WPL :ఢిల్లీదే ఫైనల్ బెర్తు ..ఆర్సీబీ చేతిలో ఓడిన ముంబై

WPL :ఢిల్లీదే ఫైనల్ బెర్తు ..ఆర్సీబీ చేతిలో ఓడిన ముంబై

ముంబై:  డబ్ల్యూపీఎల్‌‌‌‌ మూడో సీజన్‌‌‌‌లో టాప్ ప్లేస్‌‌‌‌తో నేరుగా ఫైనల్‌‌‌‌ చేరాలని ఆశించిన ముంబై ఇండియన్స్‌‌‌‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) షాకిచ్చింది. మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌‌‌‌లో ఆర్సీబీ 11 రన్స్ తేడాతో ముంబైని ఓడించింది. దాంతో ముంబై రెండో ప్లేస్‌‌‌‌తో పరిపెట్టుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ టాప్ ప్లేస్‌‌‌‌తో ఫైనల్‌‌‌‌ చేరుకుంది. ప్లేఆఫ్స్ చేరలేకపోయిన మంధానసేన లీగ్‌‌‌‌ను విజయంతో ముగించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 199/3 స్కోరు చేసింది.

 కెప్టెన్ స్మృతి మంధాన (37 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 53) ఫిఫ్టీ కొట్టగా.. ఎలైస్ పెర్రీ (49 నాటౌట్‌‌‌‌), రిచా ఘోష్ (36), జార్జియా వారెహమ్ (10 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు,1 సిక్స్‌‌‌‌తో 31 నాటౌట్‌‌‌‌) ఆకట్టుకున్నారు. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో ముంబై  ఓవర్లన్నీ ఆడి  188/9 స్కోరు చేసి ఓడింది. సివర్ బ్రంట్ (35 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 69) పోరాడినా ఫలితం లేకపోయింది.  స్నేహ్‌‌‌‌ రాణా మూడు వికెట్లు పడగొట్టింది. ఆమెకే ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.  కాగా, పాయింట్ల పట్టికలో 2,3వ స్థానాల్లో నిలిచిన ముంబై, గుజరాత్ గురువారం జరిగే ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌లో పోటీ పడతాయి. ఇందులో నెగ్గిన జట్టు శనివారం ఢిల్లీతో ఫైనల్లో తలపడనుంది.