమ్నర్ నుంచి ఆమెకు మంచి సపోర్ట్ లభించింది. 42 బాల్స్‌లో 90 రన్స్ అవసరమైన దశలో దీప్తి తనలోని హిట్టర్‌ను నిద్రలేపింది. గార్డ్‌నర్ వేసిన 14వ ఓవర్లో తను భారీ సిక్స్ కొట్టగా, ఖెమ్నర్ ఫోర్ రాబట్టింది. తర్వాతి ఓవర్లో మరో బౌండ్రీతో దీప్తి వరుసగా మూడో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. బ్రైస్ బౌలింగ్‌లో దీప్తి, మన్నత్ ఓవర్లో ఖెమ్నర్ చెరో సిక్స్ రాబట్టడంతో చివరి 18 బాల్స్‌లో యూపీకి 43 రన్స్ అవసరం అయ్యాయి. కానీ, 18వ ఓవర్లో మేఘనా సింగ్ మూడే రన్స్ ఇచ్చింది. తనూజ వేసిన తర్వాతి ఓవర్లో ఖెమ్నర్ రెండు ఫోర్లు సహా 14 రన్స్ రాబట్టింది. దాంతో చివరి ఓవర్లో యూపీకి 26 రన్స్ అవసరం అయ్యాయి. మేఘన వేసిన ఈ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో ఆశలు రేపిన దీప్తి చివరి రెండు బాల్స్‌కు పది రన్స్ సాధించలేకపోయింది. దాంతో యూపీకి ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్ : 20 ఓవర్లలో 152/8 (మూనీ 74 నాటౌట్, వోల్‌వర్ట్ 43, ఎకిల్‌స్టోన్ 3/38).
యూపీ : 20 ఓవర్లలో 144/5 (దీప్తి 88 నాటౌట్, షబ్నమ్ 3/11)