WPL: ముంబై మెరిసెన్‌‌‌‌.. 6 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలుపు

WPL: ముంబై మెరిసెన్‌‌‌‌.. 6 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలుపు

లక్నో: ఛేజింగ్‌‌‌‌లో నిలకడగా ఆడిన ముంబై ఇండియన్స్‌‌‌‌.. డబ్ల్యూపీఎల్‌‌‌‌లో కీలక విజయాన్ని అందుకుంది. హేలీ మాథ్యూస్‌‌‌‌ (46 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 68), సివర్‌‌‌‌ బ్రంట్‌‌‌‌ (37) చెలరేగడంతో.. గురువారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ముంబై 6 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌‌‌‌కు చెక్‌‌‌‌ పెట్టింది. తద్వారా ప్లే ఆఫ్స్‌‌‌‌కు మరింత చేరువైంది. టాస్‌‌‌‌ ఓడిన యూపీ 20 ఓవర్లలో 150/9 స్కోరు చేసింది. జార్జియా వోల్‌‌‌‌ (33 బాల్స్‌‌‌‌లో 12 ఫోర్లతో 55), గ్రేస్‌‌‌‌ హారిస్‌‌‌‌ (28), దీప్తి శర్మ (27) మెరుగ్గా ఆడారు. తర్వాత ముంబై 18.3 ఓవర్లలో 153/4 స్కోరు చేసింది. మాథ్యూస్‌‌‌‌ కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

కెర్ర్ ‘పాంచ్‌‌‌‌’..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన యూపీకి మెరుగైన ఆరంభం దక్కినా.. మిడిలార్డర్‌‌‌‌ వైఫల్యంతో భారీ స్కోరు చేయలేకపోయింది. పవర్‌‌‌‌ప్లేను బాగా ఉపయోగించుకున్న ఓపెనర్లు హారిస్‌‌‌‌, వోల్‌‌‌‌ తొలి వికెట్‌‌‌‌కు 74 రన్స్‌‌‌‌ జోడించారు. 8వ ఓవర్‌‌‌‌లో హారిస్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి మాథ్యూస్‌‌‌‌ (1/16) మొదలుపెట్టిన వికెట్ల పతనాన్ని అమెలియా కెర్ర్ (5/38) చివరి వరకు కొనసాగించింది. 10వ ఓవర్‌‌‌‌లో కిరణ్‌‌‌‌ నవ్‌‌‌‌గిరే (0) డకౌట్‌‌‌‌ కాగా, 29 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ చేసిన వోల్‌‌‌‌ను తర్వాతి ఓవర్‌‌‌‌లో బ్రంట్‌‌‌‌ (1/16) దెబ్బకొట్టింది. దీంతో స్కోరు 90/3గా మారింది. 

ఈ దశలో దీప్తి నిలకడగా ఆడినా.. అవతలి వైపు కెర్ర్ డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చింది. 15వ ఓవర్‌‌‌‌లో మూడు బాల్స్‌‌‌‌ తేడాలో దినేశ్‌‌‌‌ వ్రిందా (10), చినెల్లీ హెన్రీ (6)ని ఔట్‌‌‌‌ చేసింది. నాలుగో వికెట్‌‌‌‌కు దీప్తి, వ్రిందా మధ్య 24 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. 16వ ఓవర్‌‌‌‌లో మాథ్యూస్‌‌‌‌ (2/25) దెబ్బకు శ్వేత షెరావత్‌‌‌‌ (0) వెనుదిరిగింది. తర్వాతి ఓవర్‌‌‌‌లోనే ఉమా ఛెత్రి (1) కూడా పారునికా సిసోడియా (1/21)కు వికెట్‌‌‌‌ ఇచ్చుకుంది. ఈ టైమ్‌‌‌‌లో ఎకెల్‌‌‌‌స్టోన్‌‌‌‌ (16) మెరుగ్గా ఆడే ప్రయత్నం చేసినా కెర్ర్ కుదురుకోనీయలేదు. ఆఖరి ఓవర్‌‌‌‌లో మూడు బాల్స్ తేడాతో దీప్తి, ఎకెల్‌‌‌‌స్టోన్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసింది. ఎనిమిదో వికెట్‌‌‌‌కు 20 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ కావడంతో యూపీ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.

మాథ్యూస్‌‌‌‌ సూపర్‌‌‌‌..

ఛేజింగ్‌‌‌‌లో ముంబైకి మాథ్యూస్‌‌‌‌ మెరుపు ఆరంభాన్నిచ్చింది. మూడో ఓవర్‌‌‌‌లోనే కెర్ర్ (10) ఔట్‌‌‌‌ కావడంతో తొలి వికెట్‌‌‌‌కు 24 రన్స్‌‌‌‌ జతయ్యాయి. మాథ్యూస్‌‌‌‌తో జతకలిసిన సివర్‌‌‌‌ బ్రంట్‌‌‌‌ యూపీ బౌలింగ్‌‌‌‌ను దీటుగా ఎదుర్కొంది. దీంతో పవర్‌‌‌‌ప్లేలో ముంబై 50/1 స్కోరుతో మంచి స్థితిలో నిలిచింది. పవర్‌‌‌‌ప్లే తర్వాత కూడా ఈ ఇద్దరి జోరు తగ్గలేదు. ఓవర్‌‌‌‌కు ఆరుకు పైగా రన్స్‌‌‌‌ రాబట్టడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. 

ఈ క్రమంలో మాథ్యూస్‌‌‌‌  35 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసింది. బ్రంట్‌‌‌‌ కూడా బ్యాట్‌‌‌‌ ఝుళిపించడంతో 11 ఓవర్లలో స్కోరు వంద దాటింది. ఇక ఫర్వాలేదనుకుంటున్న టైమ్‌‌‌‌లో 13వ ఓవర్‌‌‌‌లో హారిస్‌‌‌‌ (2/11).. బ్రంట్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి రెండో వికెట్‌‌‌‌కు 92 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేసింది. తర్వాతి ఓవర్‌‌‌‌లో మాథ్యూస్‌‌‌‌ కూడా వెనుదిరగడంతో స్కోరు 127/3గా మారింది. హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ (4) నిరాశపర్చినా.. అమన్‌‌‌‌జ్యోత్‌‌‌‌ కౌర్‌‌‌‌ (12 నాటౌట్‌‌‌‌), యాస్తిక భాటియా (10 నాటౌట్‌‌‌‌) మెరుగ్గా ఆడి విజయానికి అవసరమైన రన్స్‌‌‌‌ అందించారు. 

సంక్షిప్త స్కోర్లు


యూపీ: 20 ఓవర్లలో 150/9 (జార్జియా వోల్‌‌‌‌ 55, హారిస్‌‌‌‌ 28, కెర్ర్ 5/38). ముంబై: 18.3 ఓవర్లలో 153/4 (మాథ్యూస్‌‌‌‌ 68, బ్రంట్‌‌‌‌ 37, హారిస్‌‌‌‌ 2/11).